ధరల కిక్కుకు.. ఇక చెక్!
‘మందు’స్తు వ్యూహం !
- మద్యం దుకాణాల్లో హేలోగ్రాఫిక్ మెషీన్లు తప్పనిసరి
- బిల్లింగ్ విధానంలో మార్పులు
- పది రోజుల్లో జిల్లాలో అమలు
రాజమండ్రి రూరల్ : మద్యం దుకాణాల్లో అధిక ధరల విక్రయాలకు చెక్ పెట్టేందుకు ఆశాఖ అధికారులు రంగం సిద్ధం చేశారు. ఇకపై హేలోగ్రాఫిక్ తప్పనిసరి చేస్తూ సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. బిల్లింగ్ విధానంలోనూ మార్పులు తేనున్నారు. అన్ని సక్రమంగా జరిగితే పదిరోజుల్లో జిల్లాలో ఈ నూతన ప్రక్రియను అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
జిల్లాలో ఎమ్మార్పీ కంటే అధిక ధరకు మద్యం విక్రయాలు సాగించకుండా సరికొత్త విధానాన్ని మద్యం దుకాణాల్లో ప్రవేశపెడుతున్నామని గతం నుంచీ అధికారులు చెబుతూ వస్తున్నారు. వాణిజ్యకేంద్రాల్లో ఉండే హేలోగ్రాఫిక్ బిల్లింగ్ సిస్టంను జిల్లాలోని మద్యంషాపుల్లో ఏర్పాటు చేస్తామన్నారు. కానీ నేటీకీ ఆచరణలో పెట్టలేకపోయారు. ఈలోపు కొత్త మద్యం పాలసీ వచ్చింది. ఆగస్టు ఒకటి నుంచి శాశ్వత లెసైన్‌స మంజూరు చేయనున్నారు. అది కావాలంటే హేలోగ్రాఫిక్ విధానం మద్యం దుకాణాలలో తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి.
2015-17 ఎక్సైజ్ పాలసీతో జిల్లాలో 562 మద్యంషాపులకు జూన్ 22న కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. వీటిలో 57 షాపులను పూర్తిగా ప్రభుత్వం నిర్వహించనుంది. మిగతా 505 షాపులను ప్రైవేటు వ్యక్తులకు కేటాయించగా, అందులో 458 షాపులు నడుస్తున్నాయి. మిగతా 47 షాపులకు ఎటువంటి దరఖాస్తులు రాలేదు. రెండేళ్ల కాలానికి ఇచ్చే ఈ లెసైన్‌స 2017 జూన్30 వరకు చెల్లుబాటులో ఉంటుంది. అయితే షాపులు దక్కించుకున్న వారికి తాత్కాలిక లెసైన్‌సలు మాత్రమే ఇచ్చారు. లాటరీ ముగిసిన 15 రోజుల్లోపు బ్యాంకు గ్యారంటీలు చెల్లించి పర్మినెంట్ లెసైన్‌సలు పొందాలని సూచించారు. కొంత మంది గ్యారంటీలు చెల్లించకపోవడంతో ఈనెలాఖరు వరకు గడువు పెంచారు. ఆగస్టు ఒకటిన శాశ్వత లెసైన్‌సలు మంజూరు చేయనున్నారు. ప్రతి ఒక్కరూ హోలోగ్రాఫిక్ సిస్టంను ఏర్పాటు చేయాల్సిందేన ని అధికారులు చెబుతున్నారు.
హేలోగ్రామ్ ఏం చేస్తుంది..
మద్యం బాటిల్‌పై ఉండే హోలోగ్రామ్‌ను హేలోగ్రాఫిక్ పరికరం వద్ద ఉంచితే ఆటోమేటిక్‌గా దాని ధర కంప్యూటర్‌లో నమోదై బిల్లు వచ్చేస్తుంది. మద్యం ప్రియులు బిల్లు తీసుకుని దాని మేరకే సొమ్ము చెల్లిస్తారు. ఇప్పటికే ఈ పరికరాలు చాలా మద్యం దుకాణాలకు చేరాయి. ఈ ఏడాది ఎక్సైజ్ పాలసీలో కొత్త నిబంధనలు పెట్టారు. రెండేళ్ల కాలానికి సంబంధించి ఆదాయ పన్ను ధ్రువీకరణపత్రాలు సమర్పించాలని, వ్యాట్ పరిధిలో ఉంటే సంబంధిత పత్రం చెల్లించవచ్చన్నారు. వీటితో పాటే ఇప్పుడు హేలోగ్రాఫిక్ బిల్లింగ్ సిస్టంను తప్పనిసరి చేశామని ఎక్సైజ్ అధికారులు అంటున్నారు. దీనివల్ల మద్యం దుకాణాల అమ్మకాలు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ కార్యాలయాలకు, బేవరేజస్ డిపోలకు, మద్యం కంపెనీలకు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌ద్వారా తెలిసే అవకాశం ఉంటుంది.
కనెక్టవిటీకి టైం పడుతుంది
ఇప్పటికే మద్యం దుకాణాలలో హేలోగ్రాఫిక్ మెషీన్లు ఏర్పాటు చేస్తున్నారు. అయితే మద్యం దుకాణాల నుంచి మద్యం డిపోలకు, ఎక్సైజ్ కార్యాలయాలకు అనుసంధానం చేయాల్సి ఉంది. ఈసిస్టమ్ అంతా హైదరాబాద్ నుంచి కనెక్టవిటీ చేయాల్సి ఉంది. సుమారు పదిరోజుల వరకు టైం పట్టే అవకాశం ఉంది.
- వివేకానందరె డ్డి, డిప్యూటీ కమిషనర్,
ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్‌శాఖ