కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని ఐద్వా నాయకురాలు దుగ్గిరాల అన్నపూర్ణమ్మ మండిపడ్డారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలని కోరుతూ బుధవారం డీవైఎఫ్‌ఐ, ఐద్వా, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో స్థానిక గాంధీ విగ్రహం నుంచి కలెక్టరేట్ వరకు వివిధ కూరగాయలు, గ్యాస్ సిలిండర్లతో ప్రదర్శన నిర్వహించారు.
నెల్లూరు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని ఐద్వా నాయకురాలు దుగ్గిరాల అన్నపూర్ణమ్మ మండిపడ్డారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలని కోరుతూ బుధవారం డీవైఎఫ్‌ఐ, ఐద్వా, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో స్థానిక గాంధీ విగ్రహం నుంచి కలెక్టరేట్ వరకు వివిధ కూరగాయలు, గ్యాస్ సిలిండర్లతో ప్రదర్శన నిర్వహించారు.
అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా అన్నపూర్ణమ్మ మాట్లాడారు. కూరగాయల ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్య ప్రజలు కూరలు చేసుకునే పరిస్థితుల్లో లేరని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం రైతు బజార్లలో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటుచేసి తక్కువ ధరలకే కూరగాయల విక్రయాలు జరపాలన్నారు. పెంచిన గ్యాస్ ధరను తగ్గించాలని కోరారు. రెండు నెలలుగా ఉపాధి కూలీలకు బకాయిలు చెల్లించలేదని, వెంటనే అందజేయాలని డిమాండ్ చేశారు. కొన్ని రేషన్ దుకాణాల్లో అమ్మహస్తం సరుకులను ఇవ్వడంలేదని ఆరోపించారు. తక్షణమే సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కలెక్టర్ లేకపోవడంతో ఆయన చాంబర్‌లోని కుర్చీలో వినతిపత్రాన్ని ఉంచారు. నాయకులు అరిగెల రమమ్మ, షాహినాబేగం, విజయమ్మ, సెల్వమ్మ, యాదగిరి, ప్రసాద్ పాల్గొన్నారు.