- జాబితాల కోసం రైతుల ఉరుకులు, పరుగులు
- ఎంతమంది పేర్లున్నాయనేది చెప్పలేకపోతున్న బ్యాంకర్లు
మచిలీపట్నం : రుణమాఫీ జాబితాలను ప్రభుత్వం ఎట్టకేలకు విడుదల చేసింది. ఆదివారం ఈ వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచింది. ఈ నెల నాలుగో తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రుణమాఫీ జాబితాలను ఆరో తేదీన ప్రకటిస్తామని చెప్పగా.. ఒకరోజు ఆలస్యంగా ఈ జాబితాలను ఆన్‌లైన్‌లో ఉంచారు.
ఆదివారం సాయంత్రం నుంచి పలువురు రైతులు జాబితాలో తమ పేర్లు ఉన్నాయో తెలుసుకునేందుకు నెట్ సెంటర్లు, మీ-సేవ కేంద్రాలు,బ్యాంకులకు వెళ్లినా ఫలితం లేకపోయింది. గ్రామీణ ప్రాంతంలో నెట్ సెంటర్లు మూసి ఉండటంతో వివరాలు తెలుసుకునేందుకు రైతులు ఇబ్బందులు పడ్డారు. రూ.50 వేల లోపు రుణం ఉన్నవారికి 20 శాతం మాత్రమే నగదు జమ చేస్తామని శనివారం సాయంత్రం ఆయా బ్యాంకులకు సమాచారం అందింది. ఆదివారం ఉదయానికి ఈ సమాచారాన్ని నిలిపివేసినట్లు బ్యాంకు అధికారులు చెబుతున్నారు.
రుణమాఫీకి సంబంధించి గ్రామ, మండల, జిల్లాస్థాయిలో వివరాలు అందుబాటులో లేవు. గతంలోనే బ్యాంకులకు రుణమాఫీ జాబితాలు ఇచ్చినా ప్రభుత్వం ఆదేశాల మేరకు వాటిని బయట పెట్టలేదు. ఆదివారం ఈ జాబితాలను ఆన్‌లైన్‌లో ఉంచారు. ఎంతమంది రైతులకు రుణమాఫీ జరిగిందనే అంశంపై బ్యాంకు అధికారులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. సోమవారం సాయంత్రానికి ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
కుటుంబపరంగా వివరాలు...
రుణమాఫీ జాబితాలను కుటుంబంలోని సభ్యుల పేర్లు.. ఎంత విస్తీర్ణానికి ఎంత రుణం తీసుకున్నారు.. ఏ తేదీన తీసుకున్నారు.. తీసుకున్న రుణం ఎంత.. ఎకరానికి రూ.19 వేలు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ (కొలమానం) ప్రకారం బకాయిలో ఎంత మొత్తం రద్దవుతుంది.. ఇప్పటివరకు ఈ రుణానికి ఎంత వడ్డీ అయ్యింది.. తదితర అంశాలు వివరంగా చూపారు. రూ.50 వేలకు పైబడి పంట రుణం ఉంటే 2014-15లో జమ చేసిన మొత్తం వద్ద జీరో చూపారు. ఉదాహరణకు ఒక రైతు ఎస్‌బీఐ గూడూరు బ్రాంచ్‌లో 2.75 ఎకరాలకు 2013 జూన్ ఆరో తేదీన రూ.68 వేలు రుణం తీసుకుంటే ఇప్పటివరకు ఈ మొత్తం వడ్డీతో కలుపుకొని రూ.71,419 అయ్యింది.
స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం 2.75 ఎకరాలకు రూ.52,250 రుణమాఫీ కింద గుర్తించి ఈ మొత్తానికి వడ్డీతో కలిపి రూ.54,877 రుణమాఫీ అవుతుందని చూపారు. రైతుకు సంబంధించిన బ్యాంకు ఖాతా నంబరు, బ్యాంకు పేరు, బ్రాంచ్ పేరు నమోదు చేస్తేనే ఈ వివరాలు ఆన్‌లైన్‌లో వస్తున్నాయి. జిల్లాలో 7.03 లక్షల మంది రైతులకు గాను రూ.9,137 కోట్ల పంట రుణాలు బకాయిలు ఉన్నాయి. ఇందులో ఎంతమంది పేర్లు జాబితాలో ఉన్నాయో వేచిచూడాలి.
రుణమాఫీ జాబితాలు. . ఆన్‌లైన్‌లో
Published Mon, Dec 8 2014 1:56 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement