పలాస,న్యూస్‌లైన్: స్థానిక సంస్థలకు జరగనున్న ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయదని మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. కాశీబుగ్గ మహాత్మగాంధీ విగ్రహం కూడలి వద్ద సోమవారం నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం సమైక్యాంధ్రగా ఉండాలంటే చట్ట సభలైన శాసనసభ, పార్లమెంటులో మన ప్రాతినిధ్యం ఉండాలని, ఆ లక్ష్యంతోనే తమ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని వెల్లడించారు. దురదృష్టవశాత్తు తెలుగుదేశం పార్టీ మొదట లేఖ ఇచ్చి రాష్ట్ర విభజనకు పూర్తి మద్దతు పలికిందన్నారు.
బీజేపీ కూడా లేఖ ఇచ్చిందన్నారు. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో విభజనకు సహకరించిన వారికి ఓటు వేస్తారా? సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న వారికి ఓటు వేస్తారా... తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. జిల్లాతో తన తండ్రి అమరనాథరెడ్డికి మంచి సంబంధాలున్నాయన్నారు. జై సమైక్యాంధ్ర పార్టీని పెట్టింది ఎన్నికల తరువాత కాంగ్రెసులో కలిసి పోవడానికి కాదన్నారు. పలాసకు ఒక ప్రత్యేకత ఉందని, అందుకే ఎన్నికల ప్రచారాన్ని ఇక్కడ నుంచే పారంభిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు హర్షకుమార్, సబ్బం హరి, మాజీ ఎంపీ డాక్టర్ కణితి విశ్వనాథం, ఎమ్మెల్యే కొర్ల భారతి, మాజీ ఎమ్మెల్యే బగ్గు లక్ష్మణరావు, డాక్టర్ దువ్వాడ జీవితేశ్వరరావు, పాలవలస వైకుంఠరావు, వైశ్యరాజు రాజు, సీనియర్ న్యాయవాది పైల రాజరత్నంనాయుడు పాల్గొన్నారు.
విభజన కోరిన పార్టీలను గెలిపించొద్దు
శ్రీకాకుళం సిటీ:రాష్ట్ర విభజనకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన పార్టీల అభ్యర్థులను రానున్న ఎన్నికల్లో గెలిపించచవద్దని జై సమైక్యాంధ్ర పార్టీ అధినేత కిరణ్ కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం రాత్రి శ్రీకాకుళంలోని వైఎస్‌ఆర్ కూడలిలో ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. తెలుగు ప్రజలకు విభజన నిర్ణయంతో జరిగిన అవమానాన్ని భరించలేక సుప్రీం కోర్టులో పిటీషన్ వేసామని, రెండు వారాల్లో విభజనను నిలిపివేసేలా నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నామన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అసెంబ్లీలో రాష్ట్ర విభజనపై ఒక్క మాటైనా మాట్లాడకుండా, ఇప్పుడు రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తానని అనడం హాస్యాస్పదమన్నారు. మాజీ ఎంపీ కణితి విశ్వనాథం మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం ఉద్యమం చేసిన నిజమైన నేత కిరణ్ అన్నారు.
నిరాశా కిరణం..!
కొత్త రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత జిల్లా పర్యటనకు వచ్చిన కిరణ్ రెడ్డికి సోమవారం చేదు అనుభవాలే మిగిలాయి. ముందుగా పలసలో మొదలు పెట్టిన రోడ్‌షోకు పెద్దగా జనం లేకపోవడంతో సాయంత్రం వరకు స్థానిక నేత జీవితేశ్వరరావు ఇంట్లో ఉండిపోయిన కిరణ్, ఆ తర్వాత కొద్ది పాటి జనం నడుమే రోడ్‌షో నిర్వహించి, అక్కడి నుంచి హైవే మీదుగా పెద్దపాడు, రామలక్ష్మణ కూడలి, సూర్యామహల్ మీదుగా ఏడుర్లో కూడలికి చేరకున్నారు. అయితే శ్రీకాకుళంలో కూడా ఊహించిన మేరకు జనం రాకపోవడంతో కిరణ్ కాస్తా నిరాశా కిరణ్‌గా కన్పించారు. పలుమార్లు జైసమైక్యాంధ్రా అంటూ నినాదాలు చెయ్యమంటూ జనానికి చెప్పినప్పటికీ, స్పందన లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు.
శ్యామలరావుకు నివాళి
ఇటీవల మృతి చెందిన మాజీ మంత్రి చిగిలిపల్లి శ్యామలరావుకు కిరణ్ నివాళులర్పించారు. బలగ సమీపంలోని శ్యామరావు నివాసానికి వెళ్లిన కిరణ్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్యామలరావు మంచి రాజకీయ వేత్త అని కొనియాడారు.