జిల్లా వ్యాప్తంగా 65 మండలాల్లో స్థానిక సమరానికి సన్నాహాలు పూర్తయ్యాయి. జెడ్‌పీటీసీ, ఎంపీటీసీల రిజర్వేషన్లను జిల్లా పరిషత్ అధికారులు శుక్రవారం ప్రకటించారు. ఈ వివరాలను పంచాయతీరాజ్ కమిషనర్‌కు పంపారు. జెడ్‌పీ చైర్మన్, ఎంపీపీల రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తే ఎన్నికల నగారా మోగనుంది.
స్థానిక ఎన్నికలు జరిపి తీరాల్సిందేనని, సోమవారంలోపు నోటిఫికేషన్ ఇవ్వకపోతే కోర్టు ధిక్కరణ కింద పరిగణిస్తామని దేశ సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం స్పష్టం చేసింది. దీంతో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆగమేఘాలపై ప్రారంభించాయి.
సోమవారం నోటి ఫికేషన్
జెడ్‌పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్ రావచ్చునని జిల్లా పరిషత్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం, పంచాయతీరాజ్ కమిషనర్ నుంచి సమాచారం అందినట్లు తెలుస్తోంది. జిల్లాలో 65 జెడ్‌పీటీసీ, 901 ఎంపీటీసీ, 65 ఎంపీపీ స్థానాలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించనుంది. ఈ ఎన్నికలకు ఎంపీడీవోలే ఎన్నికల అధికారులుగా వ్యవహరించనున్నారు. జెడ్పీ సీఈవో వేణుగోపాల్‌రెడ్డి స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వివరాలను ఇప్పటికే కలెక్టర్, ఎన్నికల అథారిటీ కె.రాంగోపాల్ దృష్టికి తీసుకెళ్లారు.
రాజకీయ నేతలకు మరో భారం
ఇప్పటికే మున్సిపల్, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలతో ఎమ్మెల్యే అభ్యర్థులు సతమతమవుతున్నారు. తాజాగా జెడ్‌పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు తోడయ్యాయి. కచ్చితంగా అభ్యర్థులు గ్రామాల్లో వివాదాలు లేకుండా, టికెట్లు ఆశించే ఆశావహులను సంతృప్తిపరచి, ఒప్పించాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాకాదని ఏదో ఒక గ్రూప్‌ను ప్రోత్సహిస్తే రెండవ గ్రూప్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో తడాఖా చూపనుంది.