![Local Reservations Are Finalized In Vizianagaram District - Sakshi](/styles/webp/s3/article_images/2020/01/4/Local-Reservations.jpg.webp?itok=LBevOZ9Q)
సాక్షి ప్రతినిధి, విజయనగరం: స్థానిక సంస్థల ఎన్నికల్లో తొలిఘట్టం పూర్తయ్యింది. జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి..జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పీఠం ఈసారి ఎస్సీ మహిళకు దక్కింది. 2014 జెడ్పీ ఎన్నికల్లో చైర్‌పర్సన్ స్థానం ఎస్టీ మహిళకు కేటాయించారు. ఈ సారి ఎస్సీ మహిళకు రిజర్వయ్యింది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్ రిజర్వేషన్ల వివరాల జాబితాను విడుదల చేశారు. జిల్లాలో 34 జెడ్పీటీసీలు, 34 ఎంపీపీలు, 549 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఎంపీపీల్లో ఎస్టీ మహిళలకు 2, ఎస్టీ జనరల్‌కు 2 స్థానాలు కేటాయించారు. ఎస్సీ మహిళలకు 2, ఎస్సీ జనరల్ 2 స్థానాలు, బీసీ మహిళలకు 13, బీసీ జనరల్‌కు 13 స్థానాలు కేటాయించారు.
జిల్లాలోని 34 జెడ్పీటీసీ స్థానాలకు ఎస్టీ మహిళలకు 2 స్థానాలు, ఎస్టీ జనరల్‌కు 2 స్థానాలను కేటాయించారు. ఎస్సీ మహిళలకు 2, ఎస్సీ జనరల్ 2 స్థానాలు, బీసీ మహిళలకు 9, బీసీ జనరల్‌కు 9, అన్ రిజర్వుడ్ మహిళలకు 4, అన్ రిజర్వుడ్ జనరల్‌కు 4 స్థానాలు కేటాయించారు. ఎంపీటీసీలకు సంబంధించి 549 స్థానాలకు ఎస్టీ మహిళలకు 37, ఎస్టీ జనరల్‌కు 24, ఎస్సీలకు 35, ఎస్సీ జనరల్‌కు 23, బీసీ మహిళలకు 150, బీసీ జనరల్‌కు 138, అన్ రిజర్వుడ్ మహిళలకు 80, అన్ రిజర్వుడ్ జనరల్‌కు 62 స్థానాలను కేటాయించారు.
తుది నిర్ణయం తీసుకోనున్న హైకోర్టు
రిజర్వేషన్ల ఖరారుపై ఈ నెల 8న రాష్ట్ర హైకోర్టు తుది నిర్ణయం తీసుకోనుంది. ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ చట్టం 1994 రూల్ నెం.13 ప్రకారం రిజర్వేషన్ల కేటాయింపు జరగడంతో దాదాపుగా ఇవే ఖరారయ్యే అవకాశం ఉంది. రిజర్వేషన్ల ప్రకారం చూస్తే జిల్లాలో మహిళలకు అత్యధిక ప్రాధాన్యం లభించింది. ఎంపీటీసీలుగా 549 స్థానాలకు 302 స్థానాల్లో మహిళలే పోటీ చేయాల్సి ఉంది. 34 జెడ్పీటీసీ స్థానాల్లో సగం మహిళలకే దక్కాయి. ఎంపీపీల్లోనూ 34 స్థానాల్లో 17 మహిళలకే కేటాయించారు. తాజా రిజర్వేషన్ల ప్రకారం రాజకీయ పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
ఇప్పటికే చాలా చోట్ల ఆశావహులు పోటీ చేయాలని ఆశగా ఉన్నారు. రిజర్వేషన్ల గెజిట్ విడుదల తర్వాత వారిలో చాలా మంది అవకాశాన్ని కోల్పోయారు. అలాంటి వారిలో కొంత నైరాశ్యం ఏర్పడింది. కానీ ప్రభుత్వం ఏ విధమైన రాజకీయాలకు, పక్షపాతానికి తావు లేకుండా 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులను అనుసరించి అధికారుల చేత రిజర్వేషన్లు రూపొందించింది.
Comments
Please login to add a commentAdd a comment