ఎందరో ఆపద్బాంధవులు! | locals helped police in lifting bodies at nagaram | Sakshi
Sakshi News home page

ఎందరో ఆపద్బాంధవులు!

Published Sat, Jun 28 2014 10:18 AM | Last Updated on Sat, Sep 2 2017 9:31 AM

ఎందరో ఆపద్బాంధవులు!

ఎందరో ఆపద్బాంధవులు!

తెల్లవారుజామునే మంటలు.. చుట్టుముడుతున్న అగ్ని కీలలు.. ఎంతోమంది ప్రాణాలను బలిగొన్నాయి. తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున గెయిల్ గ్యాస్ పైప్లైన్ పేలి 16 మంది మరణించగా.. ఇంకా ఎంతోమంది ఆస్పత్రులలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఈ దారుణ పరిస్థితుల్లో ఎంతోమంది ఉదారంగా ముందుకొచ్చారు. బూడిదకుప్పల నడుమ, మాంసపుముద్దల మధ్య నుంచి వెళ్తూ.. తమకు చేతనైనంత సాయం చేశారు. కూర్చున్నవాళ్లు కూర్చున్నట్లే మరణించినా, ఇంట్లో పడుకున్న తల్లీబిడ్డలు పడుకున్నట్లే ప్రాణాలు కోల్పోయినా.. అలాంటివాళ్ల మృతదేహాలను బయటకు తీసుకురావడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఇక క్షతగాత్రుల పరిస్థితి మరీ దారుణం. కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ మాంసపు ముద్దల్లా పడి ఉన్న అనేకమందిని బయటకు తీసుకొచ్చి, వారిని ఆస్పత్రులకు తరలించడం కూడా కష్టమే. అక్కడున్న పోలీసు సిబ్బంది, వైద్యసిబ్బంది చాలా తక్కువమంది.

అలాంటి తరుణంలో స్థానికులు మేమున్నామంటూ ముందుకొచ్చారు. పోలీసులకు, వైద్య సిబ్బందికి తమకు చేతనైన సాయం చేశారు. బాధితులు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా.. తమంతట తాముగా ముందుకొచ్చి వారిని ఆస్పత్రులకు తరలించారు. తమ చేతులమీదుగా వారిని తీసుకొచ్చి, వీలైనంత వరకు కాపాడేందుకు తమ వంతు ప్రయత్నం చేశారు. వీరి సేవలను పోలీసులు కూడా ప్రశంసించారు. స్థానికుల సాయం లేకపోతే తాము అంత త్వరగా బాధితులను తరలించలేకపోయేవారిమని డీఎస్పీ వీరారెడ్డి కూడా మీడియాతో అన్నారు. స్థానికులు ఫోన్ చేసి ఇక్కడ ప్రమాదం సంభవించిందని చెప్పినప్పుడు ముందుగా స్పందించినది డీఎస్పీ వీరారెడ్డే. ఆయన హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని, బాధితులను కాపాడేందుకు ప్రయత్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement