కూలికి వచ్చిన తమను విధి చిన్నచూపు చూస్తుందని వారు ఊహించలేదు. ద్విచక్ర వాహనం రూపంలో మృత్యువు ఎదురొస్తుందని తెలియనేలేదు. పని ముగించుకుని సొంతూరికి బయలుదేరిన కొద్దిసేపటికే వారి బతుకులు తెల్లారిపోయాయి. లారీ అదుపుతప్పి బోల్తాపడిన ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వినుకొండ సమీపంలో శనివారం జరిగిన ఈ ఘటన జిల్లాలో తీవ్ర విషాదం నింపింది.
వినుకొండ /ఈపూరు : ఈపూరు మండలం అంగలూరు పంచాయతీ పరిధిలోని శ్రీనగర్ గ్రామం నుంచి పశువుల ఎరువును లారీలో లోడు చేసుకుని కూలీలు ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం వాదంపల్లి గ్రామం వెళ్తున్నారు. లారీ క్యాబిన్‌లో డ్రైవర్‌తో పాటు మరో 7గురు ప్రయాణిస్తున్నారు. వీరిలో 6 ఏళ్ళ బాలిక కూడా ఉంది. బొల్లాపల్లి మండలం వడ్డెంగుంట గ్రామానికి చెందిన తల్లి, కుమారుడు మువ్వా గంగమ్మ, హనుమంతురావులు ద్విచక్రవాహనంపై వినుకొండ నుంచి స్వగ్రామానికి వెళ్తున్నారు. కొండ్రముట్ల సమీపంలో ద్విచక్రవాహనం వేగంగా ఎదురుగా వస్తుండటంతో, దానిని తప్పించేందుకు లారీని రోడ్డు పక్కకు తీస్తుండగా అదుపు తప్పి పక్కనే ఉన్న లోతైన కాలువలో పడిపోయింది.
దీంతో లారీ క్యాబిన్ నుజ్జునుజ్జు అయింది. ద్విచక్ర వాహనం కూడా అదుపు తప్పటంతో వారికి కూడా తీవ్రగాయాలు అయ్యాయి. ప్రమాదంలో యర్రగొండపాలెంకు చెందిన డ్రైవర్ షేక్ మౌలాలి, యర్రగొండపాలెం మండలం వాదంపల్లి గ్రామానికి చెందిన గోపినీడు పెదవెంకటేశ్వర్లు, కన్నమనీడు పెద వెంకటేశ్వర్లు, మువ్వా సుందరమ్మ, మువ్వా మంగమ్మ అక్కడికక్కడే మృతి చెందారు.
మృతదేహాలను పొక్లెయిన్ సాయంతో క్యాబిన్ నుంచి బయటకు తీశారు. సంఘటనలో తీవ్ర గాయాలైన వాదంపల్లికి చెందిన దుగ్గినీడు ఆదిలక్ష్మి, చింతల పెదవెంకటేశ్వర్లు, మూడమంచు వెంకటేశ్వర్లు, మూడమంచు గంగమ్మ, మూడమంచు పెదవెంకటేశ్వర్లుకు తీవ్ర గాయాలయ్యాయి. ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న బొల్లాపల్లి మండలం వడ్డెంగుంటకు చెందిన మువ్వా గంగమ్మ, మువ్వా హనుమంతరావులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. వీరిలో మువ్వా గంగమ్మ, హనుమంతరావుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. సంఘటనా ప్రాంతాన్ని పట్టణ సీఐ శ్రీనివాసరావు, ఈపూరు ఎస్‌ఐ ఉజ్వలకుమార్ పరిశీలించారు. వివరాలు నమోదు చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యేక పోలీసు బలగాలు సంఘటనా ప్రాంతం లో సహాయక చర్యలు చేపట్టారు.
మృత్యుంజయరాలు కౌశల్య..
కర్ణాటకలో ఉండే ఆరేళ్ల కౌశల్య శుక్రవారం అమ్మమ్మ వద్దకు వచ్చింది. అమ్మమ్మ కూలి పనులకు వస్తుండటంతో ఇంటి వద్ద ఎవరూ లేకపోవటంతో వారితో పాటు కౌశల్య లారీలో వచ్చింది. అయితే జరిగిన ప్రమాదంలో కౌశల్యకు ఎలాంటి గాయాలు కాకపోవటం విశేషం.
కూలీలను కబళించిన మృత్యువు
Published Sun, Jul 12 2015 12:29 AM | Last Updated on Sat, Sep 29 2018 5:26 PM
Advertisement