అవినాష్‌రెడ్డిది హత్యే | A Man Murdered By His Lover Relatives In Ongole | Sakshi
Sakshi News home page

అవినాష్‌రెడ్డిది హత్యే

Published Mon, May 13 2019 11:36 AM | Last Updated on Mon, May 13 2019 4:49 PM

A Man Murdered By His Lover Relatives In Ongole - Sakshi

ఒంగోలు: తిరుపతికి చెందిన పురిణి అవినాష్‌రెడ్డి (23)ది ముమ్మాటికీ హత్యేనంటూ మృతుడి తండ్రి శ్రీనివాసరెడ్డి, బంధువులు ఆరోపించారు. ఆదివారం మధ్యాహ్నం పోస్టుమార్టం అనంతరం అవినాష్‌రెడ్డి మృతదేహాన్ని అంబులెన్స్‌లో తీసుకొని స్థానిక గోపాల్‌నగరంలోని ఒకటో లైను ఎక్స్‌టెన్షన్‌లోని యువతి ఇంటి ముందు ఉంచి ధర్నా చేశారు. పోలీసులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకొని చివరకు వారి డిమాండ్‌ మేరకు యువతితో పాటు కుటుంబ సభ్యులు ఆరుగురిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించడంతో సమస్య తాత్కాలికంగా సద్దుమణిగింది. 

ఇదీ..జరిగింది
అవినాష్‌రెడ్డి విషం లాంటి మందు తాగాడంటూ ఓ వ్యక్తి ఆటోలో రిమ్స్‌కు తీసుకొచ్చాడు. అప్పటికే అతడు మృతి చెందాడని వైద్యులు నిర్థారించారు. వైద్యులు సంబంధిత సమాచారాన్ని రిమ్స్‌లోని ఔట్‌పోస్టు పోలీసులకు పంపారు. ఔట్‌పోస్టులోని సిబ్బంది సుధాకర్‌ అనే వ్యక్తి నుంచి ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవాలగదిలో భద్రపరిచారు. ఈ సమాచారాన్ని ఔట్‌పోస్టు పోలీసులు రాత్రి 11 గంటల తర్వాత తాలూకా పోలీసులకు తెలియజేశారు. మృతి చెందాడన్న సమాచారం అవినాష్‌రెడ్డి తల్లిదండ్రులకు తెలియడంతో వారు ఆదివారం తెల్లవారు జామున మూడుగంటల సమయంలో రిమ్స్‌కు చేరుకున్నారు. ఆస్పత్రిలో ఎవరు చేర్పించారంటూ ఆరా తీసేందుకు యత్నించారు. అతను ఎవరైంది సమాచారం రాకపోవడంతో వారిలో ఆందోళన వ్యక్తమైంది. వారు నేరుగా 3.30 గంటల సమయంలో తాలూకా పోలీసుస్టేషన్‌కు చేరుకున్నారు. తమకు అనుమానం ఉందంటూ చెప్పగా స్టేషన్‌లో అధికారులు అందుబాటులో లేకపోవడంతో వారు తిరిగి రిమ్స్‌కు చేరుకున్నారు.

ఫిర్యాదు స్వీకరించక పోవడంపై ఆగ్రహం 
ఈ నేపథ్యంలో మృతుని బంధువులు తాము ఇచ్చే ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. రాత్రి ఆస్పత్రి నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా కేసు నమోదు చేస్తామని, పోస్టుమార్టంలో వచ్చే అంశాల ఆధారంగా తదుపరి దర్యాప్తు చేస్తామంటూ అధికారులు చెప్పుకొచ్చారు. శనివారం రాత్రి 7.30 గంటలకు ఘటన జరిగితే కనీసం సంఘటన స్థలానికి ఎవరు వెళ్లారంటూ ప్రశ్నించగా సమాధానం రాలేదు. దీంతో అప్పటికప్పుడు ఎస్‌ఐ హరిబాబు మృతుని బంధువులతో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ లభించిన సమాచారం ఆధారంగా యువతి ఇంటి ముందు ఉన్న రేకుల షెడ్‌పై లభించిన ఓ క్రిమిసంహారక మందు డబ్బాను పోలీసులు సీజ్‌ చేశారు. అనంతరం పోస్టుమార్టం ప్రక్రియ పూర్తిచేశారు. 

అన్యాయం జరుగుతోందంటూ ఆగ్రహం 
తాము ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు స్వీకరించకపోవడం, మృతదేహాన్ని సైతం తమను సరిగా చూడనివ్వలేదంటూ మృతుడి బంధువులు మండిపడ్డారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని పోలీసులు దాదాపు 14 గంటల పాటు సందర్శించకపోవడం, చివరకు తమ ఒత్తిడితో దర్యాప్తునకు ముందుకు వచ్చారని, క్రిమిసంహారక మందు తాగాడనేది అబద్ధమని, సూసైడ్‌నోట్‌ అంటూ పోలీసులు పేర్కొంటున్నది తమ వాడి చేతిరాత కాదని మృతుని తండ్రి, బంధువులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రికి తీసుకొచ్చిన వ్యక్తిని కనీసం తమకు చూపకుండా ఎందుకు దాచారు, ఎవరు దాచారో చెప్పాలంటూ నిలదీశారు. అయినా స్పందించకపోవడంతో ఆగ్రహం చెంది పోస్టుమార్టం గది నుంచి అంబులెన్స్‌లో యువతి ఇంటికి చేరుకొని మృతదేహాన్ని ఉంచి ధర్నా చేశారు.

తరలి వచ్చిన పోలీసులు
విషయం రచ్చగా మారడంతో నగరంలోని పోలీసు అధికారులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. పోస్టుమార్టం నివేదికలో మీ అనుమానాలన్నీ నివృతమవుతాయంటూ సర్థి చెప్పేందుకు చేసిన యత్నాలు ఫలించలేదు. దీంతో మృతుడి బంధువులు పోలీసులపై మండిపడ్డారు. తమ బిడ్డ తప్పు చేస్తే తమకు అప్పగించాలని, అంతేగాని చంపేస్తారా..అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. లేదంటే కట్టేసి పోలీసులకు అప్పగించినా సరిపోతుందని అంతే తప్ప చంపుతారా అంటూ నిలదీశారు. రాత్రి అనగా సంఘటన జరిగితే మీరు పొద్దున వరకు ఎందుకు ఈ ఇంటికి రాలేదో చెప్పాలంటూ ప్రశ్నల పరంపర కొనసాగించారు. అవినాష్‌రెడ్డి స్నేహితులు రెండేళ్లుగా ప్రేమిస్తున్నానని తమకు చెప్పాడని, అంతే తప్ప ఆత్మహత్య చేసుకునేంత సున్నితమైన మనస్తత్వం కాదని పేర్కొన్నారు. చివరకు ఇంట్లో తలుపులు వేసుకొని దాక్కున్నవారందరినీ అరెస్టుచేస్తేగానీ తాము కదలం అంటూ మొండిపట్టు పట్టడంతో పోలీసులు తొలుత యువతి తండ్రితో పాటు మరో ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. కొంతమందినే తరలించారని, ఇంకా కొంతమంది ఇంట్లోనే ఉన్నారంటూ ఆగ్రహించడంతో చివరకు వారి సాయంతో పోలీసులు ఇంట్లో వెతికి యువతితో పాటు మరో ఇద్దరిని స్టేషన్‌కు తరలించారు. అవినాష్‌రెడ్డి బంధువులు శాంతించి మృతదేహాన్ని తీసుకొని తిరుగు ప్రయాణం అయ్యారు. 

సీఐ ఏమంటారంటే..
దీనిపై తాలూకా సీఐ గంగా వెంకటేశ్వర్లు స్పందిస్తూ తమ ప్రాథ«మిక దర్యాప్తులో పురిణి అవినాష్‌రెడ్డి(23)ది నెల్లూరు జిల్లా కావలి మండలం సర్వేపాలెం అని, అతని కుటుంబం మొత్తం తిరుపతిలో నివాసం ఉంటోందన్నారు. అవినాష్‌ అమ్మమ్మ ఊరు కొత్తపట్నం మండలం మోటుమాల అని, ఈ నేపథ్యంలో వీరికి బంధువైన యుగంధర్‌రెడ్డితో ఒంగోలులో నివాసి వెంకటేశ్వరరెడ్డి పెద్ద కుమార్తె వివాహం జరిగిందన్నారు. ఈ వేడుకలో ఆయన చిన్న కుమార్తెను చూసిన అవినాష్‌రెడ్డి ప్రేమించడం ప్రారంభించాడని, ఈ క్రమంలోనే అవినాష్‌రెడ్డి బెంగళూరులో ఉద్యోగం చేస్తూ ఉండటం, వెంకటేశ్వరరెడ్డి చిన్న కుమార్తె బెంగళూరులో అగ్రికల్చర్‌ బీఎస్పీ చదువుతుందన్నారు. ఫేస్‌ బుక్‌ ద్వారా యువతితో చాటింగ్‌ చేస్తూ చివరకు ప్రేమిస్తున్నానంటూ ప్రపోజల్‌ చేశాడని, అందుకు యువతి తిరస్కరించడంతో వివాదం ప్రారంభమైందన్నారు. ఈ నేపథ్యంలో బెదిరింపులు కూడా రావడంతో ఆమెను కొన్నాళ్లపాటు బెంగళూరు నుంచి తీసుకొచ్చి ఇంట్లోనే ఉంచారని, చివరకు చదువుకు ఆటంకం ఉండకూడదని తిరిగి పంపారన్నారు. మళ్లీ బెదిరింపులు పెరగడం, పెళ్లి చేసుకోకపోతే సూసైడ్‌ నోట్‌ రాసి చచ్చిపోతానంటూ హెచ్చరించాడని తమ దృష్టికి యువతి తీసుకొచ్చిందన్నారు.

ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఆమెకు ఈ నెల 26న వివాహం నిశ్చయించారని, ఇది తెలుసుకొని శనివారం రాత్రి యువతి ఇంటి వద్దకు వచ్చి పెళ్లి చేసుకోకపోతే మందుతాగి చచ్చిపోతానని బెదిరించాడని, బెదిరించినట్లుగానే అతను మందుతాగుతుండగా పరిసర ప్రాంతాలకు చెందిన ఇద్దరు మహిళలు ఆ మందుడబ్బాను తీసుకొని విసిరేశారన్నారు. ఇది గమనించిన యువతి బావ అవినాష్‌రెడ్డిని తీసుకొని రిమ్స్‌కు చేరుకోవడం, అప్పటికే అతను మృతి చెందినట్లు సీఐ వివరించారు. మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు వ్యక్తం చేసిన అనుమానాలను శవపంచానామాలో పొందుపరిచామని, పోస్టుమార్టం నివేదిక రాగానే తదుపరి చర్యలను వేగవంతం చేస్తామన్నారు. సూసైడ్‌ నోట్‌ను కూడా సీజ్‌ చేశామని, యువకుడి ఫోన్‌కాల్స్‌ డేటాను కూడా సేకరించి అవినాష్‌రెడ్డి తనంతట తానుగా వచ్చాడా లేక అతడిని ఎవరైనా పిలిపించారా అనే కోణంలో దర్యాప్తు జరుపుతామని సీఐ వివరించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement