కరోనా వైరస్‌: క్రైం డౌన్‌ ! | Coronavirus: Crime Rate Is Decreased By Lockdown In Prakasam District | Sakshi
Sakshi News home page

కరోనా వైరస్‌: క్రైం డౌన్‌ !

Published Fri, Apr 10 2020 10:39 AM | Last Updated on Fri, Apr 10 2020 10:39 AM

Coronavirus: Crime Rate Is Decreased By Lockdown In Prakasam District - Sakshi

సాక్షి, ఒంగోలు: జిల్లాలో పోలీసులంతా స్టేషన్‌లను వదిలి రోడ్లపై కాపలా కాస్తున్నారు.. జనమంతా ఇళ్లకే పరిమితమైపోయారు.. కరోనా మహమ్మారి విజృంభించకుండా ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ప్రకటించిన నేపథ్యంలో నేరాల సంఖ్య సైతం పూర్తిగా తగ్గిపోయింది. దొంగలు, నేరగాళ్లు సైతం లాక్‌డౌన్‌ను పాటిస్తున్నట్లున్నారు. అందుకే క్రైం రేటు తగ్గిపోయింది. పోలీసులు రోడ్లపై జనం తిరగకుండా కాపలా కాయడం మినహా నేరాలపై దృష్టిసారించే పరిస్థితి లేనప్పటికీ క్రైం రేటు తగ్గడానికి ప్రధాన కారణం లాక్‌డౌన్‌ అని చెప్పవచ్చు. జిల్లాలో లాక్‌డౌన్‌కు ముందు ఉన్న పరిస్థితిని పరిశీలిస్తే నెలకు సగటున 1800 నుంచి 2 వేల వరకు నేరాల సంఖ్య ఉండేది. ప్రస్తుతం ఆ సంఖ్య మూడో వంతుకు పడిపోయింది. ముఖ్యంగా మహిళలపై లైంగిక దాడులు, గృహ హింసలు వంటి కేసులతో పాటు రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు పూర్తిగా తగ్గిపోయాయి.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 
ప్రకాశం జిల్లాలో కరోనా కట్టడి కోసం ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ వల్ల గత నెల 22వ తేదీన జనతా కర్ఫ్యూ ఆ తరువాత నుంచి లాక్‌డౌన్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి జిల్లా పోలీసు యంత్రాంగం మొత్తం కరోనా నియంత్రణ విధుల్లోనే కొనసాగుతున్నారు. సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద, క్వారంటైన్‌ కేంద్రాల వద్ద, గ్రామాల నుంచి నగరాల వరకు రోడ్లపైన ప్రజలెవరూ తిరగకుండా కాపలాలు కాస్తున్న విషయం అందరికీ తెలిసిందే. హోంగార్డు నుంచి ఎస్పీ స్థాయి అధికారి వరకు ప్రతి ఒక్కరూ కరోనాను నియంత్రించే పనిలోనే ఉన్నప్పటికీ నేరాల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. ఫిబ్రవరి నెలతో పోలిస్తే మార్చి నెలలో జిల్లాలో నేరాల సంఖ్య మూడో వంతుకు పడిపోవడం గమనించదగ్గ విషయం. ముఖ్యంగా లాక్‌డౌన్‌ వల్ల రోడ్లపై వాహనాలను పూర్తిగా నియంత్రించడంతో రోడ్డు ప్రమాదాలు పూర్తిగా తగ్గిపోయాయి. అందులో కూడా ఫిబ్రవరి నెలాఖరుతో పోలిస్తే మార్చి నెల చివరి పదిరోజుల్లో  నేరాల సంఖ్య ఐదో వంతు కూడా లేకపోవడం విశేషం.
 
ఇలా ఎలాంటి నేరాలను పరిశీలించినా లాక్‌డౌన్‌ సమయంలో మామూలు రోజుల కంటే ఐదో వంతుకు నేరాల సంఖ్య పడిపోవడం చూస్తుంటే జనంతో పాటు నేరస్తులు సైతం లాక్‌డౌన్‌ను పాటిస్తున్నట్లు స్పష్టమవుతోంది.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement