రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కూలీలు, ఆశల పల్లకిలో విహరించే మధ్యతరగతి కుటుంబీకులు లాటరీ మహమ్మారి ఉచ్చులో
సాక్షి, నరసరావుపేట: రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కూలీలు, ఆశల పల్లకిలో విహరించే మధ్యతరగతి కుటుంబీకులు లాటరీ మహమ్మారి ఉచ్చులో చిక్కుకొని తమ బతుకులు చిధ్రం చేసుకుంటున్నారు. ప్రతిసారీ అదృష్టాన్ని పరీక్షించుకుందామని టికెట్లు కొనుగోలు చేస్తూ అప్పులపాలవుతున్నారు. వీరి ఆశలను సొమ్ము చేసుకుంటున్న దళారులు మాత్రం కోట్లకు పడగలెత్తుతున్నారు. లాటరీ టికెట్లు అమ్మే వీరు నెలలు తిరిగేలోపే లక్షల ఖరీదు చేసే కార్లలో షికార్లు చేస్తున్నారు. 2000లో రాష్ట్ర ప్రభుత్వం లాటరీ టికెట్ల విక్రయాలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. చెన్నై, బెంగళూరు, అరుణాచల్, గోవా, భూటాన్ లాటరీ టికెట్లు మన రాష్ట్రంలో కొంతకాలం హల్ చల్ చేసినప్పటికీ ఆ తరువాత వీటి అమ్మకాలు నిలిచిపోయాయి. ఇదే అదనుగా భావించిన కొందరు అక్రమార్కులు తామే సొంతంగా లాటరీ కంపెనీలు స్థాపించి ప్రతి రోజు పాతకాలపు బ్రాకెట్ ఆటను తలపించే విధంగా స్లిప్‌లపై ఓపెనింగ్ సీరియల్ నంబర్లు వేసి వాటిని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.
పది లాటరీ టికెట్లను ఒక సీరియల్ నంబరుగా సృష్టించి వాటిని రూ. 50, రూ. 100, రూ.200 గా ధరలు నిర్ణయించి విక్రయిస్తున్నారు. విజయవాడకు చెందిన ఓ నిర్వాహకుని వద్ద నుంచి సీరియల్ నంబర్లను ఫోన్ ద్వారా తెలుసుకునే దళారులు జిల్లాలోని నరసరావుపేట, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మాచర్ల, చిలకలూరిపేట, వినుకొండ, బాపట్ల, తెనాలి వంటి పట్టణాల్లో వీటిని విక్రయిస్తున్నారు. ఏరోజుకారోజు డ్రా ద్వారా ఎవరికి ఫ్రైజుమనీ వచ్చిందనే విషయాన్ని తెలుసుకొని వారికి వెంటనే ఫ్రైజుమనీ అందిస్తుంటారు. పొరపాటున ఒకరికో ఇద్దరికో లాటరీ తగిలితే ఆ డబ్బును పూర్తి మొత్తంలో ఇవ్వకుండా వాటిలో అధిక మొత్తం తిరిగి లాటరీ టికెట్లు కొనుగోలు చేయించి మిగతా డబ్బును మాత్రమే ఇస్తుంటారు.
ప్రధాన సూత్రధారి నరసరావుపేట వాసే ...
లాటరీ టికెట్ల విక్రయాల ప్రధాన సూత్రధారి నరసరావుపేటకు చెందిన వ్యక్తి కావడం గమనార్హం. జిల్లాలో ఏ ప్రాంతంలో టికెట్ల విక్రయాలు జరగాలన్నా ఇతని పాత్ర ఉండాల్సిందే. గతంలో అనేక చిన్న చిన్న ఉపాధి మార్గాల ద్వారా జీవనం సాగించిన సదరు వ్యక్తి అనతికాలంలో అమాంతంగా కోట్లకు పడగలెత్తి ఖరీదైన కార్లలో తిరుగుతుండటంతో ఆయన్ను ఆదర్శంగా తీసుకొని అనేక మంది లాటరీ టికెట్ల విక్రయాలు జరుపుతుండటం విశేషం.
అడపా దడపా కేసులు నమోదు చేస్తున్న
పోలీసులు ...
లాటరీ టికెట్ల విక్రేతలపై నరసరావుపేట పోలీసులు రెండు నెలల వ్యవధిలో ఐదు కేసులు నమోదు చేశారు. అయినా వీరిలో మార్పు రాలేదు. వీరిని గ్యాంబ్లింగ్ యాక్ట్ కింద అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచినా అదే రోజు బెయిల్‌పై బయటకు వచ్చి యథావిధిగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. వీరి మూలాలు ఎక్కడున్నాయో గుర్తించి వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తే లాటరీ మహమ్మారిని కొంతమేరకైనా నిరోధించవచ్చని ప్రజలు అనేక అభిప్రాయ పడుతున్నారు.