అల్లిపురం(విశాఖ దక్షిణ): మతాంతర వివాహం చేసుకున్న ప్రేమ జంటకు రక్షణ కల్పించాలని మహిళా చేతన అధ్యక్షురాలు కత్తి పద్మ డిమాండ్ చేశారు. గురువారం డాబాగార్టెన్స్‌లో గల వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో కత్తి పద్మ వెల్లడించిన వివరాల ప్రకారం... ఆనందపురం గ్రామానికి చెందిన చందక సత్య, అదే గ్రామానికి చెందిన షేక్ భాషా కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. మతాలు వేరు కావడంతో వీరి వివాహానికి ఇరువురి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో సత్య, భాషా ఫిబ్రవరి 7న ఇంటి నుంచి పారిపోయి అన్నవరంలో పెళ్లి చేసుకున్నారు. అనంతరం వారు భాషా బంధువుల ఇంటికి వచ్చారు. అక్కడే కాపు కాసి ఉన్న సత్య బంధువులు ఆమెను బలవంతంగా అక్కడి నుంచి తీసుకుపోయారు.
అనంతరం తనంతట తానే ఇంటి నుంచి వెళ్లిపోయానని సత్యతో ఆమె తల్లిదండ్రులు లెటర్ రాయించి ఆనందపురం పోలీస్ స్టేషన్‌లో అందజేశారు. సత్య తల్లిదండ్రుల ఒత్తిడి మేరకు లెటర్ తీసుకుని పోలీసులు కేసు క్లోజ్ చేశారు. అనంతరం సత్యను ఆమె తల్లిదండ్రులు పైడిభీమవరం దగ్గర ఒక గ్రామంలో ఆమె మేనత్త ఇంటి దగ్గర దాచివేశారు. కానీ సత్య ఫిబ్రవరి 26న భాషాకు ఫోన్ చేసి అదే రోజు విజయనగరం వెల్లిపోయింది. అక్కడ సత్య, భాషా కలిసి మహిళా చేతనను ఆశ్రయించారు. దీంతో మహిళా చేతన అధ్యక్షురాలు కత్తి పద్య వారిద్దరికీ తిరిగి సింహాచలం దేవస్థానంలో వివాహం జరిపించారు. అయితే సత్య కుటుంబసభ్యులు భాషా ఇంటికి వెళ్లి భాషాను, వారి కుటుంబసభ్యులను చంపేస్తామని గ్రామపెద్దల సమక్షంలోనే బెదిరించటంతో వారు భయాందోళనకు గురవుతున్నారని, ఆనందపురం పోలీసులు కూడా మౌనం వహిస్తున్నారని కత్తి పద్మ ఆరోపించారు. భాషా, సత్య మేజర్లు కావడంతో వారు వివాహం చేసుకునే హక్కు కల్పిస్తూ, వారికి రక్షణ కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment