ప్రేమ.. క్షమ.. దాతృత్వం
►పవిత్ర ఖురాన్‌లో మహమ్మద్ ప్రవక్త పేర్కొన్నది ఇవే..
►నేటి నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభం
మతం ఏదైనా చెప్పే నీతి ఒక్కటే. మనిషిగా పుట్టినవారు సన్మార్గంలో నడవాలని. ముస్లింల పవిత్ర ఖురాన్‌లో మహ్మద్ ప్రవక్త దీన్నే ప్రస్తావించారు. రుజు మార్గాలను చూపే సత్యాసత్యాలను వేరుపరిచే స్పష్టమైన ఉపదేశాలు ఖురాన్‌లో ఉన్నాయి. రంజాన్ మాసంలోనే పవిత్ర ఖురాన్ అవతరించింది. ముస్లింలకు అత్యంత ముఖ్యమైన మాసం రంజాన్. ఈ నెలలో ముస్లింలు ధార్మిక చింతన, ప్రేమ, సౌభ్రాతృత్వం, దానగుణం, క్రమశిక్షణ, పరోపకారంతో ఉంటారు.శుక్రవారం నుంచి రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో ముస్లింలు ఉపవాసాలకు సిద్ధమవుతున్నారు. - కనిగిరి
రోజా(ఉపవాస దీక్ష)
సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఎటువంటి ఆహార పానీయాలు ముట్టకుండా(కఠోర దీక్ష) ఉపవాసాన్ని పాటిస్తారు. లాలాజలంకూడా మింగరు. అత్యంత నిష్టతో ఉపవాసాన్ని(రోజా) ఆచరిస్తారు. సూర్యోదయానికి ముందు సహార్ అని, సూర్యాస్తమయం తర్వత ఇఫ్తార్ అని పిలుస్తారు. రోజా ఉండేవారు సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత మాత్రమే ఏదైనా ఫలాహారం తీసుకుంటారు. రోజుకు కనీసం 13 గంటలపాటు ఉమ్మి కూడా మింగకుండా కఠోర దీక్ష చేస్తారు. రోజా పాటించేవారు మనసును భగవంతునిపై లగ్నంచేసి చెడు ఆలోచనలకు దూరంగా ఉంటారు. సాధ్యమైనంత ఎక్కువ సమయాన్ని మసీదుల్లో, దైవ ధ్యానంలో గడుపుతారు. తద్వారా భగవంతునిపై భక్తి, విశ్వాసం, భగవంతుని దృష్టిలో అందరూ సమానం అనే భావన పెంపొందుతుంది. పేద, ధనిక, స్త్రీ, పురుష అనే తారతమ్యం లేకుండా ముస్లింలంతా రోజాను ఆచరిస్తారు. అంతేగాక రంజాన్ నెలలో మరికొన్ని ముఖ్య నియమాలను కూడా ముస్లింలు నిబద్ధతతో పాటిస్తారు.
జకాత్
ముస్లింలలో మరీ ముఖ్యమైన సంప్రదాయం జకాత్. ప్రతి వ్యక్తి తన లాభార్జనలో కొంత మేర నిరుపేదలకు దాన, ధర్మాలు చేయడాన్ని జకాత్‌గా పిలుస్తారు. ప్రతి మనిషి తనలాగే ఉన్నతుడు కావాలని కోరుకోవడం ఈ జకాత్ ప్రధాన ఉద్దేశం. జకాత్ నిధితో నిరుపేదలకు వస్తువుల రూపంలో గానీ, నగదు రూపంలో గానీ దానం చేస్తారు. అయితే దానస్వీకర్తల పేర్లను గోప్యంగా ఉంచడమే దీని ప్రధాన నియమం. రంజాన్ నెలలోనే జకాత్ ఇస్తారు.
ఫిత్ర్
రంజాన్ మాసం చివరి రోజున జరుపుకునే పర్వదినం ఈద్-ఉల్-ఫిత్.్ర దేవుని అనుగ్రహం కోసం, కృతజ్ఞతగా నిరుపేదలకు ఫిత్(్రదానం) ఇస్తారు. ప్రతిఒక్కరూ కనీసం రెండు కిలోల గోదుమలు లేదా దానికి సమాన మైన ఇతర ఆహార ధాన్యాలు లేదా నగదు దానం చేస్తారు. రంజాన్‌ను ప్రతి ముస్లిం లోటు లేకుండా సంతోషంగా జరుపుకునేందుకు చేయాల్సిన దాన, ధర్మాలను ఇస్లాం మతం ఉద్బోధిస్తుంది.
ఎహ్ తే కాఫ్
ముస్లిం సోదరులు రోజూ ఐదుసార్లు నమాజ్(ఉదయం ఫజర్, మధ్యాహ్నం జోహర్, సాయంత్రం 5 గంటలకు అసర్, రాత్రి 6.30 గంటలకు మగ్‌రీబ్, రాత్రి 8 గంటలకు ఇషా నమాజ్) చేస్తారు. అయితే రంజాన్ నెలలో ఇషా నమాజ్ తర్వాత, ప్రత్యేకంగా ఎంతో నిష్టతో మరో 20 రకాత్‌లు తరావీహ్ నమాజ్ చేస్తారు. ఈ నెలలో 21వ రోజు నుంచి నెల చివరి వరకు ఎ్‌హ తే కాఫ్(తపోనిష్ట) పాటిస్తారు. మసీద్‌లోనే పూర్తి సమయాన్ని గడపుతూ.. ప్రార్థనల్లో దివ్య ఖురాన్(దైవ గ్రంథాలు) చదువుతూ ఉపవాస దీక్షలో నిమగ్నమవుతారు. తప్పనిసరి పరిస్థితిల్లో మాత్రమే మసీద్ నుంచి బయటకు అడుగుపెడతారు.
షబ్ ఎ ఖద్
రంజాన్ మాసంలో అత్యంత ముఖ్యమైన రోజు షబ్ ఎ ఖద్.్ర ఈ నెలలో 27వ రోజున దివ్వ ఖురాన్ ఆవిర్భవించిందని ప్రతీతి. ఆ రోజును షబ్ ఎ ఖదర్‌గా పిలుస్తారు. షబ్ ఎ ఖద్ ్రరాత్రంతా నమాజ్‌తో జాగారం చేస్తారు. ఈ ఒక్కరాత్రి కఠోర దీక్షతో చేసిన ప్రార్థన వల్ల లభించే ఫలితం మనిషి జీవితంలో 83 ఏళ్లపాటు చేసిన ఉపవాస దీక్షతో సమానమని, షబ్ ఎ ఖద్ ్రరోజున దైవ ద్యానంలో గడిపితే జీవితంలో తెలియక చేసిన తప్పులను భగవంతుడు క్షమిస్తాడనేది ముస్లింల నమ్మకం.
ఇఫ్తార్ ప్రత్యేకత
రంజాన్ మాసంలో ముస్లీంసోదరులు ఉపవాసదీక్షను విరమింప చేసే కార్యక్రమాన్నే ఇఫ్తార్ అంటారు. ఈ ఇఫ్తార్ సమయంలో తీసుకునే ఆహారాన్ని దీక్ష వాసులకు అందించడం కూడా పుణ్యకార్యంగా భావిస్తారు. ఇఫ్తార్ విందును.. ముస్లింలే కాకుండా ఇతరులు కూడా రోజా ఆచరించిన వారికి ఇస్తుంటారు.