తడికెలపూడి :పెద్దలు తమ పెళ్లికి అంగీకరించటం లేదని మనస్థాపానికి గురైన ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు యత్నించిన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో యువకుడు మృతి చెందగా యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. కామవరపుకోట మండలం తడికెలపూడి గ్రామానికి చెందిన మోలం శైలజ(19), బెర్రు వెంకటేశ్ నాలుగేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. వెంకటేశ్ వ్యవసాయం చేసుకుంటుండగా, శైలజ స్థానికంగా ఉన్న పామాయిల్ ఫ్యాక్టరీలో కూలీగా పనిచేస్తోంది. అయితే వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. ఈ విషయమై గురువారం ఉదయం వెంకటేశ్‌కు అతని కుటుంబసభ్యులతో తీవ్ర వాగ్వాదం జరిగింది. దాంతో ఆవేశానికి గురైన వెంకటేశ్ పురుగులమందు తాగాడు. వెంటనే కుటుంబసభ్యులు అతన్ని ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి మృతి చెందాడు. కాగా ఈ విషయం తెలిసిన శైలజ కూడా విషం తాగింది. అయితే ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్సపొందుతోంది.