దుబ్బాకటౌన్: దేవుడా మేమెట్లా బ్రతకాలి..అయ్యో బిడ్డా..ఎంత పనిచేశావు..అంటూ గుండెలు బాదుకుంటూ తల్లిదండ్రులు తమ పిల్లలపై పడి రోదిస్తున్న ఘటన ప్రతీ ఒక్కరిని కంటతడి పెట్టించాయి. తన బిడ్డ మృతదేహాన్ని చూసిన నేహా తల్లి ఆసుపత్రి మార్చురి వద్ద స్పృహ తప్పింది. భగీరథ్ తల్లి సైతం విగత జీవిగా మారింది. తన కొడుకును చూసి గుండెలు బాదుకుంటూ రోదించడం అక్కడున్న వారిని కలచివేసింది. ఆసుపత్రితో పాటు వారి ఇండ్లలో కుటుంబీకులు, బంధువుల రోదనలతో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.
లచ్చపేట, దుబ్బాకలో తీవ్ర విషాదం..
ప్రేమజంట భగీరథ్(17), నేహా(16) బుధవారం తెల్లవారుజామున లచ్చపేటలోని ప్రియడి ఇంట్లో ఒకే దులానికి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారనే సంఘటనతో దుబ్బాక, లచ్చపేటలో తీవ్ర విషాదం అలుముకుంది. ఉదయంనుంచి సాయంత్రం వరకూ ఎవరిని కదిలించినా ఈ సంఘటనను తలుచుకుంటూ కంట తడిపెట్టడమే కనిపించింది. దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రిలో మైనర్ ప్రేమ జంటకు వైద్యులు పోస్టుమార్టమ్ నిర్వహించి వారి బంధువులకు మృత దేహాలను అప్పగించారు. ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడక ముందు రాసి ఉంచిన సూసైడ్ నోట్‌లో మా మృతదేహాలను ఒకే దగ్గర అంత్యక్రియలు నిర్వహించాలని రాసి ఉంచారు. ఇందుకు వారి వారి కుటుంబాల వారు ఒప్పుకోకపోవడంతో ఎస్‌ఐ మహేందర్ ఆధ్వర్యంలో పోలీసులు భగీరథ్, నేహా మృత దేహాలను వేర్వేరుగా వారి బంధువులతో కలిసి అంత్యక్రియలకు తరలించారు. భగీరథ్ మృతదేహానికి లచ్చపేటలో, నేహా మృతదేహానికి దుబ్బాకలో అంత్యక్రియలు నిర్వహించారు.
ఇరువురి అంత్యక్రియల్లో ఎంపీ, ఎమ్మెల్యేలు..
మైనర్ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడ సంఘటనను తెలుసుకున్న ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్‌రావులు వారి కుటుంబాలను పరామర్శించారు. ఎంపీ, ఎమ్మెల్యే భగీరథ్, నేహా అంత్యక్రియల్లో పాల్గొని ఇరు కుటుంబాలను ఓదార్చారు. మున్సిపల్ చైర్‌పర్సన్ గన్నె వనిత భూంరెడ్డితో పాటు కౌన్సిలర్లు, బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు, పెద్ద ఎత్తున హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment