ప్రొవిజనల్ సర్టిఫికెట్ తెస్తేనే వెరిఫికేషన్ అంటున్న అధికారులు
వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోలేని దుస్థితిలో విద్యార్థులు
హైదరాబాద్: ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో గందరగోళం నెలకొంది. ప్రొవిజనల్ సర్టిఫికెట్లు తేవడం లేదనే సాకుతో అనేక మంది విద్యార్థుల సర్టిఫికెట్లను వె రిఫై చేసేందుకు హెల్ప్ లైన్ కేంద్రాల్లోని అధికారులు తిరస్కరిస్తున్నారు. దీంతో తల్లిదండ్రులు, విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. రాష్ట్రంలోని 269 పీజీ ఇంజనీరింగ్, 104 ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఈనెల 6వ తేదీ నుంచి ప్రక్రియ మొదలుపెట్టారు. పీజీఈసెట్ రాసిన విద్యార్థులకు 9వ తేదీ నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రారంభించారు. అయితే, రీయింబర్స్‌మెంట్ కింద రావాల్సిన ఫీజులను విద్యార్థులు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని మొదట్లో యాజమాన్యాలు మెలిక పెట్టిన నేపథ్యంలో సర్టిఫికెట్లు లేకపోయినా, వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించాలని అధికారులు నిర్ణయించారు. దీంతో చేసేదేమీ లేక బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు యాజమాన్యాలు కూడా సర్టిఫికెట్లు ఇవ్వడం ప్రారంభించాయి.
ఇందులో భాగంగా హెల్ప్‌లైన్ కేంద్రాలకు కౌన్సెలింగ్ నిర్వహణ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇపుడు విద్యార్థులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ కేంద్రాల్లోని అధికారులే ఇబ్బందులు పెడుతున్నట్లు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలేజీల నుంచి తెచ్చుకున్న సర్టిఫికెట్లు కాకుండా సంబంధిత యూనివర్సిటీ జారీ చేసే ప్రొవిజనల్ సర్టిఫికెట్ తీసుకురాలేదనే సాకుతో వెరిఫికేషన్‌కు తిరస్కరిస్తుండటంతో వారు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునే పరిస్థితి లేకుండా పోయింది. గుంటూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రొవిజనల్ సర్టిఫికెట్ తరువాత అందజేసేందుకు వీలు కల్పించాలని, మొదట సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు అవకాశం కల్పించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఎంటెక్, ఎంఫార్మసీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో గందరగోళం
Published Wed, Sep 17 2014 12:34 AM | Last Updated on Sat, Sep 2 2017 1:28 PM
Advertisement