మదనపల్లె మార్కెట్‌లో ‘జాక్‌పాట్’ వేలం!
- రూ. లక్షలు నష్టపోతున్న రైతులు
- ధరల కృత్రిమ పెంపు
- గొప్పల కోసం వ్యాపారులతో చేతులు కలుపుతున్న రైతులు
- పట్టించుకోని అధికారులు
మదనపల్లె: రాష్ట్రంలోనే అతిపెద్ద మార్కెట్లలో ఒకటిగా ప్రత్యేక గుర్తింపు పొందిన మదనపల్లె టమాట మార్కెట్ ‘జాక్‌పాట్’ వేలం పాటల్లో కూడా ప్ర త్యేక గుర్తింపు పొందుతోంది. మార్కెట్‌లో ‘జాక్‌పాట్’ వేలం పాటలు ఊపందుకున్నాయి. అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోం ది. మదనపల్లెలో రోజురోజుకీ ధరలు పెరుగుతున్నాయంటే కాయలకు వున్న డిమాండ్ ఒక కారణమైతే ‘జాక్‌పాట్’ వేలం ద్వారా కొంతమంది వ్యాపారులు ధరలను కృత్రిమంగా పెంచడం మరో కారణమవుతోంది.
జిల్లాలోని తిరుపతి, చిత్తూరు మార్కెట్లతో పోల్చి తే మదనపల్లె మార్కెట్‌లో కిలో టమాటాకు రూ.10 వ్యత్యాసం ఉంది. దీన్నిబట్టి చూస్తే ఇక్కడ ‘జాక్‌పాట్’ ఎంతమేర జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ప్రతిరోజూ మార్కెట్‌కు 300 నుంచి 350 టన్నుల కాయలు మార్కెట్‌కు వస్తున్నాయి. 30 కేజీల క్రేట్ ధర రూ.1400 నుంచి రూ. 1500 వరకు పలుకుతోంది. అయితే ఇక్కడ ఒక మెలిక లేకపోలేదు. వాస్తవానికి ఒక్క క్రేట్‌కు కాయలను తలసరిగా మాత్రమే వేసి బాక్సుపై బాక్సు వుంచి వేలం నిర్వహించాల్సి వుంది. జిల్లాలోని చా లా మార్కెట్లలో తలసరిగానే కాయల ను పోసి వేలం నిర్వహిస్తున్నారు.
అయితే ఇక్కడ అలా జరగడం లేదు. తలసరిగా కాయలు వేస్తే ఒక్క క్రేట్‌కు 28 నుంచి 30 కేజీల వరకు మాత్రమే పడతాయి. కానీ క్రేట్‌పైన రాశుల్లా పో సి వేలం నిర్వహిస్తున్నారు. తద్వారా ఒక్క క్రేట్‌కు దాదాపుగా 7 కేజీల కా యలు అదనంగా ఉంటున్నాయి. కొం త మంది వ్యాపారులు మాత్రం క్రేట్ ధరను 30 కేజీలకు మాత్రమే నిర్ణయిస్తారు. దీంతో రైతు ఒక్క క్రేట్‌కు సగటున 6 నుంచి 7 కేజీలు నష్టపోవాల్సి వస్తోంది.
‘జాక్‌పాట్’ ద్వారా వేలం పాటలు
ఇక ‘జాక్‌పాట్’ ద్వారా వేలం పాటలు నిర్వహించడం వల్ల ధరలు కృత్రిమం గా పెరగడంతో పాటు కొంత మంది రైతులు వ్యాపారులతో చేయి కలుపుతుండటం గమనార్హం. మార్కెట్‌కు వచ్చిన కాయలను రెండు రకాలుగా విభజిస్తారు. ఒకటి నాణ్యమైన పెద్దకాయలు, రెండోది గోళీకాయలుగా వున్న చిన్నకాయలు. అయితే ఈ రెండింటినీ కలిపి 10 బాక్సులకు ఒకటి, లేక 20 బాక్సులకు రెండు, లేకుంటే 50 బాక్సులకు మూడు చొప్పున ‘జాక్‌పాట్’ ద్వారా పక్కన పెడతారు.
రైతులతో ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం పక్క మార్కెట్‌లో కంటే ఎక్కు వ ధర కల్పిస్తామని హామీ ఇస్తారు. రైతు కూడా తమ కాయలు అందరి కంటే ఎక్కువ ధర పలికితే గ్రామంలో కూడా గొప్పగా ఉంటుందని భావించి వారితో చేయి కలుపుతాడు. కానీ ‘జాక్‌పాట్’ ద్వారా తమకు నష్టం కలుగుతుందని తెలిసినా ధర ఎక్కువకు అమ్ముడు పోయాయనే గొప్పల కోసం అంగీకరిస్తున్నారు. దీంతో ధరలు కూడా కృత్రిమంగా పెరుగుతున్నాయని చెప్పవచ్చు.
‘జాక్‌పాట్’ వేలంపై చర్యలు
మదనపల్లె టమాట మార్కెట్‌లో జరుగుతున్న ‘జాక్‌పాట్’ వేలం పాటలపై సెక్రటరీ జగదీష్‌ను వివరణ కోరగా మార్కెట్‌లో ‘జాక్‌పాట్’ వేలం జరుగుతున్నట్టు తమకు ఎవరూ ఫిర్యాదు చేయలేదన్నారు. ఒకవేళ అలా నిర్వహిస్తే సంబంధిత వ్యాపారులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మార్కెట్ యాక్టు ప్రకారం వ్యాపారులు ‘జాక్‌పాట్’గా వేలం నిర్వహిస్తే వారి లెసైన్సులను రద్దు చేసి వారిపై చర్యలు తీసుకుంటామని ఆయ న స్పష్టం చేశారు.