సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో ఒక అసెంబ్లీ సీటు మహిళలకు ఇస్తామని చెబుతున్న తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు ఆ సీటును కూడా కాంగ్రెస్ నుంచి వలస తెచ్చుకోవాలని భావిస్తున్నారు. ఆ సీటును మాగుంట కుటుంబ సభ్యులకు కేటాయించే వాతావరణం కనిపిస్తోంది. ధనబలం వున్న వారి కోసం వలలు విసిరి పార్టీలోకి ఆహ్వానిస్తున్న చంద్రబాబునాయుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి, మాగుంట పార్వతమ్మను పార్టీలోకి తీసుకురావడానికి తెర చాటుమంతనాల వేగం పెంచారు. ఇందులో భాగంగానే తమ దారెటో నిర్ణయించుకోవడానికి ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి నెల్లూరులోని తమ కార్యాలయంలో ఆదివారం మద్దతుదారుల సమావేశం ఏర్పాటు చేశారు.
జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధాటికి తట్టుకోవాలంటే వందలు, వేల కోట్లున్న ధనవంతులను పోటీకి దించడమే ఏకైక మార్గంగా టీడీపీ అధినేత భావిస్తున్నారు. ఇలాంటి వారికి ఎల్లో కార్పెట్ స్వాగతం పలికి వారు కోరిన సీట్లు కేటాయించడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. పదేళ్లుగా పార్టీని నమ్ముకుని పనిచేసిన వారి నుంచి తీవ్ర నిరసన ఎదురవుతున్నా అవసరమైతే అలాంటి వారినే వదులుకుని కొత్త వారికి టికెట్లు ఇచ్చేలా టీడీపీ అధినేత పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే ఆదాల ప్రభాకరరెడ్డి, ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డికి చంద్రబాబు టికెట్లు ఖరారు చేశారు.
నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రభావం చూపగల మాగుంట సుబ్బరామిరెడ్డి కుటుంబాన్ని ఎలాగైనా తమ వైపునకు లాక్కోవడానికి తమ పార్టీ ముఖ్య నేతలను ఆయన రంగంలోకి దించారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఒంగోలు ఎంపీగా గెలిచిన మాగుంట శ్రీనివాసులురెడ్డిని, ఆయన వదిన పార్వతమ్మను పార్టీలోకి రావాలంటూ వారి మీద ఒత్తిడి పెంచుతున్నారు. శ్రీనివాసులురెడ్డికి ఒంగోలు ఎంపీ, పార్వతమ్మకు ఉదయగిరి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామని చంద్రబాబు తన సన్నిహిత నాయకుల ద్వారా మంతనాలు సాగిస్తున్నారని తెలిసింది. శ్రీనివాసులురెడ్డిని ఒంగోలు లోక్‌సభకు పోటీ చేయించడం ద్వారా ఆ పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులకు పెద్ద ఎత్తున ధన సహాయం అందించి ఎన్నికల్లో వెయ్యి రూపాయల నోట్లు పారించే ఎత్తుగడకు తెర లేపారు.
నెల్లూరు లోక్‌సభ పరిధిలోని ఉదయగిరి నియోజకవర్గం నుంచి పార్వతమ్మను పోటీ చేయించి అక్కడ కూడా విరివిగా ధన ప్రవాహం పారించాలనేది చంద్రబాబు ఎత్తుగడగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు ఉదయగిరి పార్టీ ఇన్‌చార్జిగా ఉన్న బొల్లినేని రామారావు పార్టీ హై కమాండ్ సూచించినంత డబ్బు ఖర్చు పెట్టే ధైర్యం చేయలేక వెనకడుగు వేస్తున్నారు. ఇదే సమయంలో ఆదాల ప్రభాకరరెడ్డి తన మద్దతు దారుడు ఒంటేరు వేణుగోపాలరెడ్డికి ఆ టికెట్ ఇప్పించే ప్రయత్నాలకు తెర లేపారు. అయితే చంద్రబాబు మాత్రం పార్వతమ్మను ఇక్కడి నుంచి పోటీచేయించే ఆలోచన చేస్తున్నారు. ఇతర పార్టీల నాయకులను ఒప్పించో, టికెట్లు ఎర వేసో తమ పార్టీలోకి లాక్కొచ్చే పనిచేస్తున్న ఇద్దరు టీడీపీ ముఖ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి మీద ఒత్తిడి పెంచారని తెలిసింది.
టికెట్లు ఖరారు చేయాల్సిన సమయం దగ్గర పడుతున్నందువల్ల వెంటనే నిర్ణయం తెలియ చేయాలని వారు రకరకాల మార్గాల్లో మాగుంట కుటుంబాన్ని ఒత్తిడి చేయిస్తున్నారని సమాచారం. ఇందులో భాగంగానే మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆదివారం నెల్లూరులోని తన కార్యాలయంలో మద్దతుదారులతో సమావేశమయ్యారు. తమకు వస్తున్న ఆఫర్ల గురించి వివరించి ఏ పార్టీలోకి వెళితే బాగుంటుందనే అభిప్రాయలు సేకరించారు. ఒకటి,రెండు రోజుల్లో ఒంగోలులో కూడా మద్దతుదారులతో సమావేశమై ఆ తర్వాత ఒక నిర్ణయానికి రావాలని భావిస్తున్నట్లు తెలిసింది.
అయితే తమ నాయకుడు ఏ పార్టీలో చేరాలనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదనీ, అనేక రకాల ఆలోచనల్లో మాత్రమే ఉన్నారని ఆదివారం నాటి సమావేశానికి హాజరైన ఒక నాయకుడు సాక్షి ప్రతినిధికి చెప్పారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వలస నాయకులను తీసుకుని వచ్చి టికెట్ల పందేరం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలపై ఆ పార్టీ సీనియర్ నేతలు మండిపడుతున్నారు.
మాగుంట కుటుంబానికి ‘బాబు’ ఎర
Published Mon, Mar 3 2014 4:11 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement