ఇది నానాజాతి నేతల మహానాడు | mahanadu mixup with all party leaders | Sakshi
Sakshi News home page

ఇది నానాజాతి నేతల మహానాడు

Published Sat, May 27 2017 3:48 AM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM

ఇది నానాజాతి నేతల మహానాడు - Sakshi

ఇది నానాజాతి నేతల మహానాడు

► మంత్రివర్గంలో నాలుగో వంతు పొరుగు పార్టీల నేతలే
► క్రమశిక్షణ కరువు, అన్ని జిల్లాల్లో వేరు కుంపట్లు
►  లోకేష్‌ ప్రాధాన్యతకే పెద్దపీట


సాక్షి, ప్రత్యేక ప్రతినిధి:
మహోన్నత ఆంధ్రా విశ్వవిద్యాలయాన్ని  వివాదాల వేదికగా మార్చిన, దెయ్యాల కొంపగా అభివర్ణించిన తెలుగుదేశం అక్కడే మూడు రోజులు కొలువుదీరి పార్టీకి దిశాదశ నిర్దేశించుకోనుంది. ద్వంద ప్రమాణాలతో,  హామీలకు తిలోదకాలతో, ఓటుకు కోట్లు కేసుతో పలాయనవాదంతో, అవినీతి అక్రమాలతో, పార్టీల ఫిరాయింపుదారులతో జాతీయ తెలుగుదేశం పార్టీ రెండు నాల్కల ధోరణితో తీవ్ర విమర్శల సుడిలో కొట్టుమిట్టాడుతూ భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికకు సిద్ధమవుతోంది. తెలంగాణలో పార్టీకి దాదాపు చాపచుట్టేసుకున్న పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో విభిన్న పార్టీల నుంచి అరువు తెచ్చుకున్న నేతలకు అధికారం కట్టబెట్టి అన్ని జిల్లాల్లో వేరు కుంపట్లకు తావిచ్చింది. 2004కు ముందు వరకు ఎలా ఉన్నా 2014లో అధికారం చేపట్టిన తరువాత, మరీ ముఖ్యంగా భారీ మొత్తాలతో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలుచేసి వారికి పదవులను కట్టబెట్టడం మొదలు చంద్రబాబు క్రమంగా పార్టీపై పట్టుకోల్పోతున్నారని పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.

వైఎస్సార్‌సీపీ నుంచి కొనుగోలుచేసిన ఆదినారాయణరెడ్డి, అమరనాథరెడ్డి, సుజయకృష్ణ రంగారావు, అఖిలప్రియలతో పాటు ఎన్నికల ముందు కాంగ్రెస్‌ నుంచి వచ్చిన గంటా శ్రీనివాసరావు, పితాని సత్యనారాయణలకు మంత్రివర్గంలో చోటు కల్పించడం, మండలి బుద్ధప్రసాద్, జూపూడి ప్రభాకర్‌రావు, కారెం శివాజి, పిన్నమనేని వెంకటేశ్వరరావు తదితరులతో పాటు మాజీ ఐఏఎస్, తదితర అధికారులకు పదవులు కట్టబెట్టడంపై పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన సీనియర్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నారా లోకేష్‌ను ఎమ్మెల్సీ చేయడం, నాలుగు రోజుల్లోనే కీలక శాఖలను అప్పగించడం, ప్రతి అంశాన్ని లోకేష్‌తో ముడిపెడుతూ అత్యంత ప్రాధాన్యం ఇస్తుండటాన్ని పార్టీలో అనుభవజ్ఞులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. లక్ష్మీపార్వతిని బూచిగా చూపి అధికారాన్ని కొట్టేసిన చంద్రబాబు ఇప్పుడు లోకేష్‌కు తన స్థానాన్ని కట్టబెట్టడానికి నానా పాట్లు పడుతున్నారని గుసగుసలాడుతున్నారు.

రూ.రెండు లక్షల కోట్ల అవినీతితో చెడ్డపేరు...
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో రాజధాని జపం చేస్తుండటంతో పాటు రూ.రెండు లక్షల కోట్లకు పైగా అవినీతికి పాల్పడటం పార్టీకి చెడ్డపేరు తెచ్చిందని పార్టీశ్రేణులే అభిప్రాయపడుతున్నాయి. లోకేష్‌తో పాటు భూకబ్జాలకు పెద్ద ఎత్తున పాల్పడ్డారనే అపవాదులున్న పి.నారాయణ, నక్కా ఆనందబాబు తదితరులకు భూసంబంధిత కమిటీల్లో చోటు కల్పించడం పార్టీలో చర్చనీయాంశాలు అయ్యాయి. పట్టిసీమలో రూ.400 కోట్లకు పైగా అవినీతి జరిగిందని కాగ్‌ కడిగేసిన విషయం తెలిసిందే. విభజన చట్టం ప్రకారం కేంద్రం నుంచి సాధించుకోవాల్సిన వాటి గురించి చంద్రబాబు పెదవి విప్పకపోవడం ఆ పార్టీలోనే చర్చకు తావిస్తోంది.

రాష్ట్రాభివృద్ధికి దోహదపడే ప్రత్యేక హోదాను వదిలేసుకోవడమంటే ప్రజలకు ఏం సమాధానం చెప్పాలనే పార్టీ శ్రేణులకు అధిష్ఠానం వద్ద స్పష్టమైన జవాబు కూడా లేదు. ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కుని హైదరాబాదును ఉన్నఫళంగా వదిలేసి రావడమన్నది పార్టీకి, ఆర్థికంగానూ రాష్ట్రానికి నష్టదాయకమని నాయకులు విశ్లేషిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement