నారాయణపేట రూరల్, న్యూస్‌లైన్: గ్రామీణ రైతాంగ సంక్షేమంకోసం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పండ్లతోటలను పెంచుకోవచ్చని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా మహాత్మాగాంధీ వననర్సరీ కింద బండ్ ప్లాంటింగ్ (గట్ల వెంబడి టేకు మొక్కల పెంపకం), పండ్లతోటల పెంపకం, ఇందిరమ్మ పచ్చతోరణం తదితర పథకాలను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా వివిధ రకాల పండ్లతోటలు, టేకుమొక్కలు, ఎర్రచందనం మొక్కలను తమ పొలాల్లో పెంచే రైతులకు నెలకు రూ.మూడు వేలు చెల్లించాలని సూచించింది. ఈ మేరకు గత సెప్టెంబర్ 14న రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ శశిభూషణ్‌కుమార్ ఉత్తర్వులు (సర్క్యూలర్ నం.4611/ సీఆర్‌డీ/ఎంజీవీఎన్/2013) జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగికి వచ్చే వేతనం వలే టేకు, పండ్ల తోటల మొక్కలు పెంచే రైతులకు (ప్రతి మొక్కకు ప్రతిరోజూ 50 పైసల చొప్పున) ప్రతినెలా రూ.మూడు వేలు అందజేస్తుంది.
దీనివల్ల తమ పొలాల్లో పండ్లతోటల సంరక్షణకు నిరంతరం పర్యవే క్షించి అధిక లాభాలు పొందే అవకాశం ఉంది. ప్రతినెలా ఒకటి, రెండుసార్లు ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ సదరు రైతు పొలాన్ని పరిశీలించి పంటలు అధిక దిగుబడి వచ్చేందుకు సలహాలు, సూచనలు ఇస్తారు. దీనివల్ల వారికి అవగాహన కలిగి మొక్కలను బతికించుకునే అవకాశముంటుంది. ఇక ఇందిరమ్మ పచ్చతోరణం పథకంలో భూమిలేని నిరుపేద ఎస్‌సీ, ఎస్టీ, కుటుంబాలకు ఈ ప్రకారమే మొక్కలకు రూ.15 చొప్పున ప్రతినెలా చెల్లిస్తారు. అయితే ఫీల్డ్‌అసిస్టెంట్, సర్వేయర్ నివేదిక ప్రకారం టెక్నికల్ అసిస్టెంట్ రికార్డు చేసి ఇస్తారు. దీనికి ఇంజనీర్ కన్సల్టెంట్ తనిఖీ చేసి డబ్బులు చెల్లించే లా చర్యలు తీసుకుంటారు.
ఇలా ప్రతి రైతుకు మూడేళ్ల వరకు చెల్లిస్తారు. బండ్ ప్లాంటింగ్‌లో టేకు, ఎర్రచందనం మొక్కల పెంపకానికి రెండేళ్ల వరకు (సెప్టెంబర్ నుంచి జూన్ వరకు) బతికిన ప్రతి మొక్కకు రూ.ఐదు చొప్పున రికార్డు చేస్తారు. ఇలా మొత్తం 600 మొక్కలకు మాత్రమే చెల్లిస్తారు. ప్రతినెలా 15లోపు వేతనం రైతు బ్యాంకు ఖాతాలో వేసేలా మండలస్థాయి అధికారులు చర్యలు చేపట్టాలి. ఈ విధానం వల్ల ఎలాంటి అవకతవకలు, అక్రమాలు జరగవని అధికారులు భావిస్తున్నారు. ఒకవేళ ఇలా జరగకపోతే అలస్యంగా చెల్లింపు జరిమానాను సిబ్బంది వేతనాల ద్వారా రికవరీ చేస్తారు.
పండ్లతోటలకు ‘ఉపాధి’ వరం
Published Mon, Nov 11 2013 3:20 AM | Last Updated on Wed, Apr 3 2019 4:22 PM
Advertisement
Advertisement