ఓల్డ్ ఈజ్ గోల్డ్..
Published Sun, Aug 25 2013 5:17 AM | Last Updated on Mon, Oct 8 2018 7:53 PM
మంచిర్యాల అర్బన్, న్యూస్‌లైన్ :ఒకప్పుడు మహాత్మగాంధీ ధరించిన కళ్లజోడు ఫ్రేంకు బాగా ఆదరణ ఉండేది. గాంధీజీ ఆశయ సిద్ధాంతాలనే కాకుండా ఆయన పెట్టుకునే అద్దాల మోడల్‌ను ఆదర్శంగా తీసుకునే వారు. గుండ్రటి ఫ్రేంతో కూడిన అద్దాలు గాంధీజీ ధరించేవారు. చాలా మంది అలాంటి ఫ్రేంతో కూడిన అద్దాలను పెట్టుకోవడానికి మక్కువ చూపేవారు. యువకులు మొదలుకొని వృద్ధుల వరకు అలాంటి ధరించేవారు. అలా గాంధీ అద్దాలు చాలా పాపులర్ అయ్యాయి. ఆ ట్రెండ్ కొన్ని దశాబ్దాల పాటు కొనసాగింది.
గోల్డ్ ఫ్రేంలు..
తదుపరి గోల్డ్ ఫ్రేంలు వచ్చాయి. ఆర్థికంగా వెసులుబాటు ఉన్నవారు గోల్డ్‌కలర్ ఫ్రేం అద్దాలను పెట్టుకునేవారు. ఆర్థికంగా బలహీనంగా ఉన్న వారు పెద్దసైజులో ఉన్న ఫ్రేం అద్దాలు ధరించేవారు. గోల్డ్‌కలర్ ఫ్రేం అద్దాలు పెట్టుకున్న వారు ఆర్థికవంతులు అనే భావన కలిగించేది. ఆ రోజుల్లో ఉద్యోగస్తులు, రాజకీయ నాయకులు, సినీనటులు, పారిశ్రామికవేత్తలు మాత్రమే వాటిని ధరించేవారు.
మెటల్‌ఫ్రేంలు...
అనంతరం మెటల్‌తో తయారు చేసిన ఫ్రేంల వాడకంలోకి వచ్చాయి. ఫైబర్‌తో కాకుండా మెటల్ ఫ్రేంలు ఫ్యాషన్‌గా మారాయి. ఫ్రేంలు ఎక్కువకాలం వినియోగంలో ఉండడం.. అద్దాలకు రక్షణగా ఉండడంతో వాటిని కొనుగోలు చేసేందుకు ఇష్టపడేవారు. మెటల్ ఫ్రేంల వాడకం ఇప్పటి కీ గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తూనే ఉంటుంది.
ఆఫ్ ఫ్రేం అద్దాలు..
నెక్స్ట్ జనరేషన్‌లో ఆఫ్‌ఫ్రేం అద్దాలు ఫ్యాషనయి పోయింది. ప్రస్తుతం ఆ ట్రెండ్ ఇంకా నడుస్తూనే ఉంది. ఇలాంటి ఫ్రేంతో బరువు కొంత వరకు తగ్గడంతో ఎక్కువగానే ఆసక్తి చూపుతున్నారు.
ఫ్రేం లేకుండా అద్దాలు...
మారుతున్న కాలానికి అనుగుణంగా కళ్లజోడుల ఫ్రేంల మోడల్స్ కూడా మారుతూ వచ్చాయి. బరువుతో కూడిన ఫ్రేంలు కాకుండా తేలికపాటి బరువు ఉండే అద్దాలను పెట్టుకునేందుకు మక్కువ చూపారు. అలా పుట్టుకవచ్చిందే ఫ్రేం లేకుండా కళ్ల అద్దాలు. వీటిని త్రీపీస్ ఫ్రేం అంటారు. ఫ్రేం లేకుండా ఫైబర్‌తో కూడిన అద్దాలను అమరుస్తారు. ముఖానికి అద్దాలు పెట్టుకున్న భావనే కలగదు. ఇలాంటి ఫ్రేం అద్దాలు కొంత ధర ఎక్కువగా కాగా వాటిని వినియోగించడం కూడా సున్నితమైందే.
నాడు వృద్ధులు.. నేడు యువకులు...
ఒకప్పుడు వృద్ధులు సైతం పెద్దసైజు ఫ్రేం అద్దాలను పెట్టుకోలేక ఓ దశలో పక్కనపెట్టారు. ప్రస్తుతం అలాంటి ఫ్రేంతో కూడిన అద్దాలే ఫ్యాషన్‌గా మారాయి. కళ్లకు రక్షణ ఇవ్వడంతోపాటు ముఖానికి అందంగా కనిపిస్తాయి. అంతేగాకుండా ఫ్రేంలు విరిగిపోకుండా ఎక్కువ కాలం ఉంటాయి. యువతీ యువకులు అలాంటి ఫ్రేం కళ్లజోళ్లనే ధరిస్తున్నారు. అందుకే వీటికి డిమాండ్ కూడా పెరిగింది.
సినిమాల ప్రభావం...
సినిమాల ప్రభావం యువతపై ఎక్కువగా చూపుతోంది. సినిమా హీరోలు ఎలాంటి దుస్తులు, చెప్పులు, బూట్లు ధరిస్తే అలాంటివే వేసుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. ఆ ట్రెండ్ కాస్త కళ్లజోడులను కూడా వదల్లేదు. గతంలో వృద్ధులు ధరించిన పెద్ద సైజ్ ఫ్రేం అద్దాలు.. ఇటీవల ఓ సినిమాలో ఓ స్టార్ హీరో ధరించాడు. అంతే ప్రస్తుతం ఎవరి మొఖాన చూసినా ఆ అద్దాలే కనిపిస్తున్నాయి.
విటమిన్ల లోపంతో దృష్టి సమస్య..
గతంతో పోలిస్తే ఈ మధ్యకాలంలో కంటి అద్దాలు వాడేవారి సంఖ్య పెరుగుతోంది. అందుకు కారణం విటమిన్ల లోపమని వైద్యులు పేర్కొంటున్నారు. విటమిన్ ఏ లోపంతో చిన్న వయసు నుంచే కంటి సమస్యలు వస్తున్నాయి. దీంతో కళ్లద్దాలకు డిమాండ్ పెరిగింది. కంటికి రక్షణతోపాటు ముఖానికి అందాన్ని ఇచ్చే ఫ్రేంలను ఎంపిక చేసుకుంటున్నారు. రకరకాల మోడల్స్ మార్కెట్‌లో అమ్మకాలు జరుగుతున్నాయి.
Advertisement
Advertisement