విశాఖ సిటీ/ఎన్‌ఎడీ జంక్షన్: రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు శ్రీనివాసరావు ఫోన్‌లో ఎవరెవరితో మాట్లాడారో ఇప్పుడే చెప్పలేమని విశాఖ నగర పోలీస్ కమిషనర్ మహేష్ చంద్ర లడ్హా చెప్పారు. నగరంలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం మధ్యాహ్నం ఆయన మీడియాకు కేసు వివరాలు వెల్లడించారు. జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడ్డ నిందితుడ్ని సీఐఎస్‌ఎఫ్ బృందాలు గురువారం సాయంత్రం 4.30 గంటలకు అప్పగించిన అనంతరం విచారణ చేపట్టామన్నారు. కోడి పందేల కోసం జనవరిలో సొంతూరు వెళ్లినప్పుడే ఈ కత్తుల్ని తీసుకొచ్చాడని సీపీ తెలిపారు. నిందితుడి నుంచి 11 పేజీల లేఖతో పాటు లేఖ జిరాక్స్ కాపీలు, ఒక సెల్‌ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ లేఖలో 9 పేజీలను శ్రీనివాస్ సమీప బంధువు జె. విజయలక్ష్మి రాయగా, 10వ పేజీని ఫ్యూజన్ ఫుడ్స్‌లోనే నాలుగు నెలలుగా పనిచేస్తున్న శ్రీకాకుళం జిల్లా రంగోయి గ్రామానికి చెందిన టి. రేవతీపతి (19)తో రెండు రోజుల క్రితం రాయించాడని విచారణలో వెల్లడించాడన్నారు.
ఏడాదిలో పదివేల కాల్స్
కాగా, నిందితుడు శ్రీనివాసరావు ఏడాది కాలంలో 10 వేల కాల్స్ వరకూ మాట్లాడాడనీ, అందుకు సంబంధించిన కాల్ డేటాను సేకరించామని తెలిపారు. రాజకీయ నాయకులెవరితోనైనా మాట్లాడాడా.. రెస్టారెంట్‌లో పనిచేసే వ్యక్తి తొమ్మిది ఫోన్లు ఎలా మార్చగలిగాడు.. అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సీపీ బదులిస్తూ.. కేసు విచారణలో ఉందనీ, ఆ వివరాలు ఇప్పుడు వెల్లడించలేనన్నారు. కాగా, వైఎస్ జగన్‌పై దాడికి కొంతకాలంగా ఎదురుచూస్తున్నట్లు నిందితుడు ప్రాథమిక విచారణలో తెలిపాడన్నారు. ఇదిలా ఉంటే.. ఘటన జరిగిన సమయంలో నిందితుడి వద్ద లేఖ ఉన్నట్లు సీఐఎస్‌ఎఫ్ వాళ్లు ముందు చెప్పలేదనీ, కొద్దిసేపటి తర్వాత స్టాంప్ వేసి అప్పగించారన్నారు. లేఖ ఉన్నట్లు ఎందుకు చెప్పలేదో తెలీదంటూ సమాధానాన్ని దాటవేశారు. కాగా, ఫ్యూజన్ ఫుడ్స్ యజమాని హర్షవర్ధన్‌ను విచారించేందుకు తమ బృందం వెళ్లిందనీ, ఇప్పటికే ఫోన్‌లో మాట్లాడి నోటీసు జారీచేసినట్లు ఆయన తెలిపారు. నిందితుడు శ్రీనివాసరావును అరెస్టు చేసి, సెక్షన్–307 కింద హత్యాయత్నం కేసు పెట్టామని లడ్హా తెలిపారు.
ఫోన్ కాల్స్‌పై ఇప్పుడే చెప్పలేం
Published Sat, Oct 27 2018 5:03 AM | Last Updated on Sat, Oct 27 2018 5:03 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment