ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాసరావు, అతని స్నేహితుల నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్లలో అనుమానించదగ్గ అంశాలేమీ లేవని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు తేల్చేశారు. విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఫ్యూజన్ ఫుడ్స్‌లో చేరినప్పటి నుంచి నిందితుడు తొమ్మిది సెల్‌ఫోన్లు, రెండు సిమ్‌లు వాడినట్లు.. ఏడాదిలో పదివేల కాల్స్ మాట్లాడినట్టుగా గుర్తించారు.
ఈ కాల్స్ ద్వారా దాదాపు 321మందితో సంభాషించినట్లు నిర్ధారణకు వచ్చిన అధికారులు వారి స్టేట్‌మెంట్లు రికార్డ్ చేశారు. నిందితుడు వాడిన సెల్‌ఫోన్లతో పాటు తన సిమ్‌కార్డులు వేసి మాట్లాడిన వేరే సెల్‌ఫోన్లలో ఒకటి మినహా మిగిలిన ఎనిమిదింటినీ స్వాధీనం చేసుకున్నారు. అలాగే, నిందితుడితో కలిసి పనిచేస్తున్న రమాదేవి, రేవతిపతి, హేమలత సెల్‌ఫోన్లను కూడా స్వాధీనం చేసుకుని వాటిని వారం రోజులపాటు విశ్లేషించారు. గడిచిన ఏడాది కాలం నాటి డేటాను పరిశీలించారు. ఇందులో అనుమానించదగ్గ, అభ్యంతరకరమైన అంశాలేమీ లేవని సిట్ అధికారి ఒకరు “సాక్షి’కి తెలిపారు. మరోవైపు.. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం దేవాంగనగర్‌కు చెందిన ముస్లింలతో మాత్రమే వైఎస్ జగన్‌పై తాను చేయబోయే హత్యాయత్నాన్ని ప్రస్తావించినట్టుగా గుర్తించారు.
వేరొకరి ఫోన్లలో తన సిమ్ ద్వారా కాల్స్
కాగా, శ్రీనివాసరావు ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన వారి ఫోన్లను తీసుకుని అందులో తన సిమ్ కార్డు వేసుకుని మాట్లాడేవాడని.. అనంతరం తన సిమ్ తీసుకుని వారి ఫోన్లకు వారికి ఇచ్చేసేవాడని సిట్ అధికారుల పరిశీలనలో తేలింది. ఆరు రోజుల కస్టడి అనంతరం కూడా శ్రీనివాసరావు నుంచి పోలీసులకు దీనిపై స్పష్టత రాలేదు.
పోలీస బాస్ సూచనల మేరకే నివేదిక?
ఇదిలా ఉంటే.. కేసు పురోగతిపై వచ్చే మంగళవారం హైకోర్టుకు సీల్డ్ కవర్‌లో దర్యాప్తు నివేదికను సమర్పించాల్సి ఉన్నందున సిట్ అధికారులు శనివారం పూర్తిగా ఆ నివేదిక తయారీలో నిమగ్నమయ్యారు. ఇప్పటి వరకు శ్రీనివాసరావును దాటి విచారణ ముందుకు సాగనందున పోలీస్ బాస్ సూచనల మేరకు నివేదిక తయారవుతోందన్న విమర్శలు విన్పిస్తున్నాయి.
ఎల్లుండి హైకోర్టుకు నివేదిక : సీపీ
వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసు విచారణకు సంబంధించిన అన్ని విషయాలూ న్యాయస్థానానికి మంగళవారం నివేదిస్తామని విశాఖపట్నం పోలీస్ కమిషనర్ మహేష్‌చంద్ర లడ్హా తెలిపారు. మీడియాతో శనివారం ఆయన మాట్లాడారు. ఈ కేసులో ఒక్క శ్రీనివాసరావునే నిందితుడిగా చూపిస్తున్నారు.. ఇతరులెవర్నీ ఇంకా గుర్తించలేదా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానమివ్వలేదు. ఈ కేసు దర్యాప్తు అంశాలపై ప్రస్తుతం స్పందించలేనని చెప్పారు. ఆ వివరాలను సీల్డ్ కవర్‌లో హైకోర్టుకు నివేదించిన అనంతరం మీడియాకు వెల్లడిస్తానన్నారు. అలాగే, జగన్‌కు పూర్తి భద్రత కల్పిస్తామని.. అదనపు భద్రత అడిగితే పరిశీలిస్తామని లడ్హా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment