ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్‌కు విచారణ జరిపేందుకు వస్తున్న విశాఖ సీపీ మహేష్‌చంద్ర లడ్డా
సాక్షి, విశాఖపట్నం: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడ్డ జనుపల్లి శ్రీనివాసరావు విచారణకు ఏమాత్రం సహకరించడం లేదని, నిజాలు దాచిపెడుతున్నాడని విశాఖపట్నం పోలీస్ కమిషనర్ మహేష్‌చంద్ర లడ్డా తెలిపారు. గత మూడు రోజులుగా ఎన్ని విధాలుగా విచారిస్తున్నా నిందితుడి నుంచి ఎలాంటి నిజాలు రాబట్టలేకపోతున్నామని అన్నారు. నిందితుడు కొన్ని విషయాలు చెప్పడానికి ఎంతమాత్రం అంగీకరించడం లేదని, కావాలనే దాచేస్తున్నట్టు అర్థమవుతోందన్నారు. కేసు విచారణలో కత్తి, లేఖ విషయంపై ఫోరెన్సిక్ నిపుణులు దర్యాప్తు చేయాల్సి ఉందని వెల్లడించారు. నిందితుడు సంపూర్ణ ఆరోగ్యంతోనే ఉన్నాడని వైద్యులు చెప్పారని పేర్కొన్నారు. మూడో రోజు విచారణలో పెద్దగా పురోగతి లేదని, ఆరోగ్యం బాగోలేదంటూ నిందితుడు సహకరించకపోవడం వల్ల కేజీహెచ్‌కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. మహేష్‌చంద్ర లడ్డా మంగళవారం ఎయిర్ పోర్టు పోలీస్ స్టేషన్‌లో మీడియాతో మాట్లాడారు. శ్రీనివాసరావును పోలీసు కస్టడీకి ఇచ్చే సమయంలో కోర్టు కొన్ని నిబంధనలు పెట్టిందని, ఆ మేరకు నిందితుడికి 48 గంటలకోసారి వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉందన్నారు. కస్టడీలో ఉన్న నిందితుడిని వైద్య పరీక్షల నిమిత్తం తరలించే సమయంలో కొద్దిగా హడావుడి జరిగిందన్నారు. సాధారణ వైద్య పరీక్షల్లో బాగంగానే అతడికి వైద్య పరీక్షలు చేయించామని చెప్పారు.
ఏడు సెల్‌ఫోన్లు సీజ్
నిందితుడు వాడిన 9 సెల్‌ఫోన్లలో 7 ఫోన్లను సీజ్ చేశామని కమిషనర్ లడ్డా తెలిపారు. ఒకటి యానాంలో పోగోట్టుకున్నట్టు చెబుతున్నాడని, మరొకటి ఎవరి వద్ద ఉందని ప్రశ్నిస్తే ఇద్దరు వ్యక్తుల పేర్లు చెప్పాడని, వారు దొరకడం లేదని వివరించారు. నిందితుడికి ఉన్న 3 బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తే ముమ్మిడివరంలోని ఎస్‌బీఐ, అమలాపురంలోని విజయబ్యాంకు, ఆంధ్రాబ్యాంకుల్లో ఖాతాలున్నట్టు నిర్ధారణ అయ్యిందన్నారు. సహ ఉద్యోగి రమాదేవి ఖాతా నుంచి ఒకసారి రూ.50,000, మరోసారి రూ.20,000 నిందితుడి ఖాతాకు జమైనట్లుగా గుర్తించామన్నారు. జమ అయిన వెంటనే ఈ సొమ్మును తన సోదరుడి కోసమంటూ శ్రీనివాసరావు డ్రా చేసినట్టుగా గుర్తించామని పేర్కొన్నారు. ఎస్‌బీఐలో రూ.55, విజయాబ్యాంకులో రూ.357, ఆంధ్రా బ్యాంకులో జీరో బ్యాలెన్స్ ఉందన్నారు. ఇప్పటివరకు 35 మందిని విచారించామన్నారు. రెస్టారెంట్‌లో కుక్‌గా పనిచేసిన వ్యక్తి సెల్‌ఫోన్ శ్రీనివాసరావు వాడాడని తెలియడంతో ఆ మేరకు విచారణ నిమిత్తం ఓ బృందాన్ని కుక్ స్వస్థలమైన మధ్యప్రదేశ్‌కు పంపామన్నారు. కాల్ డేటా ఆధారంగా మరో బృందాన్ని ఒడిశాకు పంపించామన్నారు. మరోవైపు ఈ కేసును పర్యవేక్షిస్తున్న డీసీపీ ఫకీరప్ప కర్నూలు ఎస్పీగా బదిలీ అయినందున ఆయనను బుధవారం రిలీవ్ చేస్తున్నామన్నారు. ఆయన స్థానంలో డీసీపీ జోన్–2గా నియమితులైన నయీం ఈ కేసును పర్యవేక్షిస్తారని తెలిపారు. విచారణ నిమిత్తం 160 సెక్షన్ కింద వైఎస్సార్‌సీపీ నాయకులకు నోటీసులు పంపించామని, వారిలో జియాని శ్రీధర్, కృష్ణకాంత్‌లు మినహా మిగిలిన వారు విచారణకు హాజరు కాలేదన్నారు.
ఎలాంటి ఒత్తిళ్లు లేవు
నిందితుడి విచారణ విషయంలో ఎలాంటి ఒత్తిళ్లు లేవని సీపీ స్పష్టం చేశారు. ప్రాణహాని ఉందని నిందితుడు చేస్తున్న ఆరోపణలను సీపీ వద్ద ప్రస్తావించగా... అలాంటిదేమీ లేదని కొట్టిపారేశారు. తనను చంపి రాజకీయం చేయాలని నిందితుడు చెబుతున్న విషయం ప్రస్తావించగా... ఆ అవసరం ఎవరికుందని సీపీ ఎదురు ప్రశ్న వేశారు. నిందితుడు ఆ విధంగా ఎందుకు మాట్లాడుతున్నాడో తెలియడం లేదన్నారు. జగన్‌పై హత్యాయత్నం జరిగిన వెంటనే సీఐఎస్‌ఎఫ్ అధికారులు ఫిర్యాదు చేయడంలో జాప్యం జరిగిన విషయాన్ని ప్రస్తావించగా.. కొన్ని సాంకేతిక కారణాల వల్ల జాప్యం జరిగిందని లడ్డా అంగీకరించారు. జాప్యానికి గల కారణాలపై విచారణ చేస్తున్నామన్నారు. బాధితుడు జగన్ విచారణకు సహకరించే విషయమై 160 నోటీసు జారీ చేసామని, న్యాయపరమైన సలహాలు తీసుకుని తదుపరి చర్యలు చేపడతామని తెలిపారు. నిందితుడికి నిరభ్యంతర పత్రం(ఎన్‌ఓసీ) జారీ చేయడంపై కమిషనర్ స్పందిస్తూ... ఎయిర్‌పోర్టు పోలీసు స్టేషన్ పరిధిలో అతడిపై ఎలాంటి కేసులు లేనందున ఎన్‌ఓసీ జారీ చేశారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment