
సాక్షి, హైదరాబాద్: బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగించే విషయాన్ని పరిశీలిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. ఇందులో భాగంగా ఈ వ్యాజ్యంలో సీబీఐని ప్రతివాదిగా చేరుస్తూ నోటీసులు జారీచేసింది. ఆయేషా హత్యతో ముడిపడి ఉన్న వస్తువులను (మెటీరియల్ ఆబ్జెక్ట్స్) కేసు తేలక ముందే కింది కోర్టు నాశనం చేయడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించి.. విచారణకు ఆదేశించింది.
కింది కోర్టు తీర్పును సవాలు చేస్తూ సత్యంబాబు దాఖలు చేసిన అప్పీల్‌పై హైకోర్టు తీర్పు నివ్వడానికి ముందే వస్తువులను ఎవరి ఆదేశాల మేరకు నాశనం చేశారు.. ఏ ఏ వస్తువులు నాశనమయ్యాయి.. ఇందుకు బాధ్యులెవరు.. ఇందులో న్యాయవ్యవస్థకు సంబంధించిన అధికారుల పాత్ర ఉందా.. ఉంటే వారు ఏ స్థాయి అధికారులు.. తదితర అంశాలపై విచారణ జరపాలని రిజిస్ట్రార్ జనరల్ (ఆర్‌జీ)ను ఆదేశించింది. ఈ విచారణలో ఏ స్థాయి అధికారినైనా కూడా విచారించవచ్చని ఆర్‌జీకి హైకోర్టు స్పష్టం చేసింది. 4 వారాల్లో నివేదికను తమ ముందుంచాలని, దాన్ని బట్టి ఈ కేసులో దర్యాప్తును సిట్‌చే కొనసాగించడమా? లేక సీబీఐకి అప్పగించడమా? అన్న అంశాన్ని పరిశీలిస్తామంది. అనంతరం ఈ కేసును 4 వారాల పాటు వాయిదా వేసింది.
ఈ కేసులో సత్యం బాబును నిర్దోషిగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పులో హైకోర్టు ధర్మాసనం నిర్ణయాత్మక అభిప్రాయాలను వ్యక్తం చేసిందని, దీని ప్రకారం ఈ కేసులో పునర్ దర్యాప్తు చేయించాల్సిన అవసరం ఉందంటూ ఓయూ రిటైర్డ్ ప్రొఫెసర్ రమా మేల్కొటే, పాత్రికేయురాలు కె.సజయ, సామాజిక కార్యకర్త సంధ్యారాణి సంయుక్తంగా హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. తమ కుమార్తె హత్య కేసుపై సిట్ చేసే పునర్ దర్యాప్తును హైకోర్టే పర్యవేక్షించాలని, లేకుంటే సీబీఐకి అప్పగించాలని కోరుతూ ఆయేషా తల్లిదండ్రులు మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment