నగరం ఇక స్మార్ట్!
- ‘అమృత్’లో బెజవాడకు స్థానం
- నగరవాసుల్లో ‘స్మార్ట్’ ఆశలు
- మంత్రి వెంకయ్యతో మేయర్ భేటీ
- జిల్లాలో మచిలీపట్నం, గుడివాడకూ చోటు
విజయవాడ సెంట్రల్ : షాపింగ్ మాల్స్, స్టార్ హోటళ్లు, కార్పొరేట్ విద్యాసంస్థలు, ఆస్పత్రులు, ఐనాక్స్ థియేటర్లతో భాసిల్లుతున్న బెజవాడ నగరం భవిష్యత్‌తో మరింత ఆకర్షణీయ (స్మార్ట్) హంగులను సంతరించుకోనుంది. కేంద్ర ప్రభుత్వ పట్టణాభివృద్ధి పథకం అటల్ అర్బన్ మోడ్రనైజేషన్ రెన్యువల్ స్కీం (అమృత్)లో నగరానికి చోటు దక్కడంతో అభివృద్ధి పరుగు పెడుతుందన్న ఆశలు రేకెత్తుతున్నాయి.
దేశంలో 100 స్మార్ట్ సిటీలు, 500 అమృత నగరాలను తీర్చిదిద్దాలన్నది ఈ పథకం ఉద్దేశం. ఢిల్లీలోని విజ్ఞాన భవన్‌లో గురువారం పట్టణ స్మార్ట్ సిటీ మిషన్, అటల్ అర్బన్ మోడ్రనైజేషన్ రెన్యువల్ స్కీం సంయుక్తంగా నిర్వహించిన వర్క్‌షాప్‌లో నగర మేయర్ కోనేరు శ్రీధర్, కమిషనర్ జి.వీరపాండియన్ పాల్గొన్నారు. శుక్రవారంతో ఈ వర్క్‌షాప్ పూర్తి కానుంది.
సమష్టి కృషితో అభివృద్ధి...
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు నగరపాలక సంస్థ సమష్టిగా కృషి చేస్తేనే విజయవాడ స్మార్ట్ సిటీగా రూపుదిద్దుకుంటుందని ఈ వర్క్‌షాప్‌లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. నగర మేయర్ కోనేరు శ్రీధర్, గుడివాడ మునిసిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు గురువారం ఢిల్లీలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడును ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే విజయవాడను అగ్రగామిగా నిలిపేందుకు సహకరించాల్సిందిగా కోరారు. నగరంలో చేపట్టనున్న ప్రాజెక్టులకు సంబంధించి పూర్తిస్థాయి నివేదికలను అందించారు. స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసేందుకు చేయూత నివ్వాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి వెంకయ్య మాట్లాడుతూ సమష్టి కృషితో అభివృద్ధి చేద్దామని హామీ ఇచ్చారు.
స్మార్ట్ సిటీ అంటే...
అన్నీ అనుకున్నట్లే జరిగి నిధుల వరద వస్తే నగర రూపురేఖలు మారిపోతాయనడంతో సందేహం లేదు. మెట్రో రైలు, సువిశాలమైన రోడ్లు, గ్రీన్ ఫీల్డ్, అత్యాధునిక టెక్నాలజీతో శానిటేషన్ అభివృద్ధి, 24 గంటలు విద్యుత్ సౌకర్యం, రోజంతా నగర ప్రజలకు అందుబాటులో శుద్ధమైన మంచినీరు, ఆధునిక హంగులతో కూడిన రైల్వేస్టేషన్, బస్టాండ్, విమానాశ్రయం, సిటీ మొత్తం వైఫై సౌకర్యం, గ్రీన్ ఫీల్డ్, డిస్నీల్యాండ్, కాలువల్లో బోటింగ్‌లు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు నగరవాసులకు అందుబాటులోకి వస్తాయి.
జేఎన్‌ఎన్యూఆర్‌ఎం,‘రే’ కనుమరుగు
జవహర్‌లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ (జేఎన్‌ఎన్యూఆర్‌ఎం), రాజీవ్ ఆవాస్ యోజన (రే) పథకాలు ఇకపై కనుమరుగు కానున్నాయి. 2007లో విజయవాడ నగరం జేఎన్‌ఎన్యూఆర్‌ఎం పథకం కింద ఎంపికైంది. రూ.1,422 కోట్లతో నగరాభివృద్ధి, గృహ నిర్మాణాలను ప్రారంభించారు. అర్బన్ ఇన్‌ఫాస్ట్రక్చర్ గవర్నెన్స్ (యూఐజీ) కింద రోడ్లు, డ్రెయిన్లు, భూగర్భ డ్రెయినేజ్, సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు, వాటర్ ప్లాంట్ల పనులు రూ.724 కోట్లతో చేపట్టారు. ఇందులో 85 శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలినవి వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. ఆనాడు చేసిన సర్వేలో లక్షా 4 వేల మందికి గృహాలు కావాలని తేలింది.
తొలి విడతగా 28,152 గృహ నిర్మాణాలను చేపట్టాలని కార్పొరేషన్ నిర్ణయించింది. స్థలాల కొరత నేపథ్యంలో 18,176 గృహ నిర్మాణాలు చేపట్టారు. ఇందులో 14,345 పూర్తి చేశారు. 3,841 గృహ నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. రాజీవ్ ఆవాస్ యోజన (రే) పథకం కింద ఎన్‌ఎస్‌సీ బోస్ నగర్‌లో 1,413, దాల్‌మిల్ ప్రాంతంలో 304 గృహ నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. అప్పటి కేంద్రమంత్రి చిరంజీవి దాల్‌మిల్ ఏరియాలో శంకుస్థాపన కూడా చేశారు. నిధుల లేమి కారణంగా ఇంత వరకు నిర్మాణాలు ప్రారంభం కాలేదు. ఎన్డీఏ ప్రభుత్వం కొత్త పథకాన్ని తెరపైకి తెచ్చిన నేపథ్యంలో నూతనంగా చేపట్టబోయే అభివృద్ధి పనులు, గృహ నిర్మాణాల పేరు అమృత్‌గా మారనుంది.
మచిలీపట్నం, గుడివాడకు మహర్దశ
జిల్లాలోని మచిలీపట్నం, గుడివాడ పురపాలక సంఘాలకు మహర్దశ పట్టనుంది. నగరంతో పాటు జిల్లా నుంచి ఈ రెండు పట్టణాలు కూడా అమృత్ పథకంలో చోటు దక్కించుకున్నాయి. దీంతో ఇవి కూడా స్మార్ట్ పట్టణాలుగా అభివృద్ధి చెందనున్నాయి. బందరు మున్సిపల్ చైర్మన్ బాబాప్రసాద్, కమిషనర్ మారుతీదివాకర్, గుడివాడ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, కమిషనర్ జి.ప్రదీప్‌కుమార్ కూడా ఢిల్లీలో జరిగిన వర్క్‌షాప్‌కు హాజరయ్యారు.