‘స్మార్ట్’గా చెయ్యిచ్చిన కేంద్రం
తొలివిడత 20 స్మార్ట్‌సిటీల జాబితాలో తెలంగాణకు దక్కని చోటు
సాక్షి, హైదరాబాద్: స్మార్ట్‌సిటీల ఎంపికలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మొండి చెయ్యి చూపింది. ఈ పథకం కింద తొలివిడతగా వివిధ రాష్ట్రాల నుంచి 20 నగరాలను ఎంపిక చేసినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రి వెంకయ్యనాయుడు గురువారం ఢిల్లీలో ప్రకటించారు. కానీ ఆ జాబితాలో తెలంగాణ నుంచి ఒక్క నగరానికి కూడా చోటు దక్కలేదు. తొలివిడతలో ఎంపిక కోసం రాష్ట్రం నుంచి గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్ నగరాలు ‘స్మార్ట్‌సిటీ చాలెంజ్’లో పోటీపడ్డాయి. ఈ పథకం కింద ఎంపికయ్యే నగరాల్లో అభివృద్ధి కోసం కేంద్రం ఐదేళ్ల పాటు ఏటా రూ.200 కోట్లు ఇస్తుంది.
అయితే గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి ఆ నిధులు ఏ మూలకూ సరిపోవని భావించిన రాష్ట్ర ప్రభుత్వం... స్మార్ట్‌సిటీ చాలెంజ్ నుంచి హైదరాబాద్‌ను ఉప సంహరించుకుని, కరీంనగర్ నగరాన్ని ప్రతిపాదించింది. ఈ మేరకు నెల రోజుల కింద ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్వయంగా కేంద్రానికి లేఖ రాశారు. దీంతో కేంద్రం హైదరాబాద్ నగరాన్ని స్మార్ట్‌సిటీ చాలెంజ్ నుంచి తప్పించగా... రాష్ట్రం నుంచి వరంగల్ నగరం ఒక్కటే పోటీలో నిలబడింది. చివరకు గురువారం ప్రకటించిన తొలివిడత నగరాల జాబితాలో వరంగల్ పేరు గల్లంతయింది. దేశవ్యాప్తంగా 100 నగరాలను స్మార్ట్‌సిటీలుగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం ఈ పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
ఈ పథకం కింద వివిధ రాష్ట్రాల నుంచి ఎంపిక కానున్న నగరాల సంఖ్యను గతేడాదే కేంద్రం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి మూడు నగరాలను, తెలంగాణ నుంచి రెండు నగరాలను మాత్రమే ఎంపిక చేస్తామని తెలిపింది. దీనిపై అప్పట్లోనే రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు నిరసన తెలిపాయి. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందంటూ టీఆర్‌ఎస్ ఎంపీలు కేంద్రంపై విమర్శలు కూడా గుప్పించారు. అయినా కేంద్రం స్పందించలేదు. తాజాగా ప్రతిపాదనలో ఉన్న ఒక్క వరంగల్ నగరానికి కూడా తొలిజాబితాలో చోటుదక్కలేదు.
చాలెంజ్‌పై అనుమానాలు
స్మార్ట్‌సిటీ చాలెంజ్‌లో పాల్గొన్న నగరాలకు కేంద్రం ‘100 పాయింట్ల’ పరీక్ష పెట్టింది. ఆయా నగరాల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలకు 25 పాయింట్లు, సంస్థాగత నిర్మాణం/సామర్థ్యానికి 15 పాయింట్లు, స్వీయ ఆర్థిక సామర్థ్యాని(సెల్ఫ్ ఫైనాన్సింగ్)కి 30 పాయింట్లు, గత ట్రాక్ రికార్డు, సంస్కరణల అమలుకు 30 పాయింట్లు కలిపి మొత్తం 100 పాయింట్లకు ఈ చాలెంజ్‌ను నిర్వహించింది. 100 పాయింట్లలో ఎక్కువ పాయింట్లు సాధించే నగరాలను ఎంపిక చేస్తామని పేర్కొం టూ అప్పట్లో మార్గదర్శకాలను విడుదల చేసింది.
అయితే ఈ చాలెం జ్‌లో తెలంగాణలోని రెండో అతి పెద్ద నగరమైన గ్రేటర్ వరంగల్ నెగ్గకపోవడంపై రాష్ట్ర అధికార వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రం ప్రకటించిన మార్గదర్శకాల మేరకు సంతృప్తికరంగా వరంగల్ నగర ప్రతిపాదనలను సమర్పించామని రాష్ట్ర పురపాలక శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. అయినా ఎంపిక చేయకపోవడం ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారిందన్నారు.