ఖమ్మం, న్యూస్‌లైన్: ‘‘పార్టీ అధిష్ఠానం ముందు ఒక తీరుగా, బయటకు వచ్చిన తర్వాత మరోతీరుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు దొంగాట ఆడుతున్నారు. ఆ పార్టీ మంత్రి వట్టి వసంతకుమార్ శాసన సభలో మాట్లాడిన తీరు విడ్డూరంగా ఉంది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులకు దమ్ము, ధైర్యం ఉంటే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుపై సీడబ్ల్యూసీ చేసిన ప్రకటనకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలి’’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ సవాల్ విసిరారు. గురువారం ఖమ్మంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అత్యున్నత కమిటీ సీడబ్ల్యూసీ ప్రకటన చేసిందని.., దీనిని కేంద్ర మంత్రుల కమిటీ ఆమోదించి రాష్ట్రపతికి పంపిన విషయం కాంగ్రెస్ నాయకులకు తెలియదా అని ప్రశ్నించారు.
శాసన సభలో తెలంగాణ, సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు ఒకరినొకరు విమర్శించుకుంటూ.. బయటకు వచ్చి చె ట్ట పట్టాలు వేసుకుంటున్నారని అన్నారు. టీడీపీ కూడా అదేవిధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఇరుపార్టీలు తెలంగాణ విషయంలో నాటకాలు ఆడుతూ రాజకీయ వ్యభిచారం చేస్తున్నాయని మండిపడ్డారు. భారతీయ జనతాపార్టీ అవకాశవాద రాజకీయాలు చేస్తోందని అన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా, చర్చలు, ఓటింగ్‌తో కాలయాపన చేసినా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఆగదన్నారు. జనవరి 23 తర్వాత బిల్లు రాష్ట్రపతి వద్దకు వెళ్తుందని చెప్పారు. ఢిల్లీలో అమ్‌ఆద్మీ పార్టీ కార్యాలయంపై బీజేపీ, భజరంగదళ్ కార్యకర్తలు దాడి చేయడం ప్రజాస్వామ్యానికే మచ్చ అన్నారు. కాదుపొమ్మన్నా... టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీ వెంటే తిరగడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం అన్నారు. విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకులు సిద్ది వెంకటేశ్వర్లు, ఖమ్మం జిల్లా కార్యదర్శి భాగం హేమంతరావు పాల్గొన్నారు.
దమ్ముంటే సీడబ్ల్యూసీ నిర్ణయంపై వ్యతిరేక తీర్మానం చేయండి
Published Fri, Jan 10 2014 3:59 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement