డబ్బులే డబ్బులు!
సాక్షి ప్రతినిధి, కడప : ‘వడ్డించే వాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చుంటేనేం’ అన్న సామెత టీడీపీ నేతలకు అతికినట్లు సరిపోతోంది. ‘నీరు-చెట్టు’ కార్యక్రమం ఆ పార్టీ నేతలు, కార్యకర్తలకు కల్పతరువుగా మారింది. నీటి సంరక్షణ చర్యలు అటుంచితే, కార్యకర్తల జేబులు నింపుతోంది. నిరుపయోగమైన పనుల ద్వారా కోట్లు కొల్లగొడుతున్నారు. టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తున్న రాయచోటి ప్రాంతానికి చెందిన అన్నదమ్ములు ‘పెట్టుబడి తక్కువ, ఆదాయం ఎక్కువ’ అన్నట్లుగా అనవసర పనులతో రూ.7 కోట్లు వెనకేసుకున్నారు. లక్కిరెడ్డిపల్లె చుట్టూ ఉన్న వంకల్లో కంప చెట్లు తొలిగించి, చదును చేసి పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని స్వాహా చేసిన వైనమిది.
వివరాల్లోకి వెళితే.. జిల్లాలో తొలివిడతగా 155 చెరువుల్లో నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా పూడికతీత పనులు చేపట్టారు. అందుకుగాను రూ.7.5 కోట్లు వెచ్చించారు. ఈ పనులు జూన్‌కు పూర్తయ్యాయి. అప్పట్లో చెరువులోని మట్టిని రైతులు అధిక శాతం పొలాలకు తరలించారు. మరికొన్ని చోట్ల లే ఔట్‌లకు తరలించి టీడీపీ నేతలు సొమ్ము చేసుకున్నారు. ఇవేవి పరిగణలోకి తీసుకోకుండా అధికారులు బిల్లులు చెల్లించి స్వామి భక్తి ప్రదర్శించారు. ప్రస్తుతం రెండవ విడతగా చెరువుల్లోకి నీరు వచ్చే మార్గాల్లోని వాగులు, వంకల్లో పూడికతీత పనులు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా 214 పనులు గుర్తించి ఆ మేరకు జూలై నుంచి పనులు ప్రారంభించారు. ఇప్పటికే 100 పనులు పూర్తి కాగా, మరో 70 పనులు నిర్మాణ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. మరో 44 పనులు ప్రారంభించాల్సి ఉంది. రెండవ విడత మొత్తం పనులకుగాను జిల్లా వ్యాప్తంగా రూ.22.5 కోట్లు వెచ్చించనున్నారు. ఇందులో ఇప్పటికే దాదాపుగా రూ.17 కోట్లు బిల్లులు చెల్లించారు.