తాగునీటి సమస్య ఏర్పాటే నా లక్ష్యం: లోకేష్
ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు మరోసారి నోరు జారారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ మంత్రిగా తూర్పుగోదావరి జిల్లాలో చేసిన తొలి పర్యటనలోనే ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. గతంలో అంబేద్కర్ జయంతిని వర్థంతి అంటూ వ్యాఖ్యానించి వివాదంలో ఇరుక్కున్న లోకేష్ తీరు మారలేదని మరోసారి రుజువయింది.
తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని కరపలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ లోకేష్ అన్న మాటలు విని సామాన్య జనం అవాక్కయ్యారు. అంతకుముందు జి.మేడపాడు సభలో కాబోయే సీఎం నారా లోకేష్ అంటూ ఉప ముఖ్యమత్రి పేర్కొనగా ఆ వెంటనే మరోసభలో లోకేష్ తాగునీటి సమస్య సృష్టించడమే తన లక్ష్యమంటూ పేర్కొనడం ఆసక్తిగా మారింది. తాగునీటి సమస్య పరిష్కరిస్తానని చెప్పడానికి బదులు స్వయంగా మంత్రిగారు ఇలా చెప్పడంతో కరప వాసులు ఒక్కసారిగా షాక్ తిన్నారు.
ఇప్పటికే లోకేష్ తీరుతో పెద్ద దుమారం రేగుతోంది. అంబేద్కర్ మీద చేసిన వ్యాఖ్యలతో కలకలం రేగుతోంది. దానికి తోడు ఇప్పుడు మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా కనిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్రమంతా తాగునీటి సమస్య ఉంది. లోకేష్ మామ బాలకృష్ణ సొంత నియోజకవర్గం హిందూపురంలో తాగునీటిని బిందెల చొప్పున కొనుగోలు చేయాల్సి వస్తోందని ఆందోళనకు దిగారు. ఇక ఇప్పుడు ఏకంగా గోదావరి జిల్లాకు వెళ్లి అక్కడ కూడా తాగునీటి సమస్య ఏర్పాటు చేస్తాననడం మరోసారి సంచలనంగా మారింది.