
ఏజెన్సీలో విజృంభిస్తున్న మలేరియా
మన్యంలో ఈ ఏడాది మలేరియా విజృంభిస్తోంది. మండలంలోని గోమంగి పీహెచ్‌సీ పరిధిలోని గుల్లేలు పంచాయతీ
ఒకే కుటుంబంలో నలుగురికి మలేరియా పాజిటివ్
గుల్లేలు పంచాయతీలో జ్వరాలు
మారుమూల గ్రామాల్లో పిచికారీకి నోచుకోని దోమల నివారణ మందు
పెదబయలు: మన్యంలో ఈ ఏడాది మలేరియా విజృంభిస్తోంది. మండలంలోని గోమంగి పీహెచ్‌సీ పరిధిలోని గుల్లేలు పంచాయతీ పెదవంచరంగి గ్రామానికి చెందిన పూజారి మోహన్‌రావు, భార్య పూజారి కమలమ్మ, మోహిని, విజయ్‌కుమార్‌కు మలేరియా పాజిటివ్ నమోదైంది. గ్రామంలో గురువారం నిర్వహించిన వైద్యశిబిరంలో వారి రక్తపూతల పరీక్షలో మలేరియా పాజిటివ్‌గా వైద్యాధికారి పావని గుర్తించారు. జ్వరపీడితులను స్థానిక పీహెచ్‌సీకి ఆమె రిఫర్ చేశారు. శుక్రవారం సాయంత్రం వరకు పీహెచ్‌సీలో సిబ్బంది లేకపోవడంతో అక్కడినుంచి వారిని 108లో పాడేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. చీమకొండ, జంగంపుట్టు, కించూరు, రెంజెలమామిడి గ్రామాల్లో జ్వరాల ప్రభావం ఎక్కువగా ఉంది. పెదవంచరంగి గ్రామంలో ఇప్పటివరకు మలేరియా దోమల నివారణ మందు పిచికారి చేయలేదని గ్రామస్తులు తెలిపారు. గ్రావిటీ పథకం మరమ్మతులకు గురైనందున ఊటగెడ్డల నీటిని తాగుత న్నామని వారు వాపోయారు. మారుమూల గ్రామాల్లో వైద్య సిబ్బంది సక్రమంగా రావడం లేదని వారు ఆరోపించారు.
ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేయాలి
గుల్లేలు పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో జ్వరాల ప్రభావం ఎక్కువగా ఉన్నందున ప్రత్యేక వైద్యశిబిరం ఏర్పాటుచేయాలని ఆయా ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు. పంచాయతీల్లో ఎపిడిమిక్ ప్రత్యేక అధికారులను నియమించినా వారు రోడ్డు పక్క గ్రామాలకు పరిమితం అవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి ప్రత్యేక వైద్యశిబిరం ఏర్పాటుచేయాలని వారు కోరుతున్నారు.