శ్రీకాకుళం అర్బన్:దమ్ముంటే తక్షణమే రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధమవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం సవాలు విసిరారు. శ్రీకాకుళంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్ సీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ పార్టీ ఫిరాయింపులకు పాల్పడడం దురదృష్టకరమన్నారు. రాజకీయాల్లో విలువలు, నీతి నియమాల కోసం టన్నుల కొద్ది ఉపన్యాసాలు ఇచ్చే చంద్రబాబు పార్టీ ఫిరాయింపులను నిర్లజ్జగా, నిస్సిగ్గుగా ప్రోత్సహిస్తూనజరానాలు ప్రకటించడం దారుణమన్నారు.
నాడు దివంగత ఎన్‌టీఆర్ పెట్టిన టీడీపీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయని, ప్రస్తుత చంద్రబాబు అధ్యక్షత వహిస్తున్న టీడీపీకి నీతి, నియమాలు వంటివేవీ లేవన్నారు. గడచిన శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 17మంది శాసనసభ్యులు వైఎస్సార్‌సీపీలోకి వస్తే అది అనైతికత కిందకు వస్తుందని భావించి వారందరితో రాజీనామా చేయించి మళ్లీ గెలిపించుకుని పార్టీలో చేర్చుకుందని గుర్తు చేశారు. ఇది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నీతి, నిబద్దత, ఆదర్శమన్నారు. జగన్‌మోహనరెడ్డి నాయకత్వంలో ప్రజాస్వామ్య పరిరక్షణ విలువలను కాపాడామన్నారు.
వైఎస్సార్‌సీపీని వీడిన భూమా నాగిరెడ్డి, అఖిలప్రియ, ఆదినారాయణరెడ్డి, జలీల్‌ఖాన్‌లతోపాటు ఎమ్మెల్సీ నారాయణరెడ్డిలకు ఏమాత్రం నైతికత ఉన్నా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గ ప్రజానీకానికి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఒక పార్టీ బి-ఫారం ఇచ్చి గెలిపిస్తే ఆ పార్టీకి, పార్టీ అద్యక్షునికి సమాధానం చెప్పాల్సిన నైతిక బాధ్యత ఉందన్నారు. టీడీపీ మునిగిపోయే నావ అని, వీళ్ళంతా ఎలా వెళ్ళారో అర్ధం కావడం లేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పద్ధతి ఉంటే టీడీపీ వాళ్ళతో రాజీనామా చేయించాలన్నారు. సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా అదికార ప్రతినిధి ఎన్ని ధనుంజయ్, పార్టీ నేతలు పొన్నాడ రుషి, కె.ఎల్.ప్రసాద్, శిమ్మ వెంకట్రావు, రావాడ జోగినాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఫిరాయింపుదార్లకు నజరానాలా..
Published Tue, Feb 23 2016 11:31 PM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement