
సెక్యూరిటీ గార్డులా వచ్చి.. సొమ్ము కొట్టేశాడు!!
ఏటీఎంకు వెళ్లినప్పుడు అక్కడ డబ్బులు రావట్లేదా? అయినా కూడా సెక్యూరిటీ గార్డులను డబ్బులు తీసివ్వమని పొరపాటున కూడా అడగొద్దు. ఎందుకంటే, అమలాపురంలో ఇలాగే సెక్యూరిటీ గార్డు వేషంలో వచ్చిన వ్యక్తి.. ఓ అమాయకుడి దగ్గర ఏటీఎం కార్డు తీసుకుని ఏకంగా 40 వేలు కొట్టేశాడు!! ఈ సంఘటన అమలాపురం హైస్కూలు సెంటర్లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఏటీఎంలో జరిగింది.
అమలాపురానికి చెందిన బిళ్ల కొల్లాపురి అనే వ్యక్తి హైస్కూలు సెంటర్లో ఉన్న ఏటీఎంకు వెళ్లాడు. అక్కడ అతడు ఎంత ప్రయత్నించినా నగదు రాలేదు. ఏం చేయాలా అని చూస్తుండగా సెక్యూరిటీ గార్డు యూనిఫాంలో ఉన్న ఓ వ్యక్తి లోపలకు వచ్చాడు. తాను ప్రయత్నిస్తానని చెప్పి అతడి నుంచి ఏటీఎం కార్డు, పిన్ నెంబరు అడిగి తీసుకున్నాడు. కాసేపటి తర్వాత సొమ్ము రావట్లేదని కార్డు తిరిగి ఇచ్చేశాడు. దాంతో కొల్లాపురి వేరే ఏటీఎంకు వెళ్లగా అక్కడ ఆ కార్డు సరిగా పనిచేయలేదు.
దాంతో బ్రాంచికి వెళ్లి, తన కార్డును బ్లాక్ చేయాలని కోరాడు. అయితే.. అప్పటికే కొంకాపల్లి ప్రాంతంలో ఉన్న ఓ ఏటీఎంలో ఈ ఖాతా నుంచి 40 వేల రూపాయలు డ్రా అయినట్లు బ్యాంకు అధికారులు అతడికి చెప్పారు. దాంతో.. సెక్యూరిటీ గార్డు వేషంలో వచ్చిన వ్యక్తి తనను మోసం చేసి కార్డు మార్చేశాడని, ఆ తర్వాత సొమ్ము డ్రా చేశాడని గుర్తించారు. కొల్లాపురి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.