కదిరి (అనంతపురం) : తన భార్యను ఓ పోలీస్ మాయమాటలతో నమ్మించి, తనకు దూరం చేశాడని ఓ బాధితుడు శుక్రవారం కదిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. కదిరి పట్టణానికి చెందిన రాజా 5వ తరగతి వరకు చదువుకుని బేల్దారి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీన ఓ వీఆర్‌ఓ కుమార్తెతో వివాహమైంది. ఆమె డిగ్రీ వరకు చదువుకుంది.
అయితే ఆమెకు రాజేష్ అనే ఓ పోలీస్ కానిస్టేబుల్‌తో పెళ్లికి మునుపే వివాహేతర సంబంధం ఉండటంతో అది గమనించిన ఆ అమ్మాయి తల్లిదండ్రులు వెంటనే పెళ్లి సంబంధం చూసి చదువు తక్కువైనా పర్వాలేదంటూ ఆ అమ్మాయిని బేల్దారి రాజాకు కట్టబెట్టారు. పెళ్లి తర్వాత కూడా ఆమె ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో రాజాకు అనుమానం వచ్చి తరచూ భార్యతో గొడవలు పడేవాడు. దీంతో ఆమె మనస్థాపానికి గురై తన పుట్టింటికి కూడా వెళ్లకుండా రెండు రోజుల క్రితం ఇంట్లో నుంచి ఎక్కడికో పారిపోయింది.
ప్రస్తుతం పెనుకొండ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా ఉన్న రాజేషే నా భార్యను మాయం చేశాడని రాజా ఆరోపిస్తున్నాడు. 'నీ భార్యను అదుపులో పెట్టుకో' అని రాజేష్ భార్య మెసేజ్ పెట్టిందని తెలిపాడు. 'ఆ రాజేష్ నుంచి నా భార్యను విడిపించి నాకు అప్పగించండి' అని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే సదరు కానిస్టేబుల్ రాజేష్‌కు కదిరి పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు ఫోన్ చేసి అడిగితే.. ఆమెకు తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆమె ఇంట్లో నుంచి పారిపోవడానికి తాను కారణం కాదని చెప్పారు. కేసును దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సాగర్ తెలిపారు.
'ఆ పోలీసే నా భార్యను దూరం చేశాడు'
Published Fri, Jun 26 2015 4:50 PM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement