పిల్లలు లేని ఆ దంపతులు ఓ బాబును దత్తత తీసుకుని అల్లారుముద్దుగా పెంచుకున్నారు. పెరిగి పెద్దవాడవడంతో ఆశలన్నీ అతడిపైనే పెట్టుకుని బతుకుతున్నారు. త్వరలో అతడికి పెళ్లి చేద్దామనుకున్నారు. ఇందుకోసం సొంత ఇల్లు కూడా కట్టుకుంటున్నారు. ఇంతలో ఘోరం జరిగిపోయింది. దత్తపుత్రుడి అకాల మరణంతో ఆ తల్లిదండ్రులకు గుండెకోతే మిగిలింది. ఉగాది పండగను ఎంతో సరదాగా చేసుకోవాల్సిన కుటుంబంలో విషాదం అలుముకుంది. లావేరు ఎస్‌ఐ సీహెచ్ రామారావు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం...
లావేరు: లావేరులోని వస్త్రపురి కాలనీకి చెందిన లంకపల్లి వెంకటేష్(24) గురువారం రోడ్డు ప్రమదాంలో మృతి చెందాడు. వెంకటేషన్ రణస్థలం మండలంలోని పైడిభీమవరంలోని ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం డ్యూటీ కి వెళ్లి తిరిగి మధ్యాహ్నం ద్విచక్రవాహనంపై ఇంటికి వస్తుండగా మండలంలోని బొడ్డపాడు సమీపంలో లావేరు నుంచి సుభద్రాపురం వైపు వస్తున్న మహేంద్ర లగే జీ వాహనం ఢీకొంది. దీంతో వెంకటేష్ ఎగిరిపడి రోడ్డు పక్కనున్న రాయిపై పడ్డాడు. తీవ్ర గాయాలైన అతడిని శ్రీకాకుళం రిమ్స్‌కు, తర్వాత విశాఖకు తరలిస్తుండగా మార్గంమధ్యలో అంబులెన్సులోనే మృతి చెందాడు. లావేరు ఎస్‌ఐ రామారావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్నిపోస్టు మార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చెప్పారు.
తల్లిదండ్రులకు గుండెకోత
పెంచుకున్న కొడుకు ప్రమాదంలో మృతి చెందడంతో లంకలపల్లి సత్యన్నారాయణ, నారాయణమ్మ దంపతులు బోరున విలపిస్తున్నారు. వెంకటేష్‌కు త్వరలోనే పెళ్లి చేద్దామని కొత్తగా వస్త్రపురి కాలనీలో ఇళ్లు కూడా కడుతున్నారు. ఇలాంటి తరుణంలో కొడుకు మృతి చెందడంతో ఇక తమకు దిక్కెవరంటూ తల్లితండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాలనీ వాసులు విచారం వ్యక్తం చేశారు.
రోడ్డు అధ్వానంగా ఉండడం వల్లే...
లావేరులోని ప్రభుత్వ కార్యాలయాల నుంచి బొడ్డపాడు సమీపం వరకూ సింగిల్ బీటీ రోడ్డు మాత్రమే ఉంది. రోడ్డు పక్క మట్టి బెర్ములు పాడై గోతులమయమయ్యాయి. ఎదురురెదురుగా వాహనాలు వస్తే రోడ్డు దిగడం కుదరదు. ఒక వేళ అలాంటి ప్రయత్నం చేస్తే వాహనాలు బోల్తా పడతాయి. ఇదేవిధంగా వెంకటేష్ రోడ్డు దిగలేకపోవడంతో వాహన ఢీకొని మృతి చెందాడు. మట్టి బెర్ములు పాడై సంవత్సరాలు తరబడినా వాటికి మరమ్మతులు చేయకుండా ఆర్‌అండ్‌బీ అధికారులు నిర్లక్ష్యంగా వదిలేశారు. వారి నిర్లక్ష్యం కారణంగా నిండుప్రాణం బలైపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
పండగ పూట విషాదం
Published Fri, Apr 8 2016 1:59 AM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM
Advertisement