ప్రాణం తీసిన ‘నో క్యాష్’
బ్యాంకులోనే కుప్పకూలిన వృద్ధుడు
నందికొట్కూరు: నగదు కోసం బ్యాంక్‌కు వెళ్లి గుండెపోటుతో ఓ వృద్ధుడు మృతి చెందిన ఘటన కర్నూలు జిల్లా నంది కొట్కూరులో చోటు చేసుకుం ది. పట్టణంలోని మద్దూరు సుబ్బారెడ్డినగర్‌లో నివాసం ఉంటున్న బాలరాజు(65) వెటర్నరీ డిపార్ట్‌మెంట్‌లో ల్యాబ్ అసిస్టెంట్‌గా పనిచేసి 2010లో పదవీ విరమణ ఛేశాడు. ఇతనికి భార్య, ముగ్గురు కుమా రులు. రెండవ కోడలు ఇటీవల డెలివరీ అయిన నేపథ్యంలో డబ్బు అవసరమై ఐదు రోజులుగా నగదు కోసం స్థానిక ఎస్‌బీఐ చుట్టూ తిరుగుతున్నాడు. రోజూ క్యూలో నిల్చోవడం.. డబ్బు లేదని బ్యాంకు అధికారులు చెప్పడంతో వెనుదిరగడం జరుగుతోంది. శుక్రవారం ఉదయం 9 గంటలకే బ్యాంకుకు చేరుకుని క్యూలో నిల్చోగా కౌంటర్ వద్దకు చేరుకునే లోపు బ్యాంకు అధికారులు నో క్యాష్ అని చెప్పడంతో అక్కడికక్కడే కుప్పకూలాడు.