బాబోయ్‌.. బ్యాంకులు | common man fear with SBI bank charges | Sakshi
Sakshi News home page

బాబోయ్‌.. బ్యాంకులు

Published Wed, Apr 5 2017 9:42 AM | Last Updated on Wed, Aug 29 2018 7:09 PM

బాబోయ్‌.. బ్యాంకులు - Sakshi

బాబోయ్‌.. బ్యాంకులు

ఓ వ్యక్తి రోడ్డుపై వెళుతూ వెళుతూ యథాలాపంగా పక్కనే ఉన్న బ్యాంకు వైపు చూశాడు. అంతే.. ‘మీ బ్యాంకు ఖాతాలో రూ.25 కోత విధించడమైనది..’ అంటూ అతని మొబైల్‌ ఫోన్‌లో మెసేజ్‌ వచ్చింది.

మరో వ్యక్తి ఏటీఎంలో డబ్బులు డ్రా చేసి బయటకు వస్తూ ఏటీఎం కార్డుతో మెడ మీద గోక్కున్నాడు. అంతే.. ‘మీరు మీ ఏటీఎం కార్డును ఐదుకన్నా ఎక్కువ సార్లు గీకారు. అందుకు రూ.25 సర్వీసు చార్జీ..’ అంటూ మెసేజ్‌ వచ్చింది. ఇవన్నీ నిజం కాదు. బ్యాంకులు ఖాతాదారుల నుంచి నానా రకాలుగా వసూలు చేస్తున్న చార్జీలపై సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న జోకులు.


సాక్షి, అమరావతి: బ్యాంకులు అడ్డగోలుగా విధిస్తున్న చార్జీలు ఖాతాదారులకు చిర్రెత్తిస్తున్న మాట మాత్రం నిజం. ప్రస్తుతం బ్యాంకు అన్నా, బ్యాంకు లావాదేవీ అన్నా భయపడాల్సిన పరిస్థితి నెలకొందంటే అతిశయోక్తి కాదు. డబ్బులు డిపాజిట్‌ చేసినా చార్జీ, విత్‌ డ్రా చేసినా చార్జీ. ఏటీఎం కార్డు ఎక్కువసార్లు వాడినా చార్జీ. ఇలా.. ప్రతి లావాదేవీకి బ్యాంకులు చార్జీల మోత మోగిస్తున్నాయి.

బాదుడే బాదుడు
బ్యాంకులు అవలంభిస్తున్న విధానాలతో పాత పద్ధతిలో ఇంటిలోనే డబ్బు దాచుకోవడం మంచిదన్న ఆలోచనలోకి ప్రజలు వస్తున్నారు. తాను సంపాదించిన మొత్తాన్ని ఏ రోజుకు ఆరోజు బ్యాంకులో జమ చేసేవాడినని, కానీ బ్యాంకు చార్జీల మోత మొదలు పెట్టినప్పటి నుంచి ఇంటిలోనే దాచుకోవడం మొదలు పెట్టానని విజయవాడకు చెందిన సెలూన్‌షాపు యజమాని రఘు చెపుతున్నాడంటే ప్రజల్లో బ్యాంకులపై ఎంత విరక్తి పెరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. దేశంలో అతిపెద్ద బ్యాంకయిన ఎస్‌బీఐ చార్జీల మోత షురూ చేయగా మిగిలిన బ్యాంకుల అదే దారిలో పయనించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక నుంచి ఎస్‌బీఐలో నెలలో మూడుసార్లు మించి బ్యాంకుకు వెళ్లి నగదు డిపాజిట్‌ వేస్తే సర్వీస్‌ ట్యాక్స్‌తో కలిసి రూ.50 వరకు చెల్లించాల్సి వస్తుంది. బ్యాంకు సొంత ఏటీఎంల నుంచి నెలకు 5 సార్లు మించి, ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి మూడు సార్లకు మించి నగదు తీసుకుంటే రూ.10 నుంచి రూ.20 వరకు చార్జీల విధిస్తున్నాయి. అలాగే బ్యాంకు నిబంధనల మేరకు ఖాతాలో కనీస నిల్వ ఉంచకపోయినా..రోజుల లెక్కన రూ.200 ఆపై సర్‌చార్జీ కలిపి చెల్లించాల్సి ఉంటుంది. ఇక నిర్దిష్ట కాలం తర్వాత బ్యాంకుల నుంచి వచ్చే ఎస్సెమ్మెస్‌లకు కూడా చార్జీలు వసూలు చేస్తారు.

చార్జీలే..సేవలేవీ..?
ఇన్ని చార్జీలు విధిస్తున్నా సేవలైనా సరిగా అందిస్తున్నాయా అంటే అదీ లేదు. ఏప్రిల్‌ నెల వచ్చి అప్పుడే అయిదు రోజులు గడుస్తున్నా ఉద్యోగులు జీతాలు తీసుకోలేని పరిస్థితి నెలకొని ఉంది. ఏటీఎంలు పనిచేయవు. అలాగని బ్యాంకుకి వెళితే ‘నగదు లేదు తర్వాత రండి’ అన్న సమాధానాలే చాలా చోట్ల వినిపిస్తున్నాయి. ఇంటి అద్దెలు, ఫీజులు, ఇంటికి కావాల్సిన నిత్యావసర సరుకులు కొనుక్కోలేని పరిస్థితులను రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పంటలు అమ్మిన డబ్బు బ్యాంకుల్లో వేస్తుకుని తీసుకోవాలనుకుంటే తల ప్రాణం తోకకు వస్తోం దని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆర్బీఐ పనే..!
పెద్ద నోట్ల రద్దు తర్వాత పెరిగిన డిజిటల్‌ లావాదేవీలు జనవరి రెండవ వారం నుంచి తగ్గు ముఖం పట్టడంతో, నగదు రహిత లావాదేవీలు పెంచేందుకు ఆర్‌బీఐ నగదు కొరతను సృష్టిస్తు న్నట్లు బ్యాంకు ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. మార్చి నెల మొదలైనప్పటి నుంచి నగదు సరఫరా తగ్గిపోయిందని, అడిగినంత నగదును ఆర్‌బీఐ ఇవ్వడం లేదని ఈ వ్యవహరాలను పర్యవేక్షిస్తున్న బ్యాంకు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

బ్యాంకులో డబ్బులున్నా..
 పింఛను డబ్బులు తీసుకోవడం కోసం రెండు రోజులుగా ఏటీఎంల చుట్టూ తిరుగుతున్నాను. పెద్దనోట్ల రద్దు సమయంలో ఇబ్బందులు పడ్డాం. ఆ రోజులు మళ్లీ గుర్తుకొస్తున్నాయి. ఏటీఎంలలో ఎక్కడా డబ్బులుండటం లేదు. చిల్లర ఖర్చులకు డబ్బులు లేక తెలిసిన వారి వద్ద అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బ్యాంకులో డబ్బులు ఉన్నా ఉపయోగం లేకుండా పోయింది.
 –  పి. విశ్వేశ్వరరావు, రిటైర్డు ఉద్యోగి,  కాకినాడ.

ఎక్కడ చూసినా నోటీఎంలే...
ఎక్కడా చూసినా ఏటీఎంలు కనిపిస్తున్నా వాటిల్లో నగదు మాత్రం ఉండటం లేదని కాకినాడకు చెందిన ఎల్‌.శ్రీనివాస్‌ తెలిపారు. ఇంటి అద్దె చెల్లించడం కోసం మంగళవారం మొత్తం ఏడు ఏటీఎంలు తిరిగినా ఒక్కటి కూడా పనిచేయలేదన్నారు. ఏటీఎం ఎక్కువసార్లు వాడితే చార్జీలు వేయడం కాదని, ఏటీఎంలో నగదు ఉంచనందుకు బ్యాంకులపై ఫైన్‌ విధించాలంటున్నారంటే బ్యాంకులతో ప్రజలెంతగా విసిగిపోతున్నారో అర్థమవుతుంది.

8,036 రాష్ట్రంలో మొత్తం ఏటీఎంలు
రాష్ట్రంలో గత ఇరవై రోజుల నుంచి 80 శాతానికి పైగా ఏటీఎంలు పనిచేయడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో మొత్తం 7,007 బ్యాంకు శాఖలు ఉండగా 8,036 ఏటీఎంలు ఉన్నాయి. ఒక్క విజయవాడ నగరంలోనే 449 ఏటీఎంలున్నాయి.

అడిగినంత ఇవ్వకపోవటంతో..
ఏప్రిల్‌ 1 తేదీకి తక్షణం రూ. 3,000 కోట్లు అవసరమవుతాయని, లేకపోతే రాష్ట్రంలో నగదు కొరత తీవ్రమవుతుందని ఆర్‌బీఐకి చెప్పినా ఇంతవరకు నగదు పంపలేదని ఓ బ్యాంకు ఉన్నతాధికారి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement