అమ్మానుషం
మద్యానికి డబ్బులివ్వలేదని తల్లిని చంపిన కిరాతకుడు
మాయమైపోతున్నాడమ్మ మనిషన్నవాడు.. మచ్చుకైనా కానడమ్మ మనసున్నవాడు.. మానవత్వం కనుమరుగవుతోందని ఓ కవి వ్యక్తం చేసిన ఆవేదన ఇది. కానీ కశింకోట మండలంలో జరిగింది మరింత ఘోరం. మానవ సంబంధాలకు మచ్చ తెచ్చేలా ఏకంగా కన్నతల్లినే కడతేర్చాడు ఓ కిరాతకుడు.. మద్యం తాగడానికి డబ్బులివ్వలేదని కత్తితో నరికి చంపాడు. ఏ మత్తులోనో చేసిన అఘాయిత్యం కాదిది.. చంపేస్తానని కుటుంబ సభ్యులకు చెప్పి మరీ చంపాడు. నవ మాసాలు మోసి.. కని.. పెంచినందుకు బహుమతిగా సమాజం తలదించుకునేలా అమ్మను ఇలా అంతం చేశాడు. వాడిని ఏమనాలి? పశువు అందామంటే జంతువులు సైతం తల్లిని ప్రేమిస్తాయి. రాక్షసుడు అందామంటే రక్కసి కూడా కన్నతల్లిని ఆదరిస్తాడు. మరి వీడిని ఏమనాలి?
అనకాపల్లి: ఆ కిరాతకుడు చెప్పిందే చేశాడు. కన్న తల్లి అని కూడా చూడలేదు. చంపుతానన్నాడు. కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి మరీ ముందుగానే చెప్పాడు. అంతా బెదిరింపు అనుకున్నారు. మద్యం మైకంలో మాట్లాడుతున్నాడనుకున్నారు. తల్లిని ఎందుకు చంపుతాడనుకున్నారు. అన్నంత పనీ చేశాడు. పట్టపగలే ప్రాణం తీశాడు. కన్నతల్లిని చుర కత్తితో పీక కోసి కిరాతకంగా చంపాడు. ఇదేదో పెద్ద ఆస్తుల కోసం అనుకుంటే పొరపాటే. మద్యానికి బానిసగా మారిన దుర్మార్గుడు తాగడానికి డబ్బులు ఇవ్వలేదని హత్య చేశాడు.
ఈ సంఘటన మండలంలోని నూతలగుంటపాలెం శివారు అచ్యుతాపురం గ్రామంలో మంగళవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో జరిగింది. నూతనగుంటపాలెం అచ్యుతాపురం గ్రామానికి చెందిన అప్పికొండ రాజులమ్మ (75) తనకు వచ్చే వితంతు పింఛన్ సొమ్ముతో బతుకు బండి నడిపిస్తోంది. మూడున్నర దశాబ్దాల క్రితమే భర్త అప్పలనాయుడు మృతి చెందాడు. అప్పటి నుంచి పూరి పాకలో ఒంటరిగా ఉంటూ జీవనం సాగిస్తోంది.
పెద్ద కుమారుడు జోగినాయుడు విశ్రాంత రైల్వే ఉద్యోగి. చేదోడుగా వాదోడుగా ఉంటూ జాతీయ రహదారి పక్కన రేకులతో ఇటీవల తల్లికి ఇల్లు కూడా కట్టించాడు. ఇక రెండో కుమారుడు, నిందితుడు సత్యనారాయణ (55) అదే గ్రామంలో మరో పెంకిటింటిలో ఒంటరిగా ఉంటున్నాడు. కూలి పని చేసుకుంటూ.. ఉన్న కాస్త వ్యవసాయ భూమిని సాగు చేసుకుంటూ జీవిస్తున్నాడు. మద్యానికి బానిసై వేధించడంతో భార్య పదేళ్ల క్రితం దండం పెట్టి తన ఇద్దరు పిల్లలతో రాంబిల్లి మండలం పెద కళ్లపల్లిలోని పుట్టింటికి వెళ్లిపోయింది.
నిత్యం వేధింపులే..
మద్యానికి డబ్బులివ్వమని సత్యనారాయణ నిత్యం తల్లిని వేధిస్తుంటాడు. తన వద్ద ఉన్నప్పుడు డబ్బులు ఇస్తుండేది. లేవంటే గొడవ.. ఈ బాధ భరించలేక ఆమె అప్పుడప్పుడు కశింకోటలో ఉన్న తన కుమార్తె మెరుగు నూకరత్నం, అల్లుడు వెంకటరావుల ఇంటికి వెళ్లి వస్తూ ఉండేది. తన రెండో కుమారుని నిర్వాకం గురించి మాత్రం ఆత్మాభిమానంతో ఎవరికీ తెలియనిచ్చేది కాదు. అందరికీ మంచిగానే చెబుతుండేది. ఈ నెల 6న రాజులమ్మ నెలవారీ వితంతు పింఛన్ సొమ్ము రూ.వెయ్యి అందుకుంది.
ఈ విషయం తెలుసుకున్న సత్యనారాయణ సోమవారం తల్లి ఇంటికి వెళ్లి మద్యం తాగడానికి డబ్బులు అడిగాడు. అందుకు తల్లి నిరాకరించింది. దీంతో చంపుతానని భయపెట్టాడు. అయినా లేవని పంపించేసింది. దీంతో కశింకోటలో ఉన్న తన బావ వెంకటరావుకు నాలుగైదు సార్లు, ఇతర బంధువులకు ఫోన్ చేసి తల్లి రాజులమ్మను చంపనున్నట్లు హెచ్చరిస్తూ బెదిరించాడు. అయితే మద్యం మత్తులో మాట్లాడుతున్నాడని వారు తేలికగా తీసుకున్నారు. అయితే అన్నట్లుగానే తన వద్ద ఎప్పుడూ ఉంచుకొనే చురకత్తిని తీసి మంగళవారం తల్లిని హత్య చేశాడు.
పెళ్లి పెద్దను చంపేస్తానని హెచ్చరిక
సరైన వివాహ సంబంధం తేకుండా సంసారిక సుఖం లేకుండా చేసిందంటూ అదే గ్రామంలోని పెళ్లి పెద్ద అప్పికొండ కొండమ్మను కూడా చంపుతానని సత్యనారాయణ హెచ్చరించాడని స్థానికులు తెలిపారు. దీంతో తల్లిని చంపిన వానికి ఇతరులను చంపడం ఓ లెక్కా అంటూ ఎవరికి ఎటువంటి హాని తలపెడతాడోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. సత్యనారాయణను తక్షణమే అరెస్టు చేసి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, ఇటువంటి హత్య సంఘటన చోటు చేసుకోకుండా పోలీసులు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
పోస్టుమార్టం
మృతురాలు రాజులమ్మ మృతదేహాన్ని అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై ఆమె పెద్ద కుమారుడు అప్పికొండ జోగినాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అనకాపల్లి సీఐ రామచంద్రరావు పర్యవేక్షణలో దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ సన్యాసిరావు తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, అతని కోసం తీవ్రంగా గాలిస్తున్నామన్నారు.
చిక్కంతో పరారు
తన ఇంటి ముందు వంట చేస్తూ రాజులమ్మ చేపల కూర వండుతోంది. ఈ సమయంలో మళ్లీ డబ్బులు ఇమ్మని అడిగితే ఆమె నిరాకరించింది. దీంతో కత్తి తీసి పీక ముందు భాగంలో కోసి హతమార్చాడు. రక్తపు మడుగులో ఆమె కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నా కొడుకు మనసు కరగలేదు. తల్లి వద్ద చిక్కం (సంచి)లో ఉన్న నగదు లాక్కొని సమీపంలోని పొలాల వైపు పరారయ్యాడు. రాజులమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో బంధువులు, గ్రామస్తులు నివ్వెరపోయారు. కుమార్తె నూకరత్నం, ఇతర కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.