Uppal Double Murder Case: Occult Worship Angle - Sakshi
Sakshi News home page

ఉప్పల్ తండ్రీకొడుకుల హత్య కేసు: కుంకుమ-పసుపు క్లూస్‌.. పూజలు వికటించడంతో కక్షగట్టి!

Published Tue, Oct 18 2022 8:07 AM | Last Updated on Tue, Oct 18 2022 10:36 AM

Uppal Double Murder Case: Occult worship Angle - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: సంచలనం సృష్టించిన తండ్రీకొడుకుల హత్య కేసును రాచకొండ పోలీసులు ఛేదించారు!. ఉప్పల్‌ గాంధీ బొమ్మ సమీపంలోని హనుమసాయినగర్‌కు చెందిన నర్సింహుల నర్సింహ శర్మ (78), ఆయన కుమారుడు నర్సింహుల శ్రీనివాస్‌ (45)లు గత శుక్రవారం తెల్లవారుజామున హత్యకు గురైన సంగతి తెలిసిందే. స్థిరాస్తి తగాదాలే హత్యలకు కారణమని తొలుత భావించిన పోలీసులు.. ఇప్పుడు క్షుద్ర పూజల కోణంలో దొరికిన ఆధారాలతో కేసును ఓ కొలిక్కి తెచ్చినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి సమీపంలో లభ్యమైన బ్యాగులో పసుపు, కుంకుమ పొట్లాలు లభ్యం కావడమే అందుకు కారణంగా తేలింది. 

హత్య జరిగిన అనంతరం నర్సింహశర్మ ఇంటి వద్ద పెద్ద సంఖ్యలో మహిళలు, యువకులు రావటంతో ఆ కోణంలో దర్యాప్తు చేసిన పోలీసులకు విస్తుగొలిపే విషయాలు తెలిశాయి. ప్రత్యక్ష సాక్షి నర్సింహ శర్మ ఇంటి పని మనిషి, స్థానికులను విచారించగా.. నర్సింహ శర్మ క్షుద్ర పూజలు, వాస్తు పూజలు చేసేవారని, ఈ వ్యవహారంలోనే నిందితులు ఆయనపై కక్షగట్టారని పోలీసుల ప్రాథమిక విచారణలో గుర్తించారు. సెల్‌ఫోన్‌ టవర్‌ లొకేషన్‌ ఆధారంగా హత్య అనంతరం దుండగులు విశాఖకు పారిపోయినట్లు గుర్తించి.. ప్రత్యేక బృందంతో వెళ్లిన పోలీసులు మామిడిపల్లికి చెందిన వినాయక్‌ రెడ్డి, అతని స్నేహితుడు సంతోష్‌ నగర్‌కు చెందిన బాలకృష్ణా రెడ్డిలను అరెస్టు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. 

క్షుద్ర పూజలతో చెడు జరిగిందని.. 
క్షుద్ర పూజల నేపథ్యంలో హతుడు నర్సింహ శర్మతో వినాయక్‌రెడ్డికి పరిచయం ఏర్పడిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. పూజలతో ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నష్టం వాటిల్లిందని వినాయక్‌ రెడ్డి భావించి, ఎలాగైనా పురోహితుడిని అంతమొందించాలని పగపట్టినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో స్నేహితుడు బాలకృష్ణారెడ్డితో కలిసి హత్యకు పథకం రచించినట్లు తెలిసింది.

నర్సింహ శర్మ కదలికలను తెలుసుకునేందుకు ఆయన ఇంటి ఎదురుగా ఉన్న హాస్టల్‌లో అద్దెకు దిగారు. వారం రోజుల పాటు రెక్కీ నిర్వహించి, శుక్రవారం ఉదయం బ్యాగులలో కత్తులు పెట్టుకొని నర్సింహ శర్మ ఇంట్లోకి ప్రవేశించి, గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. తండ్రిని హత్య చేసి తిరిగి వెళ్లిపోతున్న నిందితులను అడ్డుకోవటానికి ప్రయత్నించిన శ్రీనివాస్‌పై విచక్షణారహితంగా దాడి చేశారు. శ్రీనివాస్‌ మృతదేహంపై 27 కత్తిపోట్లు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది.

స్పష్టత లేని సీసీటీవీ ఫుటేజీ 
మృతుడి ఇంటిలో సీసీటీవీ కెమెరా ఉందని, కానీ కొన్ని రోజులుగా అది పనిచేయడం లేదని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. కెమెరా పనిచేయడం లేదన్న విషయం నర్సింహ శర్మకు, ఆయన కుమారుడు శ్రీనివాస్‌కు తెలియదని తెలిపారు. దర్యాప్తులో భాగంగా నిందితులు ఉన్న హాస్టల్, సమీప ప్రాంతంలోని సుమారు 200– 250 సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు సేకరించారు. వీటిలో నిందితుల ముఖాలు స్పష్టంగా రికార్డు కాలేదని, దీంతో సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా కేసును ఛేదించినట్లు తెలిపారు. 

పూర్తి వివరాలను రాబట్టేందుకు నిందితులను రహస్య ప్రాంతంలో ఉంచి, విచారణ చేస్తున్నట్లు తెలిసింది. కేసు పూర్తి వివరాలను ఒకట్రెండు రోజులలో పోలీసు ఉన్నతాధికారులు అధికారికంగా వెల్లడించనున్నట్లు సమాచారం.

సంబంధిత వార్త: తండ్రి కొడుకుల హత్య కేసు.. నేత్ర దానం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement