తుప్పల్లో శ్రీనివాసనాయుడు మృతదేహం, ఇన్‌సెట్లో డోకుల శ్రీనివాసనాయుడు(ఫైల్)
గరుగుబిల్లి (విజయనగరం) / ఎంవీపీ కాలనీ(విశాఖ తూర్పు): గత ఏడాది డిసెంబర్ 30న అదృశ్యమైన కానిస్టేబుల్ డోకుల శ్రీనివాసనాయుడు విగతజీవిగా శనివారం కనిపించాడు. స్థానిక ఎస్‌ఐ ఎం.రాజేష్ శనివారం తెలిపిన వివరాల ప్రకారం... 2009 బ్యాచ్‌కు చెందిన డోకుల శ్రీనివాసనాయుడు(38) విశాఖపట్నంలోని ఎంవీపీ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు.
ప్రస్తుతం మెడికల్ లీవ్‌లో ఉన్న శ్రీనివాసనాయుడు గత నెల 30న స్వగ్రామం గరుగుబిల్లి మండలంలోని నందివానివలసకు వచ్చాడు. అక్కడి నుంచి వ్యక్తిగత పనుల నిమిత్తం కురుపాం సమీపంలోని జోగిరాజుపేటకు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో పెదమేరంగి జంక్షన్ నుంచి నందివానివలసలోని తన ఇంటికి వెళ్లకుండా అత్యవసర పని ఉందని తల్లి సింహాచలమమ్మకు చెప్పి రాత్రి 9.15 గంటలకు మోటారు సైకిల్‌పై వెళ్లిపోయాడు. తరువాత ఖడ్గవలస, ఉల్లిభద్ర జంక్షన్ వరకు వెళ్లినట్టు ఫోన్ సిగ్నల్స్ లభించాయి. తరువాత శ్రీనివాసనాయుడు ఆచూకీ లభించలేదు. దీనిపై డిసెంబర్ 31న కానిస్టేబుల్ తండ్రి సింహాచలంనాయుడు గరుగుబిల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎల్విన్‌పేట సీఐ టీవీ తిరుపతిరావు ఆధ్వర్యంలో మూడు బృందాలు కానిస్టేబుల్ ఆచూకీ కోసం గాలించాయి. చివరకు శనివారం మధ్యాహ్నం తోటపల్లి ఐటీడీఏ పార్కు సమీపంలో తుప్పల్లో శ్రీనివాసనాయుడి మృతదేహం లభ్యమైంది. అక్కడే మోటారుసైకిల్ కూడా పడి ఉంది. ఈ మేరకు శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు.
అతివేగమే కారణమా!
శ్రీనివాసనాయుడు కానిస్టేబుల్‌గా పని చేస్తూ విశాఖ, నందివానివలసలో వ్యాపారాలు చేస్తున్నాడు. మృతునికి భార్య సౌజన్య, ఇద్దరు పిల్లలతోపాటు తల్లిదండ్రులు సింహాచలం, సింహాచలంనాయుడు ఉన్నారు. మోటారుసైకిల్‌పై వచ్చినపుడు అతివేగంతో సెల్ఫ్ యాక్సిడెంట్‌కు గురై చనిపోయాడా..? లేక వ్యాపారాల్లో ఆర్థిక లావాదేవీల్లో ఏమైనా జరిగిందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానికుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. మృతుని సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మరో పది రోజుల్లో మెడికల్ లీవ్ పూర్తి చేసుకుని విధుల్లో చేరాల్సి ఉండగా ఇలా విగతజీవిగా కనిపించడంతో గుండెలవిసేలా రోదిస్తున్నారు.
చదవండి: Nellore: నాన్న తిరిగొచ్చాడు..! నెల్లూరు చిన్నారుల ఆనందం..
Comments
Please login to add a commentAdd a comment