
కుమారుడు గణేష్‌తో తల్లిదండ్రులు
శ్రీకాకుళం, జి.సిగడాం: భవిష్యత్తుపై ఎన్నో కళలు కన్న ఆ యువకుడిని రోడ్డు ప్రమాదం మంచానికి పరిమితం చేసింది. తల్లిదండ్రులకు తీరని వేదనను మిగిల్చింది. ఇప్పటికే 20 లక్షల రూపాయలు అప్పు చేసి చికిత్స చేసినా మరో రూ.30 లక్షలు అవసరం కావడంతో కుటుంబ సభ్యులు దాతల సాయం ఆశగా ఎదురుచూస్తున్నారు. జి.సిగడాం మండలం నిద్దాం గ్రామానికి చెందిన చౌదరి వెంకటరమణ, వరలక్ష్మి దంపతుల కుమారుడు గణేష్. రాజాంలోని ఓ ప్రయివేట్ కళాశాలలో ఇంటర్ చదువుతుండగా 2018 ఏప్రిల్ 3న ఆమదాలవలస వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే జెమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో విశాఖకు తరలించారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో మెదడుకు శస్త్రచికిత్స చేశారు. అయితే మెదడులో కొంత భాగం రక్తం ప్రసరించకపోవడంతో మాట, నడక లేక మంచానికే పరిమితమయ్యాడు. తల్లిదండ్రులు కూలి పని చేసి, అప్పులు చేసి, అర ఎకరా పొలం కూడా అమ్మి సుమారు రూ.20 లక్షలు వైద్యం కోసం ఖర్చు చేశారు. యువకుడి చికిత్సకు మరో రూ.30 లక్షలు అవసరమవుతాయని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు అంత సొమ్ము తీసుకురాలేక తల్లడిల్లుతున్నారు. దాతలే కుమారుడికి ప్రాణభిక్ష పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఆదుకోవాలి..
మాది రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబం. గణేష్‌ను కాపాడుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. రోజువారీ కూలీ డబ్బులు కుటుంబ పోషణకే చాలడం లేదు. ఇంకా చికిత్స ఎలా చేయించగలం. దాతలు, ప్రభుత్వం స్పందించి నా కుమారుడ్ని ఆదుకోవాలి.– చౌదరి వరలక్ష్మి(గణేష్ తల్లి)
సాయం చేయాలనుకుంటే
చౌదరి వెంకటరమణ, స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియా, రాజాం
ఖాతా నంబరు : 20397702441,
ఐఎఫ్‌ఎస్ కోడ్: ఎస్‌బీఐఎన్ 0006216,
సెల్:9505875335