మా కష్టాలు తీరాయి.. | Many farmers shared their happiness with CM YS Jaganmohan Reddy | Sakshi
Sakshi News home page

మా కష్టాలు తీరాయి..

Published Sat, May 16 2020 3:41 AM | Last Updated on Sat, May 16 2020 3:41 AM

Many farmers shared their happiness with CM YS Jaganmohan Reddy - Sakshi

సాక్షి, అమరావతి: ‘మా కష్టాలు తీరాయి.. ఇక రైతు భరోసా కేంద్రాల ద్వారా మాకు ఎంతో మేలు జరుగుతుంది.. మా కష్టాలు పాదయాత్రలో స్వయంగా చూశారు.. ఆదుకుంటామని మాటిచ్చారు.. ఆ మాట నిలబెట్టుకున్నారు.. మీరు చేస్తున్న మేలు  మరిచిపోలేం.. వైఎస్సార్‌లాగే మీరూ నిరంతరం రైతుల కోసం పని చేస్తున్నారు’ అని పలు జిల్లాలకు చెందిన రైతులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో ఆనందం పంచుకున్నారు. వైఎస్సార్‌ రైతు భరోసా– పీఎం కిసాన్‌ పథకం రెండో ఏడాది శుక్రవారం ప్రారంభం సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పలు జిల్లాల నుంచి రైతులు, కలెక్టర్లు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డితో మాట్లాడారు. ఆ రైతుల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.

రైతులందరం మీకు రుణపడి ఉంటాం
గత ప్రభుత్వ హయాంలో సాగు కోసం రైతులు ఎక్కడెక్కడో రుణాలు తెచ్చి, అవి తీర్చలేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. కానీ మీరు వచ్చాక మా కష్టాలు తీరాయి. పెట్టుబడి ఇస్తున్నారు. రైతు భరోసా కింద మీరు ఇస్తున్న పైకం మాకు ఎంతో ఉపయోగపడుతోంది. అందుకు రైతులు మీకు రుణపడి ఉంటారు. ఇక రైతు భరోసా కేంద్రాల ద్వారా మాకు ఎంతో మేలు జరగనుంది.   ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించారు. సాగు నీటికీ ప్రాధాన్యం ఇస్తున్నారు. 
    – హెచ్‌.వెంకటేశ్వరరావు, టెక్కలి, శ్రీకాకుళం జిల్లా  

అటవీ భూముల్లో సాగుకు ఇబ్బంది లేదు
మహానేత వైఎస్సార్‌ అటవీ భూములకు పట్టాలిచ్చి మా గిరిజన రైతులకు దేవుడయ్యారు. ఇప్పుడు మాకు రైతు భరోసా ఇవ్వడం ఎంతో సంతోషం. గతంలో మాకు పట్టాలు ఇవ్వక ముందు సాగు కోసం అటవీ భూముల్లోకి వెళ్తే అటవీ సిబ్బంది కొట్టేవారు. కానీ వైఎస్సార్‌ పట్టాలు ఇచ్చాక ఆ సమస్య తీరింది. నాకు ఒక కూతురు. విజయవాడలో చదువుతోంది. మీరు అమ్మ ఒడి ద్వారా సహాయం చేసి, మాకెంతో ధైర్యం ఇచ్చారు.  మాకు కూలీలు దొరకడం లేదు. కాబట్టి ఉపాధి హామీ పథకానికి వ్యవసాయాన్ని లింక్‌ చేయండి.
    – సరస్వతి, పాడేరు, విశాఖ జిల్లా 

మీ మేలు మరవలేము
నేను 2 ఎకరాల కౌలు రైతును. గతంలో మాకు అప్పు కూడా పుట్టేది కాదు. మీరు సీఎం అయ్యాక, మాకూ సహాయం చేస్తున్నారు. దీంతో ఇబ్బంది లేకుండా పోయింది. మీరు చేస్తున్న మేలు ఎప్పటికీ మర్చిపోలేం. అమ్మ ఒడి పథకం ద్వారా కూడా మాకు మేలు జరిగింది. కరెంటు కూడా బాగా వస్తోంది. కరోనా సమయంలో రేషన్‌తో పాటు రూ.1000 ఇచ్చారు. మీ మేలు మరవలేము.
    – ఎం.సత్యనారాయణ, కరప, తూర్పుగోదావరి జిల్లా 

రైతులకు మరింత మేలు చేస్తాం : సీఎం
రైతులకు ఎంత చేసినా తక్కువే అని, రానున్న రోజుల్లో మరింత మేలు జరిగేలా చూస్తామని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయా జిల్లాల రైతులు మాట్లాడిన అనంతరం ఆయన స్పందిస్తూ.. ఈ నెల 18 నుంచి విత్తనాల సరఫరా జరుగుతుందన్నారు. హంద్రీ–నీవా కాలువ సామర్థ్యం పెంచుతామని చెప్పారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానించే విషయం కేంద్రం చేతుల్లో ఉందని,  కేంద్రం కొత్త మార్గదర్శకాలు కోరితే చెబుదామన్నారు. రానున్న రోజుల్లో పాడి పరిశ్రమకు మరింత మేలు చేస్తామని చెప్పారు. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలంలో పీడబ్ల్యూడీ ట్యాంక్‌ను రిజర్వాయర్‌గా మార్చే విషయంపై ప్రతిపాదనలు పంపాలని మంత్రి బాలినేనికి సూచించారు.  ఈ కార్యక్రమంలో వ్యవసాయ మంత్రి కన్నబాబు, సీఎస్‌ నీలం సాహ్ని, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

సాగు చక్కగా సాగుతోంది
గతంలో వ్యవసాయం చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్లం. కానీ మన ప్రభుత్వం వచ్చాక మాకు ఎంతో మేలు జరుగుతోంది. మా అత్తగారికి పింఛను వస్తోంది. వాహనమిత్ర, అమ్మ ఒడి ద్వారా సహాయం అందింది. మీ హయాంలో సాగు చక్కగా సాగుతోంది.
    – బోగి బంగారమ్మ, మహిళా రైతు, విజయనగరం 

ఇదివరకెన్నడూ ఇంత మేలు జరగలేదు
ఏనాడూ లేని విధంగా రాష్ట్రంలో ఇప్పుడు రైతులకు మేలు జరుగుతోంది. రాష్ట్రంలో రైతులందరూ సంతోషంగా ఉన్నారు. రానున్న రోజుల్లో మరింత మేలు చేసేలా మీరు ఎన్నో నిర్ణయాలు తీసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది.
– ప్రసాదరెడ్డి, వైఎస్సార్‌ కడప జిల్లా 

మంచి ధరతో పంటలు కొంటున్నారు
వ్యవసాయ రంగం ఎన్నో కష్టాల్లో ఉంటే మహానేత వైఎస్సార్‌ ఆదుకున్నారు. ఇప్పుడు మీరు వచ్చాకే మాకు మేలు జరుగుతోంది. రైతు భరోసా కింద సరైన సమయంలో ఆర్థిక సహాయం చేస్తున్నారు. ఇప్పుడు రెండో ఏడాది కూడా తొలి విడతగా రూ.7,500 ఇస్తున్నందుకు సంతోషం. మంచి ధరలతో పంటలు కొనుగోలు చేస్తున్నారు. 
    – శ్రీనివాసులురెడ్డి, కమలాపురం. వైఎస్సార్‌ కడప జిల్లా 

పాడి పరిశ్రమకు మేలు చేయండి
నాకు రైతు భరోసా ద్వారా ఆర్థిక సహాయం అందింది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో జొన్నలు అమ్మితే ఎకరాకు రూ.25 వేలు లాభం వచ్చింది. డబ్బు కూడా త్వరగా ఖాతాలో జమ చేశారు. పాడి పరిశ్రమకు మరింత మేలు చేయండి.
    – కె.సురేష్‌ బాబు, కౌలు రైతు, తెనాలి, గుంటూరు జిల్లా  

మీ నవరత్నాలతో చాలా గొప్ప మేలు
మీరు ప్రకటించిన నవరత్నాలు  చాలా గొప్పవి. రైతు భరోసా కింద చెప్పిన దానికంటే ఎక్కువే ఇచ్చారు. మాకు ధాన్యం సేకరణలో కూడా మంచి లాభం వచ్చింది.  మేము టెయిల్‌ ఎండ్‌లో ఉన్నాం. మాకు పీడబ్ల్యూడీ ట్యాంక్‌ను రిజర్వాయర్‌గా మారిస్తే, 7 గ్రామాలకు రెండో పంటకూ నీరొస్తుంది.    
– జె.హరిశ్చంద్రారెడ్డి, అల్లూరు, ప్రకాశం జిల్లా


మీది చేతల ప్రభుత్వం
వ్యవసాయం చేయలేమన్న పరిస్థితుల్లో మీరు వ్యవసాయాన్ని ఒక పండగలా మార్చారు.  రైతు భరోసా, ధరల స్థిరీకరణ నిధి, బలవన్మరణానికి పాల్పడిన రైతు కుటుంబానికి రూ.7 లక్షల సాయం, వ్యవసాయానికి పగలే 9 గంటల విద్యుత్, కౌలు రైతులకూ మేలు ఇవన్నీ రైతుల పట్ల మీ చిత్తశుద్ధి, అంకిత భావానికి రుజువు
    – కె.పాపారావు, సూరంపల్లి, గన్నవరం మండలం. కృష్ణా జిల్లా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement