సాక్షి, కర్నూలు: ఎన్నికల నేపథ్యంలో జిల్లాకు పలువురు కొత్త పోలీసు అధికారులు వచ్చారు. ఎస్పీ మొదలుకొని డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐల వరకు అంతా కొత్తవారే. ఈ క్రమంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఎన్నికల నిర్వహణ కోసం జరుగుతున్న కసరత్తు ప్రాధాన్యం సంతరించుకుంది. రెండు రాజకీయ పార్టీలు జిల్లాలో హోరాహోరీగా పోరాడుతున్నాయి. గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 11 శాసనసభ, 2 పార్లమెంటు స్థానాల్లో విజయం సాధించింది.
అదే స్థాయిలో పట్టును నిలుపుకోవాలని వైఎస్సార్‌సీపీ, గతం కంటే ఎక్కువ స్థానాల్లో పాగా వేయాలని అధికార టీడీపీ సిద్ధమవుతున్న నేపథ్యంలో పోలీసు శాఖ ‘భద్రత’పై ప్రత్యేక దృష్టి సారించింది. అభ్యర్థుల ఎంపిక నుంచే జాగ్రత్త వహిస్తూ పల్లెల వారీగా పట్టు బిగించే దిశగా ఇరు పార్టీల నాయకులు పావులు కదుపుతున్నారు. పల్లెల్లో కార్యకర్తలను పెంచుకోవడం నుంచి నేతలను బలోపేతం చేయడం వరకు ఇరు పార్టీల్లో ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి.
ఆళ్లగడ్డ, నంద్యాల, శ్రీశైలం, పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాల్లో అనేక పల్లెలు అతి సమస్యాత్మక గ్రామాల జాబితాలో ఉన్నాయి. ప్రతి ఎన్నికల్లోనూ ఇక్కడ ప్రత్యేకంగా దృష్టి ఉంటుంది. కొన్ని ఫ్యాక్షన్ గ్రామాల్లో కొన్నేళ్లుగా నిరవధికంగా పోలీసు పికెట్ నిర్వహిస్తున్నారు. ఇలాంటి చోట ఇప్పుడు భద్రత కట్టుదిట్టం చేయాల్సి వస్తోంది.
ఫ్యాక్షన్ గ్రామాల్లో సవాలుగా మారినశాంతిభద్రతలు...
జిల్లాలోని ఫ్యాక్షన్ మూలాలు ఉన్న గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణ పోలీసు శాఖకు సవాలుగా మారింది. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు ముందుగా సమస్యాత్మక, అతి సమస్యాత్మక సాధారణ గ్రామాలను గుర్తించే పనిలో పోలీసు శాఖ తలమునకలైంది. ఈసారి ‘క్రిటికల్ విలేజ్’ పేరుతో తగాదాలు జరిగే ప్రాంతాలను గుర్తిస్తోంది. ఎన్నికల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. గతంలో సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాల పేరును ఈ ఎన్నికల్లో క్రిటికల్ విలేజ్‌గా మార్చారు. ఏయే ప్రాంతాల్లో అధికంగా తగాదాలు జరుగుతాయో గుర్తించి ఆయా ప్రాంతాల్లో ఉన్న పోలింగ్ కేంద్రాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు.
71 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకం
జిల్లాలోని 28 గ్రామాల్లోని 71 పోలింగ్ కేంద్రాలను ఇప్పటివరకు పోలీసు శాఖ అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించింది. 740 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించి అందుకు అవసరమైన బందోబస్తు ప్రణాళికలను సిద్ధం చేశారు. సుమారు 20 కంపెనీల కేంద్ర బలగాలను జిల్లాకు కేటాయించాలని ఎన్నికల కమిషన్‌కు నివేదించారు. జిల్లాకు చెందిన సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ బలగాలతో కలిపి సుమారు 12 వేల మందితో బందోబస్తు ప్రణాళిక సిద్ధం చేశారు. నగదు, కానుకల తరలింపు, అక్రమ మద్యం రవాణాపై నిఘా కోసం జిల్లా వ్యాప్తంగా 42 చెక్ పోస్టులు ఏర్పాటు చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment