కరోనా వైరస్ వ్యాప్తిపై ఇప్పటికే కీలకమైన సమాచారం పరిశోధనల ద్వారా తెలిసి నా.. తెలియని విషయాలు ఇంకా ఉన్నాయి. లక్షణాలు లేని వారి నుంచీ వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉండటం ఎలా సాధ్యమనేది ఇందులో ఒకటి. వైరస్ లక్షణాలు కనిపించేందుకు సోకినప్పటి నుంచి 3 రోజులు పడుతుంది కాబట్టి ఈలోపుగా వారు ఇతరులకు వ్యాధిని వ్యాపింపజేయగలరా? అనేది కూడా స్పష్టంగా తెలియదు. ఇదెంత ఎక్కువ స్థాయిలో జరుగుతోందో నిర్ధారించేందుకు పరిశోధనలు అవసరమని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. వ్యాపించేందుకు ఎంత మోతాదులో వైరస్ అవసరం? ఏయే పరిస్థితుల్లో వ్యాపిస్తుంది? విపరీతమైన వ్యాప్తి (సూపర్‌స్ప్రెడ్స్) ప్రమాదాన్ని తప్పించడం ఎలా? లక్షణాల్లేని వారు, లక్షణాలు కనిపించడం మొదలుకాని వారి ద్వారా వ్యాప్తిని అడ్డుకోవడం ఎలా? వంటి పలు అంశాలపై ఈ పరిశోధనలు జరగాలని సూచించింది.
ఆస్తమా రోగులకు వాడే నెబ్యులైజర్ ద్వారా ఏరోసాల్స్‌ను ఉత్పత్తి చేసి పరిశీలించినప్పుడు వైరస్ గాల్లో మూడు గంటలపాటు ఉంటుందని ఒక అధ్యయనం, 16 గంటలపాటు ఉండవచ్చునని ఇంకో అధ్యయనం తెలిపాయి. ఈ నేపథ్యంలో వ్యాధిని అరికట్టేందుకు, వ్యాప్తిని నివారించేందుకు ఉన్న మేలైన మార్గం వీలైనంత తొందరగా వ్యాధిగ్రస్తులను గుర్తించడం, వారిని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందించడమేనని డబ్ల్యూహెచ్‌ఓ చెబుతోంది. బహిరంగ ప్రదేశాల్లో, సామాజిక వ్యాప్తి ఉన్న చోట్ల, భౌతికదూరం పాటించడం కష్టమైన చోట్ల ముఖానికి మాస్కు తప్పనిసరిగా ధరించాలని డబ్ల్యూహెచ్‌ఓ స్పష్టం చేసింది.
వైరస్ వ్యాప్తికి చాలా దారులు..
డబ్ల్యూహెచ్‌ఓ జారీచేసిన సైంటిఫిక్ బ్రీఫ్ ప్రకారం కరోనా వ్యాప్తికి పలు ఇతర మార్గాలు కూడా ఉన్నాయి. రోగుల మల మూత్రాల్లో వైరస్ ఉన్నట్లు పలు అధ్యయనాలు ఇప్పటికే రుజువు చేసినప్పటికీ వీటి ద్వారా ఇతరులకు వ్యాపిస్తాయని చెప్పేందుకు ప్రస్తుతానికి ఎలాంటి ఆధారాలూ లేవు. గాలి ద్వారా వైరస్ ఇతరులకు వ్యాపించవచ్చునని కొన్ని అధ్యయనాల ద్వారా తెలిసిందని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. రక్తంలోని ప్లాస్మాలో కరోనా వైరస్ ఉనికిని గుర్తించినట్లు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. వైరస్ రక్తంలోనూ తన నకళ్లను తయారు చేసుకోగలదు. కానీ రక్తం ద్వారా వైరస్ ఇతరులకు సోకుతుందా? లేదా? అన్నదానిపై స్పష్టత లేదు. ఆ అవకాశాలు తక్కువేనన్నది ప్రస్తుత అంచనా.
తల్లి ద్వారా బిడ్డకు కరోనా వైరస్ సంక్రమించే అవకాశాలు కూడా దాదాపు లేనట్లేనని, కాకపోతే ఇందుకు సంబంధించిన సమాచారం తక్కువగా అందుబాటులో ఉందని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. అయితే కరోనా బారినపడ్డ కొంతమంది తల్లుల స్తన్యంలో వైరస్ తాలూకు ఆర్‌ఎన్‌ఏ పోగులను శాస్త్రవేత్తలు ఇటీవల గుర్తించారు. కానీ ఈ పోగులు పూర్తిస్థాయి వైరస్ మాత్రం కాదు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. గబ్బిలాల ద్వారా మనుషుల్లోకి ప్రవేశించిందని భావిస్తున్న కరోనా వైరస్ తిరిగి కుక్కలు, పిల్లులు, కొన్ని ఇతర జంతువులకు వ్యాపించగలదని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇలా వైరస్ సోకిన జంతువులు మళ్లీ మానవులకు వ్యాధిని వ్యాపింపజేస్తాయా? లేదా? అన్నదానిపై మాత్రం స్పష్టత లేదు.
తెలిసింది కొంతే.. తెలియనిది ఇంకెంతో!
Published Sun, Jul 12 2020 6:12 AM | Last Updated on Sun, Jul 12 2020 6:12 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment