పోలీసు వర్గాల్లో మావోల కలకలం | Maoist insisted that the police circles | Sakshi
Sakshi News home page

పోలీసు వర్గాల్లో మావోల కలకలం

Published Tue, Dec 29 2015 1:12 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM

Maoist insisted that the police circles

విజయవాడ :  కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌పై నిందితులపై చర్యకు మావోయిస్టులు విడుదల చేసిన ప్రకటన పోలీసు వర్గాల్లో కలకలం రేపింది. విజయవాడ కేంద్రంగా మావోయిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ నుంచి అధికార ప్రతినిధి శ్యామ్ పేరుతో సోమవారం ప్రకటన వెలువడింది. అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కాల్‌మనీ సెక్స్‌రాకెట్ కేసుతో సంబంధాలు ఉన్నాయని, వాళ్లను రక్షించాలని చూస్తే ప్రజాకోర్టులో శిక్ష తప్పదంటూ మావోయిస్టు పార్టీ పేరుతో హెచ్చరిక వెలువడడం అధికార తెలుగుదేశం వర్గాలను కూడా కలవరపాటుకు గురిచేసింది. మావోయిస్టులకు షెల్టర్ జోన్‌గా విజయవాడ ఉంటున్నదని, అయితే రాజధాని కావడంతో నేరుగా ఇక్కడి నుంచే ప్రకటన వచ్చిందని పోలీసులు భావిస్తున్నారు.

గుంటూరు, ఖమ్మం జిల్లాలను బేస్ చేసుకొని కార్యకలాపాలు సాగిస్తున్న మావోయిస్టులు నేరుగా విజయవాడలో ప్రకటన విడుదల చేయడంతో తెలుగుదేశం పార్టీవారు ఆలోచనలో పడ్డారు. ఇటీవల పలు సందర్భాల్లో రాష్ట్రంలో మావోయిస్టులు లేరన్నారు. అయితే సెక్స్‌రాకెట్‌పై సుదీర్ఘ ప్రకటన విడుదల చేయడంతో పాటు సీఎం చంద్రబాబునాయుడు కేసును తప్పుదోవ పట్టించేందుకు అంగన్‌వాడీ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారని మావోయిస్టుల ప్రకటనలో ఆరోపించారు.
 టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు..
 మావోయిస్టుల ప్రకటనతో తెలుగుదేశం నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. కాల్‌మనీ సెక్స్ రాకెట్ కేసులో పెట్టుబడులు పెట్టిన వారు, దౌర్జన్యాలకు దిగిన వారు, మహిళలపై అనుచితంగా ప్రవర్తించినవారు వణికి పోతున్నారు. నగరంలో ఏమూలనైనా తమకు ఇబ్బందులు తప్పవనే ఆలోచనలో ఉన్నారు. కాల్‌మనీలో పెట్టుబడులు ఉన్న జాబితాలను ఇప్పటికే పోలీసులు తయారు చేసినట్లు సమాచారం. వీరి వివరాలు మావోయిస్టుల చేతుల్లో పడితే పరిస్థితి ఏమిటనేది కూడా తెలుగుదేశం పార్టీలో చర్చ సాగుతోంది. పైగా సోమవారం విడుదల చేసిన ప్రకటన ప్రభుత్వ అధిపతి సీఎం చంద్రబాబునాయుడు, పోలీసులను ఉద్దేశించే ఉంది.
 
పోలీసులకు సవాల్..

కాల్‌మనీ సెక్స్‌రాకెట్ కేసు పోలీసులకు సవాల్‌గా మారిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీలో పలు హోదాల్లో ఉన్నవారు నిందితులుగా ఉండడంతో ఎలాగైనా ఈ కేసు నుంచి బయట పడేందుకు వారు చేయని వ్యవహారాలంటూ లేవు. ఈ విషయాలను పరిశీలించిన మావోయిస్టులు నేరుగా హెచ్చరికలు జారీచేశారు.
 
జిల్లాలో మావోయిస్టులు..
గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో కార్యకలాపాలు సాగిస్తున్న మావోయిస్టులు జిల్లాకు కూడా కార్యకలాపాలు విస్తరించారా? అనేది చర్చకు దారి తీసింది. పశ్చిమ కృష్ణాలో సమస్యలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. రాజధాని ప్రాంతంలో భూములు కోల్పోతున్న రైతుల సమస్యలపై పోరాడాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అదే జరిగితే రాజధాని బాధితుల తరుఫున మావోయిస్టులు కూడా పోరాటం నిర్వహించే అవకాశం ఉంది. ఇటీవల కొందరు హక్కుల సంఘాల వారు ఆ ప్రాంతంలో పర్యటించి ఒక రైతుపై పోలీసుల దుశ్చర్యను ఖండించారు. దీనిపై పోలీసులు మరింత దృష్టిపెట్టి అణచివేసేందుకు ప్రయత్నించారు. దీనిని హక్కుల సంఘాల వారు హైకోర్టులో సవాల్ చేయడంతో పోలీసులు వెనకడుగు వేశారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement