
పొక్లెయిన్ దగ్ధంచేసిన మావోయిస్టులు
మండలంలోని మారు మూల జామిగూడ పంచాయతీ సాకిరేవు గ్రామం సమీపంలో గురువారం రాత్రి రోడ్డు పనులకు వినియోగిస్తున్న పొక్లెయినర్‌ను మావోయిస్టులు దగ్ధం చేశారు.
పెదబయలు: మండలంలోని మారు మూల జామిగూడ పంచాయతీ సాకిరేవు గ్రామం సమీపంలో గురువారం రాత్రి రోడ్డు పనులకు వినియోగిస్తున్న పొక్లెయినర్‌ను మావోయిస్టులు దగ్ధం చేశారు. పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల సరిహద్దు పులబంధ నుంచి జామిగూడ వరకు రూ.4.8 కోట్లతో రోడ్డు నిర్మాణం పనులు గతేడాది నుంచి నిర్వహిస్తున్నారు.
బాక్సైట్ తవ్వకాల కోసమే రోడ్డు నిర్మిస్తున్నారంటూ 40 మంది సాయుధ మావోయిస్టులు పొక్లెయినర్‌పై పెట్రోల పోసి దగ్ధం చేశారు. రోడ్డు పనులు ఆపేయాలని గతంలో అనేక మార్లు కాంట్రాక్టర్‌ను హెచ్చారించినా పట్టించుకోకపోవడంతో వాహనాన్ని దగ్ధం చేసినట్టు పేర్కొన్నారని తెలిసింది. మన్యంలో బాక్సైట్ తవ్వకాలను పూర్తిగా నిలిపివేయాలని, విప్లవం వర్ధిల్లాలంటూ సంఘటనా స్థలంలో నినాదాలు చేసినట్టు చెప్పుకుంటున్నారు.
మండలంలో ఈ ఏడాది గుల్లేలు గ్రామ సమీపంలో రోడ్డు నిర్మాణ పనులకు వినియోగించిన వాహనాలను మావోయిస్టులు దగ్ధం చేసిన విషయం తెలిసిందే. దళసభ్యుల అలజడితో గిరిజన గ్రామాల్లోని వారు భయాందోళనలకు గురవుతున్నారు.