
బీబీసీతో మావోల లొంగు‘బాట’!
మావోయిస్టుల్ని జనజీవన స్రవంతిలోకి తేవడానికి బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) రేడియోను వినియోగించుకోవాలని కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలు నిర్ణయించాయి.
కొయ్యూరు (విశాఖ జిల్లా): మావోయిస్టుల్ని జనజీవన స్రవంతిలోకి తేవడానికి బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) రేడియోను వినియోగించుకోవాలని కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలు నిర్ణయించాయి. ఈ తరహా ప్రయోగాలు ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లో సత్ఫలితాలివ్వడంతో ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతం (ఏఓబీ)లోనూ ఇందుకు శ్రీకారం చుట్టడానికి సన్నాహాలు చేస్తున్నాయి.
ఉద్యమ పథంలో ఉన్న అనేక మంది మావోలు జనజీవన స్రవంతిలోకి రావాలని భావిస్తున్నారని, లొంగిపోయినవారికి అందిస్తు న్న ప్రోత్సాహకాలపై పూర్తి స్థాయిలో ప్రచారం లేకపోవడంతో వారు వెనకడుగు వేస్తున్నారని అధికారులు చెప్తున్నారు. ఈ లోపాన్ని గుర్తించిన కేంద్ర నిఘా వర్గాలు మావోయిస్టు ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లో రేడియో ద్వారా ప్రచారం చేయడంపై దృష్టిపెట్టాయి. తొలుత ఆలిండియా రేడియో (ఏఐఆర్) ద్వారా పునరావాస కార్యక్రమాలపై ప్రచారం చేయించాయి. అయితే అది ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో ఆ వార్తల్ని మావోయిస్టులు పూర్తిగా నమ్మలేదు. దీంతో అధికారులు బీబీసీని ఎంచుకున్నారు.
ఈ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రాచుర్యం, విశ్వసనీయతను పరిగణనలోకి తీసుకుని దాని ద్వారా లొంగిపోయిన వారికిస్తున్న ప్రోత్సాహకాలు, పునరావాస కార్యక్రమాల్ని ప్రచారం చేయించారు. దీంతో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న మావోలు సైతం లొంగు‘బాట’ పట్టారని ఓ ఉన్నతాధికారి వివరించారు. 2013లో దేశ వ్యాప్తంగా 282 మంది మావోయిస్టులు లొంగిపోగా.. గత ఏడాది ఈ సంఖ్య 671కి పెరిగింది. ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లో లొంగిపోయిన అత్యధికులు బీబీసీ ప్రసారాల కారణంగానే అని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఇదే ప్రయోగాన్ని మరింత పకడ్బందీగా ఏఓబీలో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు.