మావోయిస్టులకు గంజాయి స్మగ్లర్ల ఆయుధాలు?
♦ సరఫరాలో తమిళనాడు వ్యాపారులు కీలకం
♦ ఆ దిశగా ఆరా తీస్తున్న పోలీసులు
మావోయిస్టులకు గంజాయి స్మగ్లర్ల నుంచి ఆయుధాలు సరఫరా అవుతున్నాయన్న దిశగా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇటీవల దళసభ్యులకు తుపాకులు సరఫరా చేస్తూ ఇద్దరు గిరిజనులు దొరకిపోవడంతో అప్రమత్తమయ్యారు. ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో గంజాయి క్షేత్రాలు విస్తరించడం మావోయిస్టులకు ఆయుధాలు సరఫరాకు అనుకూలంగా మారింది. ఇక్కడకు వచ్చే తమిళనాడు వ్యాపారులు ఇతర రాష్ట్రాల్లో ఆయుధాలు కొనుగోలు చేసి తీసుకువస్తున్నట్టుగా తెలుస్తోంది.
కొయ్యూరు : హిట్‌లిస్టులో ఉన్నవారిని మట్టుబెట్టేందుకు కొన్ని సందర్బాలలో మావోయిస్టులు యాక్షన్ టీంలను రంగంలోకి దించుతారు. లక్ష్యాన్ని సాధించాలంటే దగ్గర నుంచి కాల్చాల్సి ఉంటుంది. అలాంటి వారికి 9ఎంఎం పిస్టల్ వంటి చిన్న ఆయుధాలు అవసరం అవుతాయి. ఇటీవల దళసభ్యులకు తుపాకులు సరఫరా చేస్తూ చిక్కిన ఇద్దరు గిరిజనుల నుంచి పిస్టల్‌ను,దాని క్యాట్రిజ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. ఒకప్పుడు మందుపాతరలే మావోయిస్టులకు బలమైన ఆయుధాలుగా ఉండేవి. ఇప్పుడు వాటిని పోలీసులు నిలువరించడంతో చిన్న చిన్న ఆయుధాల సేకరణపై దృష్టిపెట్టినట్టు చెప్పుకుంటున్నారు.
మన్యంలోని జీకేవీధి, చింతపల్లి, జి. మాడుగుల,పెదబయలు, ఓడిశా మల్కన్‌గిరి, ఆర్. ఉదయగిరి ప్రాంతాల్లో గంజాయి వనాలు అధికంగా ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో తమిళనాడు వ్యాపారులు మకాం వేసి పెట్టుబడి పెట్టి దగ్గరుండి గంజాయి పడిస్తున్నారు. తరువాత ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు తరలిస్తున్నారు.
ఆ ప్రాంతాల నుంచే వ్యాపారులు నాటు తుపాకులను తెచ్చి మావోయిస్టులకు అందజేస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఏవోబీలో ఆయుధాల తయారీదారులు లేరు. మావోయిస్టుల డిమాండ్ మేరకు గంజాయి స్మగ్లర్లే ఆయుధాలు తెచ్చి అందజేస్తున్నట్టు భావిస్తున్నారు. గంజాయి స్మగ్లర్లుగా భావిస్తున్నవారిపై నిఘా పెంచారు. ఆయుధాల సరఫరాకు సంబంధించి లోతుగా విచారణ చేస్తున్నారు. కొన్ని నెలల కిందట లేటరైట్ (ఎర్రమట్టి)ని తరలించే వారితో మావోయిస్టులు పేలుడు పదార్థాలు తెప్పించుకున్న వైనంతో సంబంధమున్న ఏయూ అసోసియేట్ ప్రొఫెసర్‌ను అరెస్టు చేశారు. ఆ తర్వాత పోలీసులు క్వారీలపై దృష్టిపెట్టారు.