
మాజీ చైర్మన్ నంగా నరేష్‌రెడ్డి
చిత్తూరు, తిరుపతి రూరల్: ‘అరుణమ్మ అడుగుజాడల్లో 31 ఏళ్ల పాటు రాజకీయాల్లో నడిచా. ఆమె కష్టాల్లోనూ, పోరాటాల్లోనూ, విజయాల్లోనూ కలసి పనిచేశా. నాకు ఇష్టం లేకపోయినా కేవలం ఆమె కోసమే టీడీపీలోకి వచ్చా. అయితే టీడీపీలో స్వార్థం పెరిగిపోయింది. అవకాశవాద రాజకీయాలతో భ్రష్టు పట్టిపోతోంది. విలువలు లేని రాజకీయాలు చేస్తున్న టీడీపీలో ఉండలేను. ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నా’నని పాకాల మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ నంగా నరేష్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం పాకాలలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా అరుణమ్మ నాయకత్వంలోనే పనిచేశామన్నారు. ఆమె దగ్గర గౌరవంగానే నాయకుడిగా ఎదిగామన్నారు.
చంద్రగిరి బాధ్యతల నుంచి ఆమె తప్పుకున్నాక పార్టీలో జరుగుతున్న పరిణా మాలు బాధాకరంగా ఉన్నాయన్నారు. ప్రస్తుతం టీడీపీ అధికారంలో ఉంది కనుక ఆకాశమైనా తెచ్చి నీ అరచేతిలో పెడతామన్నంతగా అమలు సాధ్యం కానీ హామీలను అవలీలగా ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ఇదే పార్టీలో ఉండి తాము అవమానాలు పడలేమన్నారు. రోజుకో మాట, పూటకో పొత్తుతో రోజు రోజుకు దిగజారిపోతున్న టీడీపీలో ఆత్మాభిమానం ఉన్న నాయకులు ఉండలేరని, అందుకే ఆత్మాభిమానం ఉన్న నాయకులు టీడీపీ నుంచి బయటకు రావాలని పిలుపునిచ్చారు.