అమ్మబోతే అడవి... | market is very dull in tadepalligudem since 3 months | Sakshi
Sakshi News home page

అమ్మబోతే అడవి...

Published Wed, Feb 11 2015 5:48 AM | Last Updated on Sat, Sep 2 2017 9:09 PM

market is very dull in tadepalligudem since 3 months

- పడకేసిన అపరాల వ్యాపారం  
- కొనుగోళ్లపై రుణమాఫీ ప్రభావం
- రెతుల చేతుల్లో కాసులు లేకపోవడమే కారణం  
- మార్కెట్‌లో తగ్గిన ద్రవ్య చలామణి

 
తాడేపల్లిగూడెం : కొత్త పప్పులు మార్కెట్లోకి వచ్చే ఫిబ్రవరి నెలలో అపరాల దుకాణాల వద్ద  సందడి ఉంటుంది. కానీ.. అపరాలకు ప్రధాన మార్కెట్‌గా ఉన్న తాడేపల్లిగూడెంలో మూడు నెలలుగా మార్కెట్ మందకొడిగా ఉంది. గత ఏడాదితో పోలిస్తే దాదాపుగా 50 శాతం అమ్మకాలు పడిపోయాయి. రోజుకు రూ.70 వేల నుంచి రూ.80 వేల మేరకు వ్యాపారం సాగించే దుకాణాల్లో సైతం ప్రస్తుతం రూ.30 వేలకు మించి విక్రయాలు జరగడం లేదని చెబుతున్నారు. పెళ్లిళ్ల సీజన్, నిల్వలకు సరుకులు తీసుకెళ్లే సమయంలో బేరాలు ఊపందుకుంటాయని వ్యాపారులు భావించారు. కానీ.. ఆ పరిస్థితి మార్కెట్‌లో కనిపించడం లేదు. వివిధ కారణాల వల్ల ద్రవ్య చలామణి తగ్గడం ఒక కారణంగా చెబుతున్నప్పటికీ అసలు కారణాలను వ్యాపార వర్గాలు కచ్చితంగా అంచనా వేయలేకపోతున్నాయి.
 
ఆర్థిక సంవత్సరం చివరిలో టర్నోవర్ పడిపోవడం ఇదే ప్రథమమని వాణిజ్య పన్నుల శాఖ అధికారి బి.వెంకటేశ్వరరావు అంటున్నారు. మార్కెట్‌లో ద్రవ్య చలామణి ఎందుకు తగ్గింది? కారణాలు ఏమిటనే విషయాలను మార్కెటింగ్ అవసరాల కోసం సరుకులను సరఫరా చేసే బడా వ్యాపారులు, దళారులు సైతం అంచనా వేయలేకపోతున్నారు. అలాగని గత సీజన్ కంటే సరుకులను పెద్దమొత్తంలో నిల్వ చేసిందీ లేదు. ఉన్న కొద్దిపాటి నిల్వలకు ఆర్డర్లు రాని పరిస్థితి. ఇంతకుముందు తెచ్చుకున్న సరుకులు దుకాణాల నుంచి కదలని పరిస్థితులలో ఒక్కసారిగా పప్పుల వ్యాపారం పడకేసింది.
 
అన్ని జిల్లాల్లోనూ ఒక్కసారిగా ఇలాంటి పరిస్థితి రావడం ఇదే ప్రథమంగా వ్యాపారులు చెబుతున్నారు. అసలే బేరం లేదనుకుంటే విజిలెన్స్ దాడులు వ్యాపారులను తేరుకోకుండా చేస్తున్నాయి. మరోపక్క లెసైన్సింగ్, పన్నుల విధానంలో మార్పులు కూడా వ్యాపారాన్ని ముం దుకు సాగనివ్వడం లేదు.
 
అమ్మకాలపై రుణమాఫీ ప్రభావం
రుణమాఫీ రైతుల పాలిట శాపంగా మారింది. రెండో పంట వేసే సమయానికి రైతులు సహకార సంఘాలు, బ్యాంకులలో తీసుకున్న రుణాలను పూర్తిగా చెల్లించి కొత్త అప్పులు తీసుకోవడం లేదా రుణాన్ని తిరగ రాసుకోవడం వంటివి చేస్తారు. అప్పులకు పోను, మిగిలిన సొమ్ములు నాలుగు రూపాయలు రైతుల చేతిలో ఆడుతూ ఉంటాయి. దమ్ములు, ఊడ్పులు వంటి వాటికి కొంత ఖర్చు చేసినా.. ఎరువులు, పురుగు మందులు చాలావరకు అరువు తెచ్చుకుంటారు. పంటలు చేతికి వచ్చాక తిరిగి చెల్లించే పరిస్థితి చాలా ప్రాంతాలలో ఉంటుంది. ఇలా మొదటి పంటకు సంబంధించి సొమ్ముతో ఇంట్లోకి కావలసిన అపరాలను నిల్వ కోసం రైతులంతా కొంటుంటారు. అనుకున్నట్టుగా రుణమాఫీ జరగకపోవడంతో తొలిసారిగా రైతులు ఉన్నదంతా ఊడ్చి, ఇంట్లోని నగానట్రా తాకట్టు పెట్టి వ్యవసాయ పనులు చేసుకోవలసిన దుస్థితి దాపురించింది. చేతిలో చిల్లిగవ్వ లేని ఈ పరిస్థితిలో రైతులు నిల్వ కోసం కొనుగోలు చేసే అవకాశం లేకపోవడంతో ఒక్క సారిగా అపరాల వ్యాపారం కుదేలైంది.
 
ధరలు స్థిరం
మేలు రకం కందిపప్పు గుత్త మార్కెట్లో కిలో రూ.80 ఉంది. మినపప్పు రూ.70, శనగపప్పు రూ.50, పెసరపప్పు 6నెలలు గా కిలో రూ.110 వద్ద స్థిరంగా ఉన్నాయి. వేరుశనగ పంట దెబ్బతినడం వల్ల కిలో రూ.80 ఉంది. బన్సీ రవ్వ, మైదా రవ్వ, గోధుమ రవ్వ ధరలు కిలో రూ.27కు అటూ ఇటూగా ఉంటున్నాయి. పంచదార క్వింటాల్ రూ.2,900 ఉంది.
 
వ్యాపారాలు మందగించాయి
అపరాల వ్యాపారులు మూడు నెలలుగా సంతోషంగా లేరు. అమ్మకాలు దాదాపు 50 శాతం తగ్గాయి. ఇలాంటి పరిస్థితిని తొలిసారిగా ఎదుర్కొంటున్నారు. జనాల చేతిలో సొమ్ములాడక ఈ స్థితి వచ్చింది.
 - రామచంద్ర అగర్వాల్, అధ్యక్షుడు, చాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీస్, తాడేపల్లిగూడెం
 
పండగ లేదు.. పెళ్లిళ్ల బేరమూ లేదు
పండగలు వస్తున్నాయంటే పరమానందంగా ఉండేది. అపరాల వ్యాపారం బాగా సాగేది. సంక్రాంతి అంటే నిజంగా మాకు పెద్ద పండగే. ఈ ఏడాది ఆ బేరమూ లేదు. పోనీ నిల్వల బేరం ఉంటుందని ఆశ పడ్డాం. అదీ లేకుండా పోయింది. రైతుల చేతిలో నాలుగు రూపాయలు ఆడితే బేరం ఉంటుంది. ఇప్పుడా పరిస్థితి లేక అమ్మకాలు బాగా తగ్గాయి.
  - ఉంగరాల శ్రీనివాస్, అపరాల వర్తక సంఘ నాయకుడు, తాడేపల్లిగూడెం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement